‘భరోసా’ ఇచ్చేందుకేనా..? | Rahul to visit Telangana on Saturday | Sakshi
Sakshi News home page

‘భరోసా’ ఇచ్చేందుకేనా..?

Mar 7 2019 4:50 AM | Updated on Mar 18 2019 9:02 PM

Rahul to visit Telangana on Saturday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన అనూహ్యంగా ఎందుకు ఖరారైంది? కర్ణాటక నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రాహుల్‌ అధికారిక షెడ్యూల్‌ హైదరాబాద్‌ వైపు ఎందుకు మళ్లింది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం వినిపిస్తోంది. అదే ‘భరోసా’. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా ఇప్పించేందుకే రాహుల్‌ పర్యటన ఖరారయిందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాక మరింత మంది ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకే రాహుల్‌ ఈ పర్యటన నిర్వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇంకా ఉన్నారా?
రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్‌ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో కొందరు చేజారిపోతారనే చర్చ జరుగుతోంది. ఎప్పుడు, ఎవరు వెళ్తారనే దానిపై కాంగ్రెస్‌లోనే పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది వరకు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారుతారని మొదటి నుంచీ వినిపిస్తున్న పేర్లలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. దీంతో పార్టీ వీడుతారన్న ప్రచారంలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలూ చేజారిపోతారేమో అనే ఆందోళన టీపీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంపై పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం.

ఈ నివేదికతో పాటు తమకున్న సమాచారం ఆధారంగా మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండాలంటే వారితో నేరుగా మాట్లాడాల్సిందేనని నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించే కన్నా ఎలాగూ కర్ణాటకకు వస్తున్నందున అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లి ఎమ్మెల్యేలతో భేటీ కావాలని, వారికి పార్టీ పరంగా స్పష్టమైన భరోసా ఇవ్వాలని రాహుల్‌ కార్యాలయం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిధిలో సమావేశం నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. తొలుత పహాడీషరీఫ్‌ దర్గా సమీపంలో బహిరంగ సభ అనుకున్నా.. ఆ తర్వాత దాన్ని మార్చి శంషాబాద్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌లో రాష్ట్రంలోని బూత్‌కమిటీల ముఖ్యులతో సమావేశం నిర్వహించే యోచనలో ఉంది. రాహుల్‌ వచ్చినప్పటి నుంచి ఢిల్లీ వెళ్లేలోపు అందరు ఎమ్మెల్యేలు కలిపించేలా ఏర్పాట్లు చేస్తోంది.

రాహుల్‌ టూర్‌ ఖరారవుతుందిలా
ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో రాహుల్‌ టూర్‌ ఖరారు ప్రక్రియకు పెద్ద కసరత్తే ఉంది. ఆయన ఏ రాష్ట్రంలో పర్యటించాలన్నా తొలుత ఆయా రాష్ట్ర పీసీసీ నేతలు ఢిల్లీ వెళ్లి ఆయన మౌఖిక అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2 లేదా 3 టూర్‌ షెడ్యూళ్లను రాహుల్‌ కార్యాలయానికి పంపితే సమయాన్ని బట్టి ఏదో ఒక షెడ్యూల్‌ను రాహుల్‌ సిబ్బంది ఖరారు చేస్తారు. ఆ సమాచారాన్ని రాహుల్‌కు పంపి ఆయన అధికారికంగా ఓకే చెప్పాక పీసీసీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. ఎంత హడావుడిలో అయినా ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. కానీ ఈసారి ఉన్నట్టుండి రాహుల్‌ రాష్ట్ర పర్యటన ఖరారు కావడం గమనార్హం.

కొన్ని సందర్భాల్లో అధిష్టానమే నేరుగా రాహుల్‌ సభల గురించి సమాచారమిస్తుందని, ముందు ఖరారు చేశాక సమాచారం ఇచ్చి ఏర్పాట్లు చేయాలని సూచిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. కనీస ఆదాయ వాగ్దాన పథకాన్ని వివరించేందుకు రాహుల్‌ రాష్ట్రానికి వస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ పథకం ఓట్లు రాలుస్తుందనే అంచనాలో ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలున్నారు. ఈ పథకాన్ని వివరించే సభకు అన్నీ సానుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకుంటారే తప్ప ఇటీవలే పరాజయం ఎదురైన రాష్ట్రాన్ని, రాష్ట్రం ఇచ్చినా వరుసగా రెండోసారి ఖంగుతిన్న రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకుంటారనేది కాంగ్రెస్‌ వర్గాల్లో సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement