సజావుగా ధాన్యం సేకరణ | Karumuri Venkata Nageswara Rao On Grain collection | Sakshi

సజావుగా ధాన్యం సేకరణ

Nov 21 2022 5:35 AM | Updated on Nov 21 2022 5:35 AM

Karumuri Venkata Nageswara Rao On Grain collection - Sakshi

సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు.  

ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్‌ చర్యలు 
ఈ క్రాప్‌ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్‌ చేయాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement