సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి విడత పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో అందించే ఏర్పాటు చేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది రైతులకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ఈసారి మరింత మందికి లబ్ధి చేకూర్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. తొలి విడతలో రూ.7,500 సాయం అందిస్తుంది. రెండో విడతలో రూ. 4 వేలు, మూడో విడతలో రూ.2 వేలు సాయం అందిస్తుంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవదాయ, అటవీ భూ సాగుదారులకు పెట్టుబడి సాయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. 2019–20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020–21లో 51.59 లక్షల కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021–22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్ల సాయమందించింది. ఇలా గత మూడేళ్లలో రూ.20,117.59 కోట్ల సాయం అందించింది. ఈ పథకం కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.7,020 కోట్లు కేటాయించింది.
గత మూడేళ్లలో లబ్ధి పొందని వారికీ అవకాశం
గతేడాది లబ్ధి పొందిన అందరూ ఈ ఏడాదీ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. చనిపోయిన, అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారు. అర్హులై ఉండి గతంలో లబ్ధి పొందని వారు రైతు భరోసా పోర్టల్‌లోని ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‘ మాడ్యూల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించి పోర్టల్‌లో వివరాలు నమోదుచేయించాలి. అటవీ భూమి సాగు చేస్తున్న రైతుల వివరాలను ఐటీడీఏ పీవోల నుంచి సేకరిస్తున్నారు. వీరి జాబితాలను కూడా ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హుల తొలగింపు, అర్హుల నమోదు ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపిస్తారు. ఏప్రిల్ 30వ తేదీలోగా అర్హులను ఖరారు చేసి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు.
సీసీఆర్సీ కార్డులున్న కౌలుదారులకు ‘భరోసా’
కౌలు రైతులు రైతు భరోసా లబ్ధి పొందడానికి కచ్చితంగా సీసీఆర్సీ కలిగి ఉండాలని నిబంధన విధించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల జారీ కోసం ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు రైతు భరోసా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తారు. వాస్తవ సాగుదారులు విధిగా వ్యవసాయాధికారులను సంప్రదించి తమ వివరాలు సీసీఆర్సీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అర్హతనుబట్టి మే 1నుంచి సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. వీరు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయాలి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హులను గుర్తిస్తారు. వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ అందుతుంది.
అర్హత పొందని వారికి అవకాశం
వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకాన్ని ఈ ఏడాది మరింత పగడ్బందీగా అమలు చేస్తున్నాం. గతేడాది లబ్ధి పొందిన వారి జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నాం. అనర్హులను తొలగించడంతో పాటు గడిచిన మూడేళ్లలో అర్హత పొందని వారు పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాం. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తాం.
–హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్
అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి
ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతకు అండగా నిలిచే విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. గత మూడేళ్లుగా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం.
– కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment