ఈ ఏడాది ఖరీఫ్ పంటల ప్రణాళిక ఖరారు..
60 లక్షల ఎకరాల్లో పత్తి...
66 లక్షల ఎకరాల్లో వరి..
పత్తి సాగు పెద్దఎత్తున ప్రోత్సహించేలా కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పంటల ప్రణాళికను విడుదల చేసింది. ఆ ప్రణాళిక ప్రకారం రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి ఉంచనున్నారు. ఈ వానాకాలం అత్యధికంగా 66 లక్షల ఎకరాల్లో వరి, ఆ తర్వాత పత్తి 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని పేర్కొంది. గతేడాది వానాకాలం సీజన్‌లో 1.26 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఈసారి 8 లక్షల ఎకరాల్లో అధికంగా పంటల సాగు జరుగుతుందని అంచనా వేసింది.
» గతేడాది 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి 66లక్షల ఎకరాల్లో నాట్లు పడనున్నాయి.
» గతేడాది 44.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకాగా, ఈసారి అదనంగా మరో 15.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా ప్రోత్సహించనున్నారు.
» వరిసాగు కంటే పత్తినే ప్రోత్సహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అవసరమైతే వరిని తగ్గించి, పత్తినే 70 లక్షల ఎకరాలకు పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
సాగుకనుగుణంగా విత్తన ప్రణాళికను కూడా వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్‌కు 19.39 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని నిర్ణయించింది.
» అత్యధికంగా 16.50 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే కావడం గమనార్హం. పత్తి విత్తనాలు 54 వేల క్వింటాళ్లు అవసరం, సోయాబీన్ విత్తనాలు 1.49లక్షల క్వింటాళ్లు రైతులకు అందుబాటు లోకి తెస్తారు. మొక్కజొన్న విత్తనాలు 48 వేల క్వింటాళ్లు, కంది విత్తనాలు 16,950 క్వింటాళ్లు, వేరుశనగ విత్తనాలు 13,800 క్వింటాళ్లు, పెసర విత్తనాలు 4,480 క్వింటాళ్లు సిద్ధం చేశారు.
» జొన్న, సజ్జ, రాగి, మినుములు, ఆముదం, పొద్దు తిరుగుడు విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. కొంత మేరకు అందు బాటులో ఉంచామని, మిగిలిన వాటిని త్వరలో రైతులకు అందజేస్తామని అధికారులు వెల్లడించారు.
» పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో ప్రైవేట్ కంపెనీలే అందుబాటులోకి తీసుకొస్తాయి. అయితే కొన్ని కంపెనీల విత్తనాలనే రైతులు కోరుకుంటారు. ఆ మేరకు ఆయా కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచాలని కంపెనీలను వ్యవసాయశాఖ ఆదేశించింది.
» ఈసారి 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు వానాకాలం కోసం సిద్ధం చేయనున్నారు. అందు లో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా, 10 లక్షల మెట్రిక్ టన్నులు ఎన్‌పీకేను రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment