దళారుల దోపిడీ నుంచి విముక్తి
గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేవాడిని. ఆర్‌బీకేల ద్వారా కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ప్రమేయం లేకుండా మిల్లుకు పంపడం ఆనందంగా ఉంది. నేను రూ.3.75 లక్షల విలువైన 245 బస్తాల ధాన్యం ఆర్‌బీకే ద్వారా విక్రయించాను. కొందరు రైతులు బయటి వ్యక్తులకు అమ్మి బస్తాకు రూ.300 నష్టపోయారు. ఇప్పుడు బాధ పడుతున్నారు. ప్రతి ఆర్‌బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో సకాలంలో పంటను అమ్ముకోగలుగుతున్నాం.
– సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, తూర్పుగోదావరి జిల్లా
పూర్తి మద్దతు ధర దక్కింది
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ ధాన్యం సేకరణ విధానంతో రైతుగా నాకు ఎంతో మేలు జరిగింది. నేను తొలిసారి పూర్తి మద్దతు ధర పొందాను. గతంలో ఎప్పుడూ బస్తాకు రూ.100– 200 తక్కువకు అమ్ముకునేవాడిని. ఈ సారి 3.5 ఎకరాల్లో పంట సాగు చేస్తే 95 క్వింటాళ్ల పంటను ఆర్బీకేలో విక్రయించాను. రూ.1.96 లక్షలు వచ్చింది.ఐదు రోజులు తిరక్కుండానే నా ఖాతాలో నగదు జమైంది. హమాలీ, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే పంటకు ముందుగానే డబ్బులు చేతిలోకి వచ్చాయి. గతంలో ఇంత వ్యవస్థ లేదు. ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందుకే దళారులకు అమ్ముకునే వాళ్లం.
– డి.సాయి ప్రసాద్, రైతు, కొత్తపేట, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను కాజేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కాపు కాస్తోంది. రైతు కల్లంలో ధాన్యం ఆరబోసిన దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ప్రభుత్వమే అన్నీతానై అండగా నిలుస్తోంది. ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రైతు చెంతకే మద్దతు ధరను తీసుకెళ్లాయి.
సాగుదారుల్లో ఎక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు చేస్తూ గోనె సంచుల వినియోగ చార్జీల నుంచి హమాలీల కూలి, రవాణా ఖర్చుల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. వీటి కింద ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకు రూ.14.80 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి ఖర్చుల భారాన్ని తగ్గించింది.
35 లక్షల టన్నుల సేకరణ అంచనా
ఈ ఖరీఫ్‌లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. ఈ మొత్తం దిగుబడిలో రైతులు తమ కుటుంబ, విత్తన అవసరాల కోసం 20–30 శాతం వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలిన 70 శాతం మార్కెట్‌కు వస్తుంది. ఇందులో 20–30 శాతం వరకు ఫైన్ వెరైటీలు (సన్నరకాలు) ఉంటాయి. వీటికి బహిరంగ మార్కెట్‌లో మంచి రేటు దొరుకుతుంది. మిగిలిన 40–50 శాతం సాధారణ రకాలను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది.
ఈ క్రమంలోనే 3,216 ఆర్బీకేల ద్వారా 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1.93 లక్షల మంది రైతుల నుంచి రూ.2,303 కోట్ల విలువైన 10.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 83 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.752 కోట్లు చెల్లింపు చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలోనూ 75 శాతం వరకు ధాన్యం సేకరణ పూర్తయింది. ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో కోతలు, నూర్పిడులు వేగం పుంజుకున్నాయి.
గతంలో కంటే మిన్నగా..
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 26.63 లక్షల మంది రైతుల నుంచి రూ.50,825 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మద్దతు ధర పొందుతున్న రైతులు అధికంగా ఉండటం విశేషం. ప్రభుత్వ పారదర్శక విధానాలు, మిల్లర్లు, దళారుల దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో రైతులు సంతోషంగా మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి
ఇన్నేళ్ల ధాన్యం సేకరణ చరిత్రలో ప్రభుత్వం తొలిసారిగా మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి పలికింది. ఆర్బీకే సిబ్బంది ఆధ్వర్యంలో ధాన్యం తూకం వేసి, ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు చేరిన ధాన్యంపై మిల్లరు అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.
ఫలితంగా ఆర్బీకే ఫైనల్ చేసిన తేమ శాతానికి, బరువుకు మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి రైతులకు పూర్తి మద్దతు ధరను అందిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణాలోనూ కొన్ని చోట్ల మిలర్లు రైతులను నేరుగా పిలిపించి తేమ శాతం పేరుతో ధాన్యం కోత పెట్టే ప్రయత్నం చేయడంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు వారిని కస్టమ్ మిల్లింగ్ రైస్ నుంచి బ్లాక్ లిస్టులో పెడతామని గట్టిగా హెచ్చరించారు.
ధాన్యం సేకరణతో పాటు రైతులకు పూర్తి మద్దతు కల్పనను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు సైతం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాలా వరకు ధాన్యం కోతలు యంత్రాలపై చేస్తుండటంతో పంట వేగంగా బయటకు వస్తోంది. తేమ శాతం నిర్దిష్ట ప్రమాణం 17 కంటే ఎక్కువగా ఉంటే రెండు, మూడు రోజులు ఆరబెట్టాక ఆర్బీకే సిబ్బంది ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతులకు మేలు చేసేలా పని చేస్తున్నారు.
2014–15లో అప్పటి ప్రభుత్వం రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. ఇక్కడ సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు.
చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడం ఎలా సాధ్యం? అంటే ఇక్కడ దళారులే రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధరను కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గతంలో రైతుల పేరుతో దోపిడీ
గతంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ జరిపేది. రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, కొందరు మిల్లర్లకు దోచిపెట్టేవారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బస్తాకు (75 కేజీల) మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు.
ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరుతో ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇలా రైతుల నుంచి దళారులు కొన్న ధాన్యం తిరిగి ప్రభుత్వం దగ్గరకు వచ్చేది. మద్దతు ధరను రైతుల పేరుతో దళారులు బొక్కేసేవారు.
మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే బ్లాక్ లిస్టులో పెడుతున్నాం. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు కూడా ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మిల్లరు దగ్గర తేమ శాతంలో తేడా వచ్చే అవకాశం లేదు. ఆర్బీకే ఫైనల్ చేసిందే మిల్లరు తీసుకోవాలి.
– వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ
రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు
రైతులు ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించిన తర్వాత మిల్లరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైనా సమస్యలు వస్తే ఆర్బీకే సిబ్బంది, కస్టోడియన్ అధికారి చూసుకుంటారు. రైతులకు ఎఫ్‌టీవో జనరేట్ అయిన తర్వాత అందులో చూపించిన మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రైతు ఖాతాలో జమవుతుంది. నిబంధనల ప్రకారం ధాన్యం ఉంటే ఎక్కడా ఒక్క రూపాయి కూడా మద్దతు ధర తగ్గనివ్వం.
– హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment