Results Out Revolutionary Changes In Grain Collection AP Govt, Details Inside - Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణలో ఫలిస్తున్న విప్లవాత్మక మార్పులు

Published Sat, Jan 21 2023 5:12 AM | Last Updated on Sat, Jan 21 2023 10:32 AM

Results out revolutionary changes in grain collection AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ఐదేళ్లలో సేకరించిన ధాన్యం కన్నా ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే సేకరించింది. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు రూ.40,236 కోట్లు వెచ్చించి 2.65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే... రైతులకు వేలుపట్టి నడిపించటం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్న వై.ఎస్‌.జగన్‌ సర్కారు ఈ మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.54,279 కోట్లు ఖర్చుచేసి 2.88 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రైతుల కష్టం దళారుల పాలు కాకూడదన్న లక్ష్యంతో ఏకంగా 3,725 రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం కొంటోంది సర్కారు. చెప్పిన గడువు ప్రకారం వాళ్లకు చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నపుడు.. 3,725 ఆర్‌బీకేల్లో కొనుగోళ్లు జరుగు­తున్నపుడు.. ఎక్కడో ఒకరో ఇద్దరో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యి ఉండొచ్చు.

అయితే ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతున్న విషయాన్ని పక్కన­బెట్టి.. ఆ ఒకటి రెండు ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు, వాళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఓ వర్గం మీడియా మొత్తం ధాన్యం సేకరణ ప్రక్రియనే తప్పుబడుతోంది. ఆ ఒకటి రెండు ఘటనల్ని మాత్రమే పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ దు్రష్పచారానికి దిగుతుండటంపై రాష్ట్ర రైతాంగం మండిపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిల్లర్లు, మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే తమ వద్ద ధాన్యాన్ని కొంటోందని, రవాణా, కూలీ, గన్నీ బ్యాగుల వంటి అంశాలను ఆర్‌బీకేలే చూసుకుంటున్నాయని, షెడ్యూలు ప్రకారం చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయని, మద్దతు ధర చెల్లించటంతో రైతులుగా తమకు పూర్తి న్యాయం జరుగుతోందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులే కాదు... ‘ఈనాడు’ పత్రిక పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని  పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్‌ కూడా ఖండించారు.  

దళారులను తొలగించటమే ఓ చరిత్ర... 
రైతుకు, ప్రభుత్వానికి మధ్య దళారులను తొలగించటమనేదే ఓ చరిత్ర. అంతేకాకుండా తన పంటను విక్రయించుకోవాలనుకున్న ప్రతి రైతు నుంచీ.. మద్దతు ధర చెల్లించి ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా పంటను కొనుగోలు చేయటం మరో చరిత్ర. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో గన్నీ బ్యాగులు, కూలీ, రవాణా రైతుల నెత్తిమీదే పడేది. పైపెచ్చు సకాలంలో రైతులకు చెల్లింపులూ జరిగేవి కావు. ఆయన ఓడిపోయి వెళ్లిపోతూ రైతులకు చెల్లించకుండా వదిలేసిన రూ.980 కోట్ల బకాయిలే ఇందుకు సాక్ష్యం. ఇలాంటివన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేసి.. రైతులను ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా... అక్కడక్కడ ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలను రైతులుగా నిలబెట్టి వారివద్ద మైకు పెట్టి మొత్తం ప్రక్రియనే విమర్శించటమనేది ‘ఈనాడు’, ప్రతిపక్షాలు అమలు చేస్తున్న వ్యూహం. నిజానికి గ్రామస్థాయిలో ఆర్‌బీకేలు వచ్చాక... ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏటికేడాది ఇంకా మెరుగుపడుతోంది. వేగం అందుకుంటోంది. ఈ సానుకూలతను ప్రతిపక్ష మీడియా మరుగునపరుస్తున్నా... రైతులు మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రశంసిస్తూనే ఉన్నారు. 

కలెక్టర్‌ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్‌ వరకు.. 
దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు తొలిసారిగా ప్రభుత్వం చెక్‌పెట్టింది. కల్లంలో ఆర్బీకే సిబ్బంది ధాన్యం తూకం వేసి, ఎఫ్‌టీవో (ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌) జనరేట్‌ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు ధాన్యాన్ని చేర్చడంతో పాటు మిల్లరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. రైతులతో సబంధం లేకుండానే వాటిని పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొలి్పంది. ఫలితంగా ఆర్బీకేలో ఖరారైన తేమ శాతానికి, తూకానికి మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితి వచి్చంది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ, పౌరసఫరాలు, టెన్నికల్‌ అసిస్టెంట్లు, పీఏసీఎస్‌ సిబ్బంది వరకు ధాన్యం సేకరణలో భాగస్వాములయ్యారు. ధాన్యం అమ్మటానికి వచ్చిన రైతుకు ఏ స్థాయిలో ఇబ్బంది కలిగినా సర్కారు వేగంగా స్పందిస్తోంది. కొంత మంది మిల్లర్లు తేమ శాతం ఎక్కువ ఉందని రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను సైతం ఆయా జిల్లా కలెక్టర్లు తిరిగి వెనక్కి ఇప్పించిన దాఖలాలున్నాయంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్బీకే ద్వారా ఎఫ్‌టీవో పొందాక రైతు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని వారికి అవగాహన కలి్పస్తున్నారు. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్‌ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1967 వివరాలను ఎఫ్‌టీవో రశీదుపై ప్రభుత్వం ముద్రిస్తోంది కూడా. 

పక్కాగా నిబంధనలు అమలు.. 
మిల్లర్ల దందాను అరికట్టే క్రమంలో ప్రభుత్వం లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లెవ్వరినీ ఉపేక్షించట్లేదు. ఈ క్రమంలోనే రైతులను మిల్లులకు పిలిచి ఇబ్బంది పెడుతున్న మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కొరఢా ఝుళిపించింది. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పశి్చమగోదావరి జిల్లాల్లో 23 మిల్లులపై కఠిన చర్యలకు ఆదేశించింది. మరోవైపు ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది టెన్నికల్‌ అసిస్టెంట్స్, 7 మంది పీఏసీఎస్‌ సిబ్బందిలో పౌరసరఫరాల శాఖ ఒకరిని తొలగించడంతో పాటు, మిగిలిన వారిని సస్పెండ్‌ చేయటం, షోకాజ్‌ నోటీసులివ్వటం వంటివి చేసింది. 

23 మిల్లులపై చర్యలు ఇలా.. 
– పశ్చిమగోదావరిలో ఒక మిల్లును బ్లాక్‌ లిస్టు చేశారు. మూడు మిల్లులకు షోకాజ్‌ నోటీలు ఇచ్చారు. 
– విజయనగరంలో మూడు మిల్లులను కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)నుంచి తప్పించారు. 
– తూర్పుగోదావరిలో మూడు రైస్‌ మిల్లులను హెచ్చరికలో భాగంగా ఐదు రోజుల పాటు డిటాగ్‌ చేశారు. 
– కృష్ణా జిల్లాలో పది మిల్లులను షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో పాటు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. 
– ఎన్టీఆర్‌ జిల్లాలో మూడు మిల్లులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

రైతులకు సమాచారం ఇచ్చాకే... 
కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే కోతలు చేపట్టడం, సంక్రాంతి కావడంతో కొనుగోళ్లు నెమ్మదించాయి. ఈ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయితే మొత్తం లక్ష్యం 35 లక్షల టన్నులు ముగుస్తుంది. ప్రభుత్వం ఎక్కడైతే పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ముగిశాయో అక్కడ క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రక్రియను ముగించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఆర్బీకే సిబ్బంది, తహసీల్దార్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా ఆమోదం పొందిన తర్వాతే.. రైతులకు సమాచారం ఇచ్చాకే ధాన్యం సేకరణ కేంద్రాన్ని మూసివేస్తారు. రైతులకు పూర్తి మద్దతు ధర వస్తుండటంతో దాదాపు అంతా ప్రభుత్వం ద్వారా విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్‌ జిల్లాలకు బ్యాంకు గ్యారెంటీల శాతాన్ని పెంచడంతో జిల్లాలకు ధాన్యం సేకరణ కేటాయింపు కూడా పెరిగింది. 

దళారులను అడ్డుకుంటున్నందుకే టీడీపీ యాగీ... 
ప్రభుత్వం ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం అండతో చెలరేగిపోయిన ఆ పార్టీ మిల్లర్లకు, దళారులకు పరిస్థితులు ఏమాత్రం రుచించటం లేదు. రైతులు తాము చెప్పిన రేటుకే గతంలో అమ్మేవారని, దానివల్ల తమకు భారీగా వచ్చే ఆదాయం మొత్తానికి ఇపుడు గండిపడిందని రగిలిపోతున్నారు. అందుకే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరైతే ప్రభుత్వం కొనుగోలు చేయదని, ధాన్యం పాడైపోతుందని, అకాల వర్షాలు దెబ్బతీస్తాయని రకరకాలుగా భయపెట్టి రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొనేశారు. ఆ దళారులే ఇప్పుడు రైతుల పేరుతో ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధరతో పాటు హామాలీ, రవాణా ఖర్చులను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారిని ప్రభుత్వం సమర్థంగా అడ్డుకోవటంతో పచ్చపత్రికలు రంగంలోకి దిగి తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయనేది రైతుల మాట.. 

జియో లొకేషన్‌ ట్యాగింగ్‌తో.. 
‘‘రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు మూసి వేయట్లేదు. తాత్కాలిక అంచనాలు ప్రకారం ఆర్బీకేలకు ధాన్యం కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చాం. చాలా వరకు ఆర్బీకేలు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు ఇంకా క్షేత్ర స్థాయిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం డేటాను సేకరిస్తున్నాం. ఇందులో అక్రమంగా బయటి ధాన్యం చొరబకుండా జియో లొకేషన్‌ ట్యాగ్‌ చేస్తూ సేకరించాల్సిన ధాన్యం వివరాలను ఫొటోల రూపంలో ప్రత్యేక యాప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తున్నాం. కొందరు దళారులు రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొని ఇప్పుడు అదే రైతుల పేరుతో అమ్మాలని చూస్తున్నారు. దీనిని అరికట్టేందుకే జియో ట్యాగ్‌ చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పండుగ సందర్భంగా కొనుగోళ్లు నెమ్మదించాయి తప్ప.. నిలిపివేయలేదు. జనవరి 13 నుంచి 19వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.17లక్షల టన్నులు సేకరించాం. 
– జి.వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ 

ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి.. 
నేను ధాన్యం విక్రయించిన ఇన్నేళ్లలో ఇంత త్వరగా ఎప్పుడూ డబ్బులు పడలేదు. ఎవరి చుట్టూ తిరగకుండానే ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసింది. మూడున్నర ఎకరాల్లో పంట వేశారు. సుమారు ఎనిమిది టన్నుల వరకు ధాన్యాన్ని అమ్మాను. నేను డిసెంబర్‌ 15వ తేదీ ధాన్యం ఇస్తే జనవరి మొదటి వారం మొత్తం రూ.1.30 లక్షలు జమయ్యాయి. గతంలో మాదిరిగా మిల్లర దగ్గరకు వెళ్లి బతిమలాడుకోలేదు. తేమ శాతంలో కోత కూడా పెట్టలేదు. నిబంధనలు ప్రకారం నాకు దక్కాల్సిన మద్దతు ధర ప్రతి పైసా వచి్చంది. మా దగ్గర ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి.  
– ఎం.అప్పలనాయుడు, వంగర మండలం, కేసీహెచ్‌ పల్లె గ్రామం, విజయనగరం జిల్లా  

ఐదు రోజుల్లో నగదు జమ అయింది 
నేను ఖరీఫ్‌లో ఐదు ఎకరాలల్లో వరి సాగు చేశాను. 110 క్వింటాలను రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం కోనుగోలు చేసింది. డిసెంబర్‌ 9న ధాన్యం ఇస్తే.. డిసెంబర్‌ 14న రూ.2,24,400 నా ఖాతాలో పడ్డాయి. 5 రోజుల్లో ధాన్యం డబ్బు జమ కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. వరి పంట సాగు చేస్తున్న రైతుకి ప్రతి సంవత్సరం ఏదో కారణంగా తీవ్ర నష్టం వచ్చేది. ఈ సారి ఆ కష్టాలను అధిగమించాం. మంచి మద్దతు ధర కూడా దక్కింది. 
– కుమరాపు శ్రీనివాసరావు, డీఆర్‌వలస, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా 

రవాణా ఖర్చులు కూడా దక్కాయి 
నాకు మూడు ఎకరాలు, నా కుమారుడికి ఒక ఎకరా చొప్పున పల్లం భూమి ఉంది. ఈ ఏడాది ఎకరాకు 30 బస్తాలు చొప్పున పంట దిగుబడి వచ్చింది. డిసెంబర్‌ 25వ తేదీన కొప్పర వలస రైతు భరోసా కేంద్రం ద్వారా 120 బస్తాల ధాన్యం విక్రయించాను. మూడు రోజులు కిందట మా ఖాతాలకు రూ.1.95 లక్షలు జమ అయ్యింది. దీనికి తోడు లోడింగ్, రవాణా ఖర్చులు కూడా పడ్డాయి. 
– యలకల జనార్ధన నాయుడు, వంగర మండలం, రుషింగి గ్రామం, విజయనగరం జిల్లా  

అంచనా దాటినా కొంటున్నాం.. 
ఈ ఖరీఫ్‌లో కాకినాడ జిల్లాలో 263 కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 2.44 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. ఇది తాత్కాలిక అంచనాను దాటింది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొంటాం. ఎక్కడా ధాన్యం కేంద్రాలను మూసివేయలేదు. జిల్లాలో 51,519 మంది రైతుల నుంచి ధాన్యం కొంటే రూ.466.61 కోట్లు చెల్లించేశాం. 
–ఎస్‌.ఇలక్కియ, జేసీ, కాకినాడ జిల్లా 

రైతులు ఆందోళన చెందొద్దు 
రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మూసివేయట్లేదు. ఒకవేళ తాత్కాలిక లక్ష్యం పూర్తయినా కూడా కొనుగోలు చేస్తాం. ఎవరూ కూడా మిల్లర్లు దగ్గరకు వెళ్లొద్దు. వారు తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కోత పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ధాన్యాన్ని ఆన్‌లోడ్‌ చేయకపోయినా కఠినంగా వ్యవహరిస్తాం. అవసరమైతే మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టి జైలుకు కూడా పంపించేందుకు వెనుకాడం. 
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement