సాక్షి, అమరావతి: రైతన్నను జవాద్ తుపానుతో పాటు వరదలు, అకాల వర్షాలు చివరిలో కలవరపెట్టినా ఈసారి ఖరీఫ్‌లో రికార్డు స్థాయి దిగుబడులు నమోదవుతున్నాయి. పంటకోత ప్రయోగాల అనంతరం విడుదల చేసిన రెండో అంచనా నివేదిక ప్రకారం ఈదఫా మంచి దిగుబడులొచ్చాయి. 2020 ఖరీఫ్‌లో 165.68 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు రాగా 2021 ఖరీఫ్‌లో దాదాపు 174 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు రానున్నాయి. పెరిగిన సాగు విస్తీర్ణం, సమృద్ధిగా కురిసిన వర్షాలు దిగుబడులు పెరిగేందుకు దోహదపడినట్లు అధికారులు చెబుతున్నారు. మిరప తోటలను తామర పురుగు దెబ్బ తీయకుంటే ఖరీఫ్ 2019కు దీటుగా దిగుబడులు వచ్చేవని పేర్కొంటున్నారు.
రెట్టించిన ఉత్సాహంతో సాగు..
ఖరీఫ్ 2019లో రాష్ట్రంలో 90.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా రికార్డు స్థాయిలో 194.07 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొచ్చాయి. ఖరీఫ్ చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. వరి 38.15 లక్షల ఎకరాల్లో సాగవగా 80.13 లక్షల ఎంటీల దిగుబడి వచ్చింది. కృష్ణా, గోదావరి వరదలతో ఉప్పొంగినా వరితో సహా చెరకు, పత్తి, వేరుశనగ.. దాదాపు అన్ని పంటల దిగుబడులు ఊహించని స్థాయిలో వచ్చాయి. దీంతో ఖరీఫ్ 2020లో రెట్టించిన ఉత్సాహంతో రైతులు రికార్డు స్థాయిలో 93.57 లక్షల ఎకరాల్లో సాగు చేయగా వరదలతో పాటు నివర్ తుపాను, అకాల వర్షాల ప్రభావంతో దిగుబడి 165.68 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. 40.02 లక్షల ఎకరాల్లో వరి సాగవగా 67.60 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.
రికార్డు దిశగా ధాన్యం
ఖరీఫ్ 2021లో రైతన్నలు 94.80 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. పంటకోత ప్రయోగాలు పూర్తికావడంతో రెండో తుది అంచనాల ప్రకారం ఈ ఏడాది 174 లక్షల దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. కోతల వేళ వర్షాలు, వరదలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికి దిగుబడులపై ప్రభావం చూపలేదు. ఖరీఫ్‌లో ఈసారి 40.77 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. హెక్టార్‌కు 4,933 కేజీల చొప్పున 80.46 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులొస్తున్నాయి. ధాన్యం దిగుబడుల్లో గడిచిన మూడేళ్లలో ఇదే రికార్డు. మొక్కజొన్న, కందులు, మిరప సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ మిరప పంటను తామర పురుగు చిదిమేసింది. గతేడాది 80 వేల ఎంటీల దిగుబడి వచ్చిన కందులు ఈసారి 1.19 లక్షల ఎంటీలు రానున్నాయి.
ఎకరాకు 36 బస్తాలు
రెండెకరాల్లో వరి సాగు చేశా. చివరిలో వర్షాలు కలవరపెట్టినప్పటికీ ఎకరానికి 36 బస్తాల దిగుబడి వచ్చింది. చాలా ఆనందంగా ఉంది.
– తోకల వెంకట్రావు, ఏడిద, మండపేట (తూర్పు గోదావరి)
వైపరీత్యాలకు ఎదురొడ్డి
రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి సాగు చేశా. వైపరీత్యాలను తట్టుకొని ఎకరాకు 32 బస్తాల దిగుబడి వచ్చింది. వర్షాలు, వరదలకు పైరు పడిపోలేదు. తెగుళ్లు సోకలేదు. మంచి దిగుబడులొచ్చాయి.
– టి.వీ.రావు, ఉండ్రపూడి, కృష్ణా జిల్లా
రెండేళ్ల కంటే మిన్నగా..
ఖరీఫ్ 2020తో పోలిస్తే ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరిగింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి ధాన్యం దిగుబడులు కూడా పెరిగాయి. గత రెండేళ్ల కంటే మిన్నగా ఈసారి దిగుబడులొచ్చాయి.
–హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
ఆ ప్రభావం దిగుబడులపై లేదు..
ప్రభుత్వ తోడ్పాటుతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో సాగు చేశారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాం. చివరిలో తుపాన్లు, వరదలు, వర్షాలు కొంతమేర పంటలను దెబ్బతీసినప్పటికీ ఆ ప్రభావం దిగుబడులపై పడలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
–కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment