తగ్గనున్న ధాన్యం దిగుబడి.. ఈసారి 1.06 కోట్ల టన్నుల్లోపే వచ్చే అవకాశం
వ్యవసాయశాఖ రెండో ముందస్తు అంచనాల నివేదికలో వెల్లడి
గత యాసంగితో పోలిస్తే 14 లక్షల టన్నులు తగ్గుదల
వేరుశనగ కూడా 65 వేల టన్నుల మేర తగ్గే చాన్స్
గణనీయంగా తగ్గనున్న మిగతా పంటల దిగుబడి
సాగునీరు లేకపోవడం.. పంట విస్తీర్ణం తగ్గటం.. కరువు పరిస్థితులే కారణం
దిగుబడి తగ్గే నేపథ్యంలో సన్నాలకు డిమాండ్..
పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, వ్యాపారులు.. ఈసారి బియ్యం ధరలు మరింత పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందుబాటులో లేక ఎండిపోవడం, అకాల వర్షాలు, వడగళ్ల నష్టం వంటివి దీనికి కారణమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి.. రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా. ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. గత యాసంగిలో వరి దిగుబడి 1.20 కోట్ల టన్నులుకాగా.. ఈసారి 1.06 కోట్ల టన్నులకు తగ్గుతుందని.. అంటే 14 లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది.
అలాగే మొక్కజొన్న గత యాసంగిలో 17.20 లక్షల టన్నుల దిగుబడి వస్తే.. ఈసారి 15.37 లక్షల టన్నులే వస్తుందని అంచనా. దీని దిగుబడి 1.83 లక్షల టన్నుల మేర తగ్గిపోనుంది. వేరుశనగ కూడా గత యాసంగిలోని 2.32 లక్షల టన్నుల కంటే 59వేల టన్నులు తగ్గి.. ఈసారి 1.73 లక్షల టన్నులకే పరిమితం కానుంది. ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 2.70 లక్షల టన్నులుకాగా.. ఇప్పుడు 61వేల టన్నులు తక్కువగా 2.09 లక్షల టన్నులకు పడిపోనుంది. మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
గత ఏడాది సాగు రికార్డులు..
2022–23 వానాకాలం, యాసంగి సీజన్ల పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు నమోదైంది. ఆ రెండు సీజన్లలో కలిపి ఏకంగా 2.08 కోట్ల ఎకరాల్లో పంటల సాగు నమోదైంది. ఆ ఏడాది వానాకాలంలో 1.36 కోట్ల ఎకరాల్లో సాగుకాగా.. యాసంగిలో 72.59 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు నాటి సాగు విస్తీర్ణంతో పోలిస్తే.. అది రెండింతలకు దగ్గరగా రావడం గమనార్హం.
2014–15లో రాష్ట్రంలో రెండు సీజన్లు కలిపి 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవగా.. 2020–21 నాటికి 2.03 కోట్ల ఎకరాలకు, 2022–23 నాటికి 2.08 కోట్ల ఎకరాలకు చేరాయి. కానీ ఈసారి రెండు సీజన్లు కలిపి 1.93 కోట్ల ఎకరాలకే సాగు పరిమితమైంది. అలాగే 2022–23 వరకు వరి సాగులో రికార్డుల మోత మోగింది. 2014–15లో రెండు సీజన్లకు కలిపి 35 లక్షల ఎకరాల్లోనే వరి సాగవగా.. 2022–23 నాటికి ఏకంగా 1.22 కోట్ల ఎకరాలకు పెరగడం విశేషం. అదే ఇప్పుడు 2023–24లో వరి సాగు 1.14 కోట్ల ఎకరాలకే పరిమితమైందని వ్యవసాయశాఖ నివేదిక స్పష్టం చేసింది.
సన్న బియ్యానికి డిమాండ్
యాసంగిలో ధాన్యం దిగుబడి తగ్గనున్న నేపథ్యంలో రోజువారీ ఆహారంగా తీసుకునే సన్న బియ్యానికి డిమాండ్ పెరగనుంది. దీన్ని గుర్తించిన మిల్లర్లు, వ్యాపారులు నేరుగా పొలాల వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. యాసంగి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోనే కొంత మేర ధాన్యం ఆ కేంద్రాలకు వస్తోంది. సన్నబియ్యం పండించే నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావడం లేదు.
పొలాల వద్దకే మిల్లర్లు, వ్యాపారులు
రాష్ట్రవ్యాప్తంగా కోటి టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తే.. అందులో 7 లక్షల నుంచి 10 లక్షల టన్నుల మేర మాత్రమే సన్నధాన్యం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా. దీంతో సన్నరకాలను మిల్లర్లు, వ్యాపారులు నేరుగా రైతుల కల్లాల నుంచే కొనుగోలు చేసుకొని పోతున్నారు. రాష్ట్ర మిల్లర్లు, వ్యాపారులతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఏపీలకు చెందిన వ్యాపారులు వచ్చి క్వింటాలుకు రూ.2,300 నుంచి రూ.3,000 వరకు చెల్లించి పచ్చి ధాన్యాన్ని కొంటున్నారు. కాస్త మెరుగైన ధరే కావడంతో.. రైతులు కూడా విక్రయిస్తున్నారు.
– నిజామాబాద్ జిల్లాలో గంగ, కావేరి సన్న రకాలను 2.30 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇక మహబూబ్‌నగర్‌లో కృష్ణా తీరం వెంట సన్నాలను పండించారు. ఇక్కడి రైతులు పండించిన సన్న ధాన్యాన్ని మిల్లర్లే కొనేస్తుండటంతో కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. దొడ్డు రకాల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. ఈ సీజన్‌లో 70 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్నా.. దిగుబడి తగ్గిన నేపథ్యంలో 50 లక్షల టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి.
సన్న బియ్యం ధరలు పెరిగే చాన్స్
మేలు రకం సన్న బియ్యానికి ఖరీఫ్ సీజన్‌లోనే క్వింటాల్ రూ.6,000 వరకు ధర పలికింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో జైశ్రీరాం, హెచ్‌ఎంటీ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాలకు.. నాణ్యతను బట్టి రూ.6,500 నుంచి రూ.8,500 వరకు ధర పలుకుతోంది. యాసంగిలో తగ్గిన దిగుబడి, బియ్యం కొరత కారణంగా ఈసారి బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. మార్కెట్లో ధరలు తగ్గడం లేదని, ఇప్పుడు తగ్గిన దిగుబడితో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి.
పొట్టదశలో ఎండిన వరి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో రైతు బంటు లక్ష్మయ్యకు చెందిన పొలంలో ఎండిపోయిన వరి ఇది. లక్ష్మయ్య తనకున్న మూడెకరాల భూమిలో వరి వేశాడు. బోరు వట్టిపోయి నీరు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది.
– మిర్యాలగూడ
తొమ్మిదెకరాల్లో.. ఒక్క ఎకరమూ మిగల్లేదు..
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం జయరాంతండాలో ఎండిపోయిన వరి పొలం ఇది. ఈ తండాకు చెందిన రైతు రమావత్ కీమా తనకున్న ఆరు ఎకరాలతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని యాసంగిలో వరి సాగుచేశాడు. మూడు బోర్లు ఉన్నా భూగర్భజలాలు అడుగంటి ఎండిపోయాయి. దాంతో మరో బోర్ వేయించినా లాభం లేకపోయింది. మొత్తం తొమ్మిదెకరాల్లో వరి ఎండిపోయింది. దీంతో ఆ వరి కోయించి.. పశువులకు గ్రాసంగా వేస్తున్నాడు.
– పెద్దవూర
పంటను పశువులకే వదిలేసి...
వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు కొయ్యడ బొందయ్య రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇరవై రోజుల నుంచి నీళ్లు లేక వరి పంట అంతా ఎండిపోయింది. చేసేదేం లేక వరి పంటను ఇలా పశువులకు వదిలేశాడు.
Comments
Please login to add a commentAdd a comment