
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరల పెంపుతో పాటు యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న దోబూచులాటలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈనెల 15 నుంచి 20 వరకు ఆరు రోజుల పాటు గ్రామాలకు బృందాలుగా వెళ్లనున్నారు. పంటపొలాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడి అన్ని విషయాలను వారికి వివరించాలని కాంగ్రెస్ నేతలు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని కోరుతూ ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టనున్నారు. అదే రోజున టీపీసీసీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. కాగా, ఈ నెలాఖరులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇక ఏప్రిల్ మొదటి వారమంతా ఢిల్లీ పర్యటనలు, పార్లమెంటు సమావేశాలు, రాహుల్‌తో 40 మంది నాయకుల భేటీ, విద్యుత్‌సౌధ ముట్టడి లాంటి కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తాజా షెడ్యూల్‌తో ఈ నెలంతా బిజీబిజీగా గడపనున్నారు. ఓవైపు ప్రజల పక్షాన ఆందోళనలు, మరోవైపు పార్టీ అంతర్గత సర్దుబాట్లలో మమేకం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment