Komati reddy brothers
-
అదే బరి.. వీరులు వారే..
మేకల కళ్యాణ్ చక్రవర్తి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు. నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! నిజామాబాద్ బోధన్‌లో గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్ అహ్మద్, సుదర్శన్‌రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్ రూరల్లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్ (బీఆర్ఎస్), భూపతిరెడ్డి (కాంగ్రెస్)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్‌కుమార్ ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. ఆదిలాబాద్ సిర్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్ఎస్)పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్ఎస్), జి.వినోద్‌లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్.దివాకర్‌రావు (బీఆర్ఎస్), కె.ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్‌లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీలో నిలిచారు. ఖమ్మం పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్ఎస్) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరిప్రియానాయక్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్రాజ్లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్‌రాజ్ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్ఎస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్), తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. మెదక్ అందోల్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్), చంటి క్రాంతి కిరణ్ (బీఆర్ఎస్)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్), చింత ప్రభాకర్ (బీఆర్ఎస్)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్‌రెడ్డి (బీఆర్ఎస్), శ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు. వరంగల్ డోర్నకల్‌లో రెడ్యానాయక్ (బీఆర్ఎస్), రామచంద్రునాయక్ (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్), పెద్ది సుదర్శన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్ఎస్), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. రంగారెడ్డి జిల్లా మల్కాజ్‌గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్.రాంచందర్‌రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద (బీఆర్ఎస్), కూన శ్రీశైలం గౌడ్ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం జనరల్ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్లోనూ మెతుకు ఆనంద్ (బీఆర్ఎస్), గడ్డం ప్రసాద్‌కుమార్ (కాంగ్రెస్) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)పై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్ఎస్), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు. పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్), విజయరమణారావు (కాంగ్రెస్) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్)పై బండి సంజయ్ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్ (బీఆర్ఎస్), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ (బీఆర్ఎస్)పై పాతకాపు కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం. నల్లగొండ దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్ (కాంగ్రెస్), రవీంద్రకుమార్ (బీఆర్ఎస్) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్), బొల్లం మల్లయ్య (బీఆర్ఎస్), సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్ఎస్), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్), కె. ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి (బీఆర్ఎస్), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్ కొడంగల్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్ఎస్), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్ (బీఆర్ఎస్), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్), హర్షవర్దన్‌రెడ్డి (బీఆర్ఎస్) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. -
34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘34 ఏళ్లుగా పనిచేసినా హోంగార్డు ఒక్కోసారి కానిస్టేబుల్ కూడా కాలేడు. సివిల్స్ రాసి జిల్లా ఎస్పీ అయినవాళ్లను పట్టుకుని.. 34 ఏళ్లుగా నేను ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉన్నా.. నువ్వెట్లా ఎస్పీ అవు తావు అంటే ఎలా ఉంటుంది? ఎవరికైనా అర్హతలను బట్టే పదవులు, హోదాలు వస్తా యి’ అని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో పరిస్థితులు సందర్భాన్ని బట్టి మారుతుంటాయన్నారు. 2018లో బండి సంజయ్ ఎక్కడ ఉన్నారు, ఇప్పుడేమయ్యా రని ప్రస్తావించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. కేంద్రం నుంచి పనులు వచ్చాయా లేదా? ‘నా ప్రశ్నలకు రాజగోపాల్‌రెడ్డి సమాధానా లు చెప్పాలి. జార్ఖండ్‌లో రూ.21 వేల కోట్ల టెండర్ పనులు కోల్ ఇండియా ద్వారా మీ సంస్థకు వచ్చాయా, లేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మీకు పనులు రాలేదా? రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ప్రాజె క్టులో మీకు పనులు వస్తే కొంత పనులు చేశాక ఎక్కువ కమీషన్లు తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బదిలీ చేశారా లేదా? పార్టీ కార్యక్రమా ల్లో పాల్గొనకుండా.. 2009లో నేరుగా వచ్చి ఎంపీగా నామినేషన్ వేశావ్. మరి నేరుగా ఓ వ్యాపారస్తుడికి 2009లో బీఫారం ఇచ్చి ఎంపీగా నిలబెట్టినప్పుడు.. 40 ఏళ్లుగా నల్లగొండ జిల్లాలో ఉన్న పార్టీ వారికి అన్యాయం జరగలేదా? బీజేపీలో చేరుతున్న నువ్వు.. మునుగోడులో గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ నేత మనోహర్‌రెడ్డిని ఇప్పుడూ నిలబెడతావా? లేక నువ్వే పోటీ చేస్తావా? ప్రజలకు మీ అసలు రంగు తెలిసిపోయింది. కష్టకాలంలో పార్టీని వదిలేసి.. కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడి కొట్లాడుతున్నది ఎవరో, వ్యాపార లావాదేవీల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎలా వ్యవహరిస్తు న్నారో మునుగోడు ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు మీరు చేరబోయే పార్టీలో కండువా కప్పుకున్న ఒక్కరోజు మాత్రమే పండుగ. రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీ తీసుకొచ్చిన మాజీ ఎంపీ వివేక్ మొహం 3 నెలల తర్వాత అలానే సంతోషంగా ఉంటుందా లేదా చూద్దాం’ అని రేవంత్ పేర్కొన్నారు. కోమటి రెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, దీనిపై పార్టీ తగిన చర్య తీసుకుంటుందని చెప్పారు. చదవండి: తెలంగాణలో ఉన్నది.. ‘పసుపు కాంగ్రెస్’! -
టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు రేవంత్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాణం పోయినా సరే కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ రేవంత్ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని అసంతృప్త నేతలు చెప్తున్నారు. వీరే కాకుండా ఇంకా ఎవరెవరు తెరపైకి వస్తారోనన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తీవ్ర ఆరోపణలతో.. రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని శ్రవణ్ విమర్శించారు. ఏఐసీసీ నుంచి ఓ ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి కూడా ఇంతకుముందే తీవ్ర ఆరోపణలు చేశారు. చేయకూడని పనులు చేసే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని, జైలుకు వెళ్లొచ్చినవారి నేతృత్వంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగలేనని వ్యాఖ్యానించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతుందని విమర్శించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తీరును తప్పుపట్టారు. తనతో సహా పాత కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అంతా వెళ్లిపోతే టీడీపీ వాళ్లను తెచ్చుకుని టికెట్లు ఇచ్చుకోవాలనేది రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే.. రేవంత్‌రెడ్డి గత ఏడాది జూలైలో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. చాలా విషయాల్లో రేవంత్ ఏకపక్షంగా వెళుతుండటం వల్లే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు బయటికి వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. టీపీసీసీ కార్యవర్గంలో నియమితులైన పలువురు సీనియర్లతో రేవంత్‌రెడ్డికి పొసగడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల మధ్య సమన్వయం కుదరక.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చాలా కాలం క్రితమే రేవంత్‌తో విభేదించారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌పై మహేశ్వర్‌రెడ్డి మాటల దాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్లోనూ రేవంత్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి తర్వాత కీలక హోదాలో ఉన్న తనను రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెడుతున్నారన్న అభిప్రాయంతో మధుయాష్కీ ఉన్నారని పేర్కొంటున్నాయి. నిజామాబాద్ జిల్లా పార్టీ విషయంలో రేవంత్‌తో ఆయనకు సఖ్యత కుదరక అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. కీలక నేతలు కూడా దూరం దూరంగా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న నలుగురు నేతలు కూడా రేవంత్ వైఖరి పట్ల మనస్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. టి.జగ్గారెడ్డి (సంగారెడ్డి), మహేశ్‌కుమార్‌గౌడ్ (నిజామాబాద్), అంజన్‌కుమార్ యాదవ్ (హైదరాబాద్), గీతారెడ్డి (మెదక్)లు పలు సందర్భాల్లో రేవంత్ వైఖరితో విభేదించిన ఘటనలు ఉన్నాయి. జగ్గారెడ్డి మొదటి నుంచీ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మిగతా నాయకులు గుంభనంగా ఉంటున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలోని ఏకైక ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కూడా రేవంత్ ఇప్పటికీ సఖ్యత కుదుర్చుకోలేకపోయారని.. ఉత్తమ్, భట్టి, వీహెచ్ లాంటి సీనియర్లను కలుపుకొని పోయే అంశాన్నీ రేవంత్ పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చేరికలు.. క్రమశిక్షణల విషయంలో.. కాంగ్రెస్‌లో కీలకమైన రెండు కమిటీల విషయంలో రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఒకట్రెండు చేరికల ప్రతిపాదనలు వివాదానికి కారణమయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్, పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన నేత ఎర్రశేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఆయా జిల్లాల నాయకత్వాలు రేవంత్‌తో విభేదించాయి. తర్వాతా పలుచోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి ఎవరిని చేర్చుకోవాలనే అంశంలో సీనియర్లతో కమిటీ వేయాలని నిర్ణయించారు. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చేసినా.. తర్వాత రేవంత్ చక్రం తిప్పి జానారెడ్డి పేరు ప్రకటించేలా చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరిగింది. ఆ తర్వాత జానారెడ్డికి కూడా చెప్పకుండానే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలున్నాయి. పార్టీలో ధిక్కార స్వరాలను నియంత్రించాలనే లక్ష్యంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తన జిల్లాకు చెందిన నాయకుడు చిన్నారెడ్డిని రేవంత్ నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ శిబిరం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇస్తారనే విమర్శలూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రేవంత్ విషయంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటన, పార్టీ పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాల్లో జరుగుతున్న కసరత్తు, పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకంలో తాత్సారం, పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత వంటి అంశాల్లో రేవంత్‌రెడ్డిపై చాలా మంది సీనియర్లు కినుకగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు అయినా ఇవన్నీ సర్దుకుంటాయా, మరింత ముదిరి పార్టీ పుట్టి మునుగుతుందా అంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి.. నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి -
జెడ్పీ బరి.. హోరాహోరీ!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా.. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎక్కడికక్కడ స్థానికంగా ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. మరికొన్ని మండలాల్లో టీఆర్ఎస్ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సీట్లను సర్దుబాటు చేసుకుంది. అయితే.. జెడ్పీటీసీ స్థానాలను వదులుకోకుండా.. ఎంపీటీసీ స్థానాలను వదిలేసి, జెడ్పీటీసీ స్థానాల్లో తమకు మద్దతు పలికేలా, ఎంపీపీల ఎన్నికల్లో మద్దతు పలికేలా ఒప్పందాలు చేసుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఎంపీటీసీ స్థానాల విషయంలో పట్టువిడుపులకు పోకుండా పొత్తులు పెట్టుకున్నాయి. ఇరు పార్టీల టార్గెట్ జెడ్పీ చైర్మన్ పోస్టు కావడంతో ఈ రెండు పార్టీలు కూడా అవసరమైన చోట, కలిసొచ్చిన చోట టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ ఇలా.. ఒక్కో చోట ఒక్కో పార్టీతో కలిసి బరిలోకి దిగాయి. కాగా, ముప్పై ఒక్క స్థానాలు ఉన్న నల్లగొండ జెడ్పీని సొంతం చేసుకోవాలంటే.. ఏ పార్టీ అయినా పదహారు జెడ్పీటీసీ సభ్యులను గెలిపించుకోవాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు బాధ్యత.. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీనీ కోల్పోవద్దన్న పట్టుదలతో ఉంది. దీంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పజెప్పింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఈ స్థానం కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంచుకుని పోటీకి నిలబెట్టే అవకాశం ఎమ్మెల్యేలకే అప్పజెప్పారు. ఆ మేరకు అధినాయకత్వ ఆమోద ముద్ర వేయించుకుని తమ అనుయాయులను పోటీకి పెట్టిన ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కొన్ని కీలక స్థానాలు అనుకున్న చోట, టికెట్లకు అధికంగా పోటీ ఉందనుకున్న స్థానాల్లో అభ్యర్థులను అధినాయకత్వమే ఖరారు చేసి ప్రకటించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న పార్టీ సీనియర్ నేత బండా నరేందర్‌రెడ్డిని నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తున్నారని పార్టీలో సంస్థాగతంగా అందరికీ సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ జిల్లా నాయకత్వం నార్కట్‌పల్లిలో బండా గెలుపును సవాల్‌గా తీసుకుని పనిచేస్తోంది. ఇప్పటికే ఇక్కడ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ ఎమ్మెల్యే తదితర.. ముఖ్య నాయకులంతా ప్రచారం చేశారు. వ్యూహాత్మకంగా ... కాంగ్రెస్ అడుగులు జిల్లాలో టీఆర్ఎస్కు దీటుగా.. ఆయా నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం జెడ్పీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి ఖర్చులు పెట్టుకుని, ఓడిపోయిన వారిని పక్కన పెట్టేయకుండా అవకాశం ఉన్న ప్రతిచోటా ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది. తద్వారా జెడ్పీటీసీ స్థానాల్లోని అభ్యర్థులకు గట్టి మద్దతు లభించేలా వ్యవహరించింది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తగానే వ్యవహరించింది. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పేరును పీసీసీ అధికారికంగా ప్రకటించింది. మోహన్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేవలం ఒక్క నార్కట్‌పల్లిలో విజయంపై మాత్రమే కాకుండా.. జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టున్న అన్ని మండలాల్లో జెడ్పీటీసీ సభ్యులను గెలిపించుకునేందుకు ఆయా నియోజకవర్గాలు చుట్టివస్తున్నారు. నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి మోహన్‌రెడ్డి మరో సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ప్ర చారం చేస్తున్నారు. మొత్తంగా అటు టీఆర్ఎ స్, ఇటు కాంగ్రెస్ అత్యధిక జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపుపై దృష్టి పెట్టి పనిచేస్తుండడంతో స్థానిక ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది. -
వారు రాజకీయ మానసిక రోగులు: బూర నర్సయ్య
ఆలేరు: కోమటిరెడ్డి సోద రులు రాజకీయ మానసిక రోగులని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆలేరు, భువనగిరి, జనగాం నియోజకవర్గాల్లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఎయిమ్స్‌ను తీసుకువస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాలంటే పక్షులు అటు ఇటు తిరిగినట్లు కాదని, ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీ గా, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం సరైంది కాదని దీన్ని రాజకీయ జబ్బు (మెంటలోమానియా) అంటారని విమర్శించారు. ఈ జబ్బు ఉన్నవాళ్లు నేనే చక్రవర్తినని అనుకుంటారని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చురకలంటించారు. ఈ కార్యక్రమం లో బడుగుల లింగయ్య యాదవ్, గొంగిడి మహేందర్‌రెడ్డి, రాజీవ్‌సాగర్ పాల్గొన్నారు. -
అన్నల ఓటమి.. తమ్ముళ్ల గెలుపు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్కాగా గెలుస్తామనుకున్న నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నాయకులు కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరు గాంచిన నల్లగొండలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకులు జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కోమటి రెడ్డి సోదరుల్లో వెంకట్ రెడ్డి ఓటమి పాలవ్వగా.. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం విజయం సాధించారు. మల్లు బ్రదర్స్, పట్నం బ్రదర్స్‌ల పరిస్థితి కూడా ఇలానే ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్... కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మ్రాతం విజయం సాధించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపాల్ రెడ్డి.. తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు. పట్నం బ్రదర్స్... ఎన్నికల ప్రారంభం నుంచే కోడంగల్ నియోజక వర్గం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి మధ్య హోరాహోరి పోరు నడిచింది. చివరకూ రేవంత్ రెడ్డిపై.. పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. కానీ నరేందర్ రెడ్డి అన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. కేసీఆర్ మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలుపొందిన మహేందర్ రెడ్డి ఇసారి ఓటమి పాలయ్యారు. కూటమి అభ్యర్థి పంజుగుల పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు విజేతగా నిలిచారు. మల్లు బ్రదర్స్... కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఉమ్మడి ఏపీలో డిప్యూడీ స్పీకర్‌గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి మూడోసారి విజయం సాధించారు. తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి లింగాల కమల రాజ్ మీద విజయం సాధించారు. అయితే మల్లు అన్న రవి మ్రాతం ఓడిపోయారు. జడ్చర్ల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి తన సమీప టీఆర్ఎస్ ప్రత్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. -
కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కాంగ్రెస్ రాజకీయం రక్తి కడుతోంది. టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి దాదాపు ఇరవై రోజులు కావొస్తున్నా.. ఇన్నాళ్లు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడు లేదు. మహాకూటమి పేర టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలతో పొత్తులు పెట్టుకునే పనిలో ఉం డడమే దీనికి కారణంగా పేర్కొంటున్నా.. అంతకుమించి ఇంకా బలమైన కారణాలే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ప్రాతి నిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి టికెట్ల కేటాయింపు సహజంగానే ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లా కాంగ్రెస్‌లో స్థానాల పంపకం జరుగుతోంది. టీపీసీసీలో జిల్లా నాయకులే ముఖ్య పాత్ర పోషిస్తుండడం, అంతా నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు ఎన్నికల్లో విజయాలు సాధించిన సీనియర్లు కావడం, ఒక్కో నాయకుడి కనుసన్నల్లో రెండు మూడు నియోజకవర్గాలు ఉండ డం వంటి అంశాలు పార్టీ నాయకత్వానికి ప్రతిబంధకంగా మారిందన్న అభిప్రా యం కూడా ఉంది. కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలు ! కోమటిరెడ్డి సోదరులకు నాలుగు స్థానాలు ఇస్తున్నారా..ఇది.. నిజమేనా అంటే, అవుననే అంటున్నాయి కాంగ్రెస్‌లోని విశ్వసనీయ వర్గాలు. ముందునుంచీ పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి .సోదరులకు ఆ పదవి లభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో తమకున్న ఫాలోయింగ్‌ను పరిగణనలోకి తీసుకుని పీసీసీలో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని భువనగిరి, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల బాధ్యత తమకే అప్పజెప్పాలని, తాము చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ పెట్టారని సమాచారం. కోమటిరెడ్డి సోదరులు, పీసీసీ నాయకత్వానికి మధ్య కేంద్ర మాజీ మంత్రి ఒకరు, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహిత నాయకుడు ఒకరు మధ్యవర్తిత్వం వహించి ఒప్పించారని తెలిసింది. నల్లగొండ, నకిరేకల్ వెంకట్‌రెడ్డి బాధ్యతగా, మునుగోడు, భువనగిరి రాజగోపాల్‌రెడ్డి బాధ్యతగా నిర్ణయం జరిగిందని సమాచారం. ఈ ఒప్పందం జరిగాక అంతా సర్దుకుంటుందన్న సమయంలో టీ.పీసీసీ ఎన్నికల కమిటీలు చిచ్చురేపాయని పేర్కొంటున్నారు. ఈ కమిటీల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడానికి రాజగోపాల్‌రెడ్డి తీవ్రంగా నిరసించారు. అడిగిన మేరకు సీట్లు కేటాయిం చాలని ఒప్పందం జరిగాక ఒక విధంగా రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేసినట్లు మాట్లాడడంపై నాయకత్వం అంతర్మథనం పడుతోందని చెబుతున్నారు. ఇక, వీరి కోటాల దక్కనున్న భువనగిరిలో అన్నీ సవ్యంగా జరిగితే జిట్టా బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని పంపకాలు ..? వాస్తవానికి జిల్లాలో కాంగ్రెస్ నేతల నాలుగు కుటుంబాలనుంచి ఎనిమిది సీట్లు ఆశిస్తున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు, జానారెడ్డి, ఆయన తనయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన తనయుడు, ఇలా .. ఒక్కో కుటుంబంలో రెండేసి టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన సతీమణి ఉత్తమ్ పద్మావతి ఇప్పటికే సిట్టింగులు కాబట్టి కోదాడ, హుజూర్‌నగర్‌లు తమకే దక్కాల్సి ఉందంటున్నారు. జానారెడ్డి ఈసారి మిర్యాలగూడ వచ్చి, నాగార్జునసాగర్‌లో తన తనయుడు రఘువీర్‌రెడ్డి బరిలోకి దింపాలనుకుంటున్నారు. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తన తనయుడు సర్వోత్తమ్‌రెడ్డికి భువనగిరి కావాలని అడుతున్నారని చెబుతున్నారు. అంతకు కావాల్సి వస్తే తాను పార్లమెంటు స్థానంనుంచి పోటీ చేయడానికి సిద్ధమన్న సంకేతాలు కూడా పంపారని అంటున్నారు. జానారెడ్డి సైతం అదే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి ఒక జిల్లాలో నలుగురు కాంగ్రెస్ సీనియర్లు రెండేసి సీట్లు కావాలనుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో టీ.పీసీసీ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. -
కాంగ్రెస్‌లో ‘రాహుల్’ పర్యటన చిచ్చు !
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో ఊపు రావాల్సింది పోయి, శ్రేణులు ఉసూరు మంటున్నాయి. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా తమదైన ముద్ర వేసే కోమటిరెడ్డి సోదరులు అధినేత బహిరంగ సభకు దూరంగా ఉండడం చర్చనీయాంశం అయ్యింది. పీసీసీ నాయకత్వం వీరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వక పోవడం వల్లే దూరంగా ఉన్నారా? మరేదైనా బలమైన కారణం ఉందా ? అన్న చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనలో తొలిరోజు కనిపించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ మరుసటి రోజు జరిగిన బహిరంగ స¿భకు హాజరు కాలేదు. వీరు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండడంతో సహజంగానే కోమటిరెడ్డి అనుచర వర్గమంతా దూరంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా జన సమీకరణ చేయాల్సిన జిల్లాల్లో నల్లగొండ కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్‌కు సమీంలో ఉండడం, ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు బలంగా ఉండడం ఓ కారణంగా చెబుతారు. కానీ, రాహుల్‌గాంధీ పర్యటనలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగింది. ఈ అంశమే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రేపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. గైర్హాజరీపై సర్వత్రా చర్చ ! కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆశించిన కోమటిరెడ్డి సోదరులు ఆ దిశలో ప్రయత్నమూ తక్కువేం చేయలేదు. కారణాలు ఏవైనా వీరికి పీసీసీ సారథ్యం దక్కలేదు. ఈ కారణంగానే ఒక విధంగా రాష్ట్ర నాయకత్వానికి సమాంతరంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఉమ్మడి జిల్లాలో సైతం దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఏఐసీసీ నాయకత్వం పాల్గొనగా జరిగిన నల్లగొండ పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశన్ని విజయవంతం చేశారు. ఇదే నేపథ్యంలో జరిగిన జాతీయ అధ్యక్షుడి కార్యక్రమంలో ఒకరోజు పాల్గొని ఆ తర్వాత దూరంగా ఉండడంపై భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు ఆ బహిరంగ సభకు వీరికి సరైన ఆహ్వానం లేదని అంటున్నారు. అంతే కాకుండా జన సమీకరణ చేయాలని కూడా కోరలేదని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం తీరుతోనే.. ఇలా.. గుర్తింపు ఇచ్చే విషయంలో పీసీసీ నాయకత్వం అవలంబించిన తీరుపై ఆగ్రహంతోనే వీరు సభకు, రాహుల్ పర్యటనకు దూరంగా ఉన్నారని విశ్లేషిస్తున్నారు. తమ నేతలే కార్యక్రమానికి దూరంగా ఉండడంతో, అనుచర వర్గం కూడా దూరంగా ఉన్నారని అంటున్నారు. బయటకు కనిపించని బలమైన కారణం లేకుండా జాతీయ అధ్యక్షుడి కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉంటారన్న భిన్నమైన చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న నేతలంతా సీనియర్లు, రాష్ట్ర కాంగ్రెస్‌లో ముఖ్యులు కావడం, సమ ఉజ్జీలుగా ఉన్న ఈ నేతలంతా కలిసి పనిచేయడంలో సమస్యలు ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సరైన ఆహ్వానం, బాధ్యతల అప్పగింతలో పట్టించుకోకపోవడం, తదితర కారణాలతో కోమటిరెడ్డి సోదరులు కినుక వహించారని, ఈ కారణంగానే దూరంగా ఉండి ఉంటారని అంటున్నారు. ఈ ఉదంత మరోసారి జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు, నేతల మధ్యన ఉన్న దూరాన్ని పట్టి చూపిందని పేర్కొంటున్నారు. మొత్తంగా జాతీయ అధ్యక్షుడి సభకు హాజరు కాకుండా కోమటిరెడ్డి వార్తల్లో నిలిచారన్న అభిప్రాయం వినిపిస్తోంది. -
అధిష్టానం చూసుకుంటుంది
- ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ వ్యాఖ్యలపై ఉత్తమ్ - ఉద్యోగాల కల్పనలో సర్కార్ విఫలం శంషాబాద్ (రాజేంద్రనగర్): ‘కోమటిరెడ్డి బ్రదర్స్’ వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విలేక రులతో ఆయన మాట్లాడారు. కోమటిరెడ్డి సోదరులు ఇటీవల హైకమాండ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారం ఏఐసీసీ పరిశీలనలో ఉందని, ఈ విషయమై ఇంతకంటే తానేమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిలో ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన రంగారెడ్డి జిల్లా.. టీఆర్ఎస్ పాలనలో తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టు అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రంగారెడ్డి సిలికాన్ వ్యాలీలా మారేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు కూడా లేకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సన్నిహితంగా ఉంటున్న సీఎం.. రాష్ట్రానికి ప్రాజెక్టు సాధించే విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో రాష్ట్ర సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిండా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మియాపూర్ భూ కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలసి సీబీఐ దర్యాప్తు వేయాల్సిందిగా కోరడానికి తాము ప్రయత్నించామన్నారు. కబ్జాదారుల నుంచి భూములు కోల్పోయిన రైతులకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. -
కోమటి బ్రదర్స్ వివాదం కొలిక్కి వచ్చినట్టేనా !
-
'నల్లగొండలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది'
హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం పార్టీలో నల్లగొండ నేతలు చేరారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ విజేందర్ రెడ్డి సహా పలువురు టీఆర్ఎస్లోకి చేరినట్టు చెప్పారు. ఈ వలసల నేపథ్యంలో నల్లగొండలో టీఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ప్రతినిధులు టీఆర్ఎస్కు ఓటేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. అందుకే వారంతా టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజా సమస్యలపై స్పష్టత లేదని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.