యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు బియ్యంపై రాజకీయ నిప్పు రాజుకుంది!! పరస్పర విమర్శలు, వాగ్వాదానికి దారితీసింది!! ‘కేవలం ముడి బియ్యం ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్‌లు ఏమిటి? మార్కెట్‌లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలా కాదు.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి... మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనాలని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్రం సేకరణ విధానం మార్చుకోవాలి’ అని సూచించగా ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’ అంటూ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ‘మాకూ సమయం వస్తుంది’ అని అన్నట్లు తెలిసింది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి చర్చించేందుకు భేటీ అయిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడితే, డిమాండ్ లేని సరుకును మార్కెట్‌లో ఎలా అమ్ముతారంటూ కేంద్రమంత్రి ప్రశ్నించడంతో సమావేశంలో వేడి రాజుకుంది. ఓ దశలో ధాన్యం సేకరణ అంశం పక్కకు వెళ్లి, రాజకీయ ప్రకటనలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లు తెలుస్తోంది.
ధాన్యం సేకరణపై జాతీయ విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులంటే, మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండంటూ పీయూష్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో భేటీ మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్.. ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కేకేలతో కూడిన బృందం.. గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎక్కువ సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించినట్లు తెలిసింది.
20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించాం: నిరంజన్‌రెడ్డి
తొలుత ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే 20 లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించామని, సాగైన మేరకు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉంటుందని, బాయిల్డ్ రైస్‌ను తీసుకునేలా కేంద్రం విధానపరమైన నిర్ణ యం చేయాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘కేవలం రారైస్ ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్‌లు ఏమిటి?, మార్కెట్‌లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలాకాదు బాయిల్డ్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి. మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి..’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు..
పీయూష్‌కు గట్టిగా బదులిచ్చిన నిరంజన్‌రెడ్డి.. ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనమని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర విధానం మార్చుకోవాలి..’అని అన్నారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో మాకూ సమయం వస్తుందంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు.
పరస్పరం వీడియోలు, క్లిప్పింగ్‌ల ప్రదర్శన
ఇదే సమయంలో వ్యవసాయం, రైతులకు మద్దతుగా 2013లో ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యాక గుజరాత్ అగ్రికల్చర్ సమ్మిట్‌లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు చూపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆలోచనలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తు తం తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చూపాలి కదా?, సానుకూల నిర్ణయాలు చేయాలి కదా? అని అన్నారు.
పీయూష్ మాట్లాడుతూ ఇది తన పరిధి కాదని, ప్రధాని స్థాయిలో నిర్ణయం చేయాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలను మంత్రులు భేటీలో ప్రస్తావిస్తే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర రాష్ట్ర నేతలు ధాన్యం పండించండి. వంద శాతం కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు..’ అని చెప్పారు. ఆయా వ్యాఖ్యల వీడియోలు చూపించారు. కాగా ప్రధాని మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను కేంద్ర అధికారి ఒకరు చూపించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment