
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై తెలంగాణ ఉద్యమం తరహాలో పోరు చేస్తామన్న సీఎం కేసీఆర్.. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం తదితరులకు సంబంధిత జిల్లా మంత్రుల ద్వారా శనివారం రాత్రే ఆదేశాలు అందాయి. భేటీ ముగిశాక సీఎం నేతృత్వంలోని మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసేందుకు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీని కూడా బృందం కలవనుంది. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ప్రస్తావించాల్సిన అంశాలకు సంబంధించిన లేఖలను సీఎస్ సోమేశ్‌కుమార్ పర్యవేక్షణలో అధికారులు సిద్ధం చేశారు. ఢిల్లీ వెళ్లే మంత్రుల బృందంలో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు మరో నలుగురు మంత్రులుండే అవకాశముంది.
ఉద్యమ కార్యాచరణపై ఉత్కంఠ
యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని తీవ్రమైన సమస్యగా భావిస్తున్న కేసీఆర్.. పార్టీ నేతలు, అధికారులు, సంబంధిత రంగాల నిపుణులతో వారం రోజులు లోతుగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచే పోరు కార్యాచరణ షెడ్యూల్‌ను ఆయన సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై రాష్ట్ర సర్కారు చేసే ఉద్యమం ఎలా ఉంటుందోనని టీఆర్‌ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో పాలనపై ప్రతికూల ప్రభావం పడకుండా ఆందోళనలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభా పక్షం, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు ఇందిరాపార్కు వద్ద గతేడాది చివరలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
రెగ్యులర్ ఆందోళనలు కాకుండా..
బంద్‌లు, రాస్తారోకోలు లాంటి రెగ్యులర్ ఆందోళన కార్యక్రమాలు కాకుండా కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలోకి నెట్టడంతో పాటు ఇతర పార్టీలూ తమ వైఖరి చెప్పాల్సిన స్థితిలోకి నెట్టేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఢిల్లీ వేదికగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలతో కలిసి సీఎం దీక్ష చేపట్టే అవకాశముంది. ఢిల్లీ దీక్షకు ముందు రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టే ఆలోచనలో ఉన్న కేసీఆర్.. సోమవారం నాటి భేటీలో కార్యాచరణ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment