అదే బరి.. వీరులు వారే..   | Old candidates are Again contesting in Telangana Assembly Elections 2023 | Sakshi
Sakshi News home page

అదే బరి.. వీరులు వారే..  

Published Tue, Nov 14 2023 4:02 AM | Last Updated on Tue, Nov 14 2023 11:21 AM

Old candidates are Again contesting in Telangana Assembly Elections 2023 - Sakshi

మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగడమంటే ఆషామాషీ కాదు. పోటీ చేసి గెలవాలంటే అంత ఈజీ కాదు. పదేపదే పోటీ చేస్తుంటే..ఓసారి గెలిచి మరోమారు ఓడిపోతుంటే.. పదే పదే గెలుస్తుంటే.. లేదా పదే పదే ఓడిపోతుంటే.. ఆ ఉత్కంఠ అనుభవిస్తేనే కానీ అర్థం కాదు. అలా పదేపదే పోటీ చేయడం కత్తిమీద సాము లాంటిదే. పోటీ చేసిన వారే పదేపదే పోటీ చేయడం.. ఒకే నియోజకవర్గంలో నేతలు రెండు నుంచి ఐదు సార్లు తలపడితే వారినే ‘పాతకాపు’లంటారు.

నియోజకవర్గం మారినా, పార్టీలు మారినా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ వారి మధ్యనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు అలా పాతుకుపోతారంతే. ఇలాంటి పాతకాపులు ఈసారి కూడా హోరాహోరీ తలపడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాతకాపుల పోటాపోటీ ఎలా ఉందంటే..! 

నిజామాబాద్‌ 

బోధన్‌లో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి హోరాహోరీ తలపడిన షకీల్‌ అహ్మద్, సుదర్శన్‌రెడ్డి ఈసారి కూడా అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌లోనూ పాతకాపులే మళ్లీ పోటీ పడుతున్నారు. 2018లో నిల్చున్న బాజిరెడ్డి గోవర్ధ్దన్‌ (బీఆర్‌ఎస్‌), భూప­తిరెడ్డి (కాంగ్రెస్‌)లు ఈసారీ బరిలో ఉన్నారు. బాల్కొండలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)పై గత ఎన్నికల్లో బీఎస్పీ పక్షాన తలపడిన సునీల్‌కుమార్‌ ఈసారి కాంగ్రెస్‌ నుంచి తలపడుతున్నారు.  

ఆదిలాబాద్‌ 
సిర్పూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు పాతకాపులు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో తలపడిన కోనేరు కోనప్ప (బీఆర్‌ఎస్‌)పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీశ్‌ ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య (బీఆర్‌ఎస్‌), జి.వినోద్‌లు మళ్లీ పోటీ పడుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వినోద్‌ బీఎస్పీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి గా రంగంలో ఉన్నారు. మంచిర్యాలలో ఎన్‌.దివాకర్‌రావు (బీఆర్‌ఎస్‌), కె.ప్రేమ్‌సాగర్‌రావు (కాంగ్రెస్‌) మళ్లీ అవే పార్టీల తరఫున రంగంలోకి దిగారు. నిర్మల్‌లో వరుసగా ఏడోసారి ఇంద్రకరణ్‌ రెడ్డి పోటీ చేస్తుండగా ఆయనపై రెండు వరుస ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన మహేశ్వర్‌రెడ్డి, కూచాడి శ్రీహరిరావులిద్దరూ ఈసారి ఆయనపై బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి పోటీలో నిలిచారు. 

ఖమ్మం 
పినపాకలో గత ఎన్నికల్లో రేగా కాంతారావు (కాంగ్రెస్‌), పాయం వెంకటేశ్వర్లు (బీఆర్‌ఎస్‌) నుంచి పోటీ చేయగా, ఇప్పుడు కూడా వీరే తలపడుతున్నా పార్టీలు మారారు. ఇల్లెందులోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన హరిప్రియానాయక్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. మధిరలో గత నాలుగో ఎన్నికల్లోనూ మల్లు భట్టి విక్రమార్క, లింగాల కమల్‌రాజ్‌లే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. భట్టి కాంగ్రెస్‌ అభ్యర్థి గా నాలుగుసార్లు రంగంలో ఉండగా, కమల్‌రాజ్‌ మాత్రం రెండుసార్లు సీపీఎం నుంచి, రెండోసారి బీఆర్‌ఎస్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భద్రాచలం నుంచి పొదెం వీరయ్య (కాంగ్రెస్‌), తెల్లం వెంకట్రావు (బీఆర్‌ఎస్‌) వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు.    

మెదక్‌ 
అందోల్‌ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్‌), చంటి క్రాంతి కిరణ్‌ (బీఆర్‌ఎస్‌)లు వరుసగా రెండోసారి బరిలో ఉన్నారు.  సంగారెడ్డిలో జగ్గారెడ్డి (కాంగ్రెస్‌), చింత ప్రభాకర్‌ (బీఆర్‌ఎస్‌)లు వరుసగా నాలుగోసారి అమీతుమీ తేల్చుకుంటున్నారు. పటాన్‌చెరులోనూ 2018 ఎన్నికల్లో తలపడిన మహిపాల్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), శ్రీనివాస్‌గౌడ్‌ (కాంగ్రెస్‌)లే 2023 ఎన్నికల్లోనూ పోటీ పడుతున్నారు.  

వరంగల్‌ 
డోర్నకల్‌లో రెడ్యానాయక్‌ (బీఆర్‌ఎస్‌), రామచంద్రునాయక్‌ (కాంగ్రెస్‌) మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి (కాంగ్రెస్‌), పెద్ది సుదర్శన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) మూడోసారి తలపడుతున్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి (బీఆర్‌ఎస్‌), గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్‌) రెండోసారి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ నుంచి, సత్యనారాయణరావు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.

రంగారెడ్డి జిల్లా
మల్కాజ్‌గిరిలో వరుసగా రెండోసారి మైనంపల్లి హనుమంతరావు, ఎస్‌.రాంచందర్‌రావు (బీజేపీ)ల నడుమ పోరు జరుగుతోంది. మైనంపల్లి గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి దిగగా, ఈసారి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద (బీఆర్‌ఎస్‌), కూన శ్రీశైలం గౌడ్‌ మధ్య రెండోసారి పోటీ జరుగుతోంది. శ్రీశైలం గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి, ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం జనరల్‌ స్థానంగా మారిన తర్వాత జరుగుతున్న నాలుగు ఎన్నికల్లోనూ మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అయితే గతంలో బీఎస్పీ నుంచి, ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మల్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి 2009, 2014లో టీడీపీ నుంచి పోటీ చేయగా, 2018, 2023లో బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉంటున్నారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి మధ్య బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నుంచి వరుసగా రెండోసారి పోటీ జరుగుతోంది. వికారాబాద్‌లోనూ మెతుకు ఆనంద్‌ (బీఆర్‌ఎస్‌), గడ్డం ప్రసాద్‌కుమార్‌ (కాంగ్రెస్‌) రెండోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

కరీంనగర్‌ 
జగిత్యాల నుంచి సంజయ్‌కుమార్‌ (బీఆర్‌ఎస్‌), టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌) వరుసగా మూడోసారి తలపడుతున్నారు. గత రెండు ఎన్నికల్లో చెరోసారి విజయం సాధించగా, ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ (బీఆర్‌ఎస్‌)పై అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (కాంగ్రెస్‌) వరుసగా ఐదోసారి పోటీ చేస్తున్నారు. ఐదు ఎన్నికల్లో ఓటమిపాలైనా గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిన ఆయన మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంథనిలో పుట్టా మధు (బీఆర్‌ఎస్‌), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (కాంగ్రెస్‌) వరుసగా నాలుగోసారి ఢీ కొడుతున్నారు.

పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), విజయరమణారావు (కాంగ్రెస్‌) వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ (బీఆర్‌ఎస్‌)పై బండి సంజయ్‌ (బీజేపీ) వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. చొప్పదండిలోనూ సుంకె రవిశంకర్‌ (బీఆర్‌ఎస్‌), మేడిపల్లి సత్యం (కాంగ్రెస్‌) మధ్య రెండోసారి పోటీ నెలకొంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ (బీఆర్‌ఎస్‌)పై పాతకాపు కె.కె.మహేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌) మరోమారు పోటీ చేస్తున్నారు. ఒక్కసారి మినహా గత నాలుగు ఎన్నికల్లోనూ ఆ ఇద్దరే ముఖాముఖి తలపడటం గమనార్హం.  

నల్లగొండ 
దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గంలో బాలూనాయక్‌ (కాంగ్రెస్‌), రవీంద్రకుమార్‌ (బీఆర్‌ఎస్‌) రెండోసారి తలపడుతున్నారు. కోదాడలో పద్మావతిరెడ్డి (కాంగ్రెస్‌), బొల్లం మల్లయ్య (బీఆర్‌ఎస్‌), సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), దామోదర్‌రెడ్డి (కాంగ్రెస్‌)లు వరుసగా రెండుసార్లు తలపడుతున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి మధ్య మూడోసారి పోటీ జరుగుతోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్‌), కె. ప్రభాకర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) మధ్య కూడా వరుసగా మూడోసారి పోటీ జరుగుతోంది. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌) మధ్య కూడా వరుసగా రెండోసారి సమరం జరుగుతోంది. నకిరేకల్‌లో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యల నడుమ మూడోసారి పోటీ జరుగుతోంది. అయితే, గత ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసిన పార్టీలు వేర్వేరు కావడం గమనార్హం.  

మహబూబ్‌నగర్‌ 
కొడంగల్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) నడుమ రెండోసారి యుద్ధం జరుగుతోంది. అచ్చంపేటలో గువ్వల బాలరాజు (బీఆర్‌ఎస్‌), చిక్కుడు వంశీకృష్ణ (కాంగ్రెస్‌) కూడా వరుసగా రెండోసారి తలపడుతున్నారు. కల్వకుర్తి నుంచి జైపాల్‌యాదవ్‌ (బీఆర్‌ఎస్‌), టి.ఆచారి (బీజేపీ) కూడా రెండోసారి పోటీ పడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (కాంగ్రెస్‌), హర్షవర్దన్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌) మూడోసారి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఈ ఇద్దరూ పోటీ చేసిన పార్టీల నుంచి కాకుండా మరో పార్టీ నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement