కాంగ్రెస్‌లో ‘రాహుల్‌’ పర్యటన చిచ్చు ! | Komatireddy Brothers Rahul Gandhi Tour In Nalgonda | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘రాహుల్‌’ పర్యటన చిచ్చు !

Published Sun, Aug 19 2018 11:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Komatireddy Brothers Rahul Gandhi Tour In Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో ఊపు రావాల్సింది పోయి, శ్రేణులు ఉసూరు మంటున్నాయి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా తమదైన ముద్ర వేసే కోమటిరెడ్డి సోదరులు అధినేత బహిరంగ సభకు దూరంగా ఉండడం చర్చనీయాంశం అయ్యింది. పీసీసీ నాయకత్వం వీరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వక పోవడం వల్లే దూరంగా ఉన్నారా? మరేదైనా బలమైన కారణం ఉందా ? అన్న చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో తొలిరోజు కనిపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ మరుసటి   రోజు జరిగిన బహిరంగ స¿భకు హాజరు కాలేదు.

వీరు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండడంతో సహజంగానే కోమటిరెడ్డి అనుచర వర్గమంతా దూరంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా జన సమీకరణ చేయాల్సిన జిల్లాల్లో నల్లగొండ కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్‌కు సమీంలో ఉండడం, ఇక్కడ కాంగ్రెస్‌ శ్రేణులు బలంగా ఉండడం ఓ కారణంగా చెబుతారు. కానీ, రాహుల్‌గాంధీ పర్యటనలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ అంశమే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రేపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.

గైర్హాజరీపై సర్వత్రా చర్చ !
కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఆశించిన కోమటిరెడ్డి సోదరులు ఆ దిశలో ప్రయత్నమూ తక్కువేం చేయలేదు. కారణాలు ఏవైనా వీరికి పీసీసీ సారథ్యం దక్కలేదు. ఈ కారణంగానే ఒక విధంగా రాష్ట్ర నాయకత్వానికి సమాంతరంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో సైతం దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏఐసీసీ నాయకత్వం పాల్గొనగా జరిగిన నల్లగొండ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశన్ని విజయవంతం చేశారు. ఇదే నేపథ్యంలో జరిగిన జాతీయ అధ్యక్షుడి కార్యక్రమంలో ఒకరోజు పాల్గొని ఆ తర్వాత దూరంగా ఉండడంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ బహిరంగ సభకు వీరికి సరైన ఆహ్వానం లేదని అంటున్నారు. అంతే కాకుండా జన సమీకరణ చేయాలని కూడా కోరలేదని చెబుతున్నారు.
 
రాష్ట్ర నాయకత్వం తీరుతోనే..
ఇలా.. గుర్తింపు ఇచ్చే విషయంలో పీసీసీ నాయకత్వం అవలంబించిన తీరుపై ఆగ్రహంతోనే వీరు సభకు, రాహుల్‌ పర్యటనకు దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. తమ నేతలే కార్యక్రమానికి దూరంగా ఉండడంతో, అనుచర వర్గం కూడా దూరంగా ఉన్నారని అంటున్నారు. బయటకు కనిపించని బలమైన కారణం లేకుండా జాతీయ అధ్యక్షుడి కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉంటారన్న భిన్నమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న నేతలంతా సీనియర్లు, రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యులు కావడం, సమ ఉజ్జీలుగా ఉన్న ఈ నేతలంతా కలిసి పనిచేయడంలో సమస్యలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సరైన ఆహ్వానం, బాధ్యతల అప్పగింతలో పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో కోమటిరెడ్డి సోదరులు కినుక వహించారని, ఈ కారణంగానే దూరంగా ఉండి ఉంటారని అంటున్నారు. ఈ ఉదంత మరోసారి జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు, నేతల మధ్యన ఉన్న దూరాన్ని పట్టి చూపిందని పేర్కొంటున్నారు. మొత్తంగా జాతీయ అధ్యక్షుడి సభకు హాజరు కాకుండా కోమటిరెడ్డి వార్తల్లో నిలిచారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement