ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ | Telangana Assembly Elections 2023: Tough Fight Between Main Leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎన్నికల బరిలో ఢీ అంటే ఢీ.. రసవత్తరంగా ఆ స్థానాలు

Published Thu, Nov 16 2023 4:40 PM | Last Updated on Wed, Nov 29 2023 8:16 PM

Telangana Assembly Elections 2023: Tough Fight Between Main Leaders - Sakshi

Telangana Elections 2023: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్రులు.. మొత్తంగా 2,290 మంది రాజకీయ భవిష్యత్తును ఓటర్లు ‘ఓటు’తో నిర్ణయించబోతున్నారు. అయితే వీళ్లలో కీలక నేతలు.. వాళ్ల మధ్య పోరు ఈసారి ఎన్నికలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.


కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. గజ్వేల్‌ నుంచి మూడోసారి పోటీకి దిగుతున్నారు. అయితే.. 1985 నుంచి ఆయన పోటీచేసిన ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్‌ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చరిత్ర సృష్టిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు హ్యాట్రిక్‌ కట్టబెట్టడంతోపాటు హ్యాట్రిక్‌ సీఎంగా దక్షిణ భారతదేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పాలనుకుంటున్నారాయన. అయితే.. ఈసారి గజ్వేల్‌తో పాటు కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ పార్టీకి పట్టు ఉండడం ఒక ఎత్తు అయితే.. ప్రత్యర్థి పార్టీలు తమ తమ ప్రధాన నేతల్ని ఈ రెండు చోట్ల అభ్యర్థులుగా నిలబెట్టడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల నుంచి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం.. అంతే సంఖ్యలో నామినేషన్ల తిరస్కరణ, ఉపసంహరణ.. తదనంతరం కూడా అత్యధికంగా అభ్యర్థులు బరిలో మిగలడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


గజ్వేల్‌లో కేసీఆర్‌- ఈటల రాజేందర్‌ 
కేసీఆర్, ఈటల రాజేందర్‌.. గత ఎన్నికల సమయంలో ఒకేపార్టీలో కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు సీన్‌ మారింది. ప్రత్యర్థులుగా విమర్శల్ని దూసుకుంటున్నారు. గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఇద్దరూ తలపడుతున్నారు. గజ్వేల్‌ కేసీఆర్‌పై బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బరిలో నిల్చున్నారు.   పూర్వం బీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటల.కేసీఆర్‌తో సన్నిహితంగానూ పని చేశారు. అయితే తదనంతర పరిణామాలతో బయటకు వచ్చి కేసీఆర్‌పై ఈటల తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. ఆపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల(2021) ద్వారా పోటీ చేసి బంపర్‌మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్‌-కారు పార్టీ హవాను తట్టుకుని మరీ గెలిచిన ఈటల గురించి జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చ నడిచింది. బీజేపీకి తెలంగాణ రాజకీయాల్లో ఈ విజయం బలాన్ని ఇచ్చింది. 

వామపక్ష భావజాలంతో కూడిన విద్యార్థి నేతగా ఈటల పని చేశారు. 2003లో టీఆర్‌ఎస్‌(నేటి బీఆర్‌ఎస్‌)లో చేరి 2004 నుంచి కమలాపూర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు నెగ్గారు. 2010 నుంచి హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు.  ఇప్పుడు హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌పైనే ఈటల పోటీకి దిగి ఆ రాజకీయాన్ని మరింత వేడెక్కించారు.  మరోవైపు గజ్వేల్‌లో కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. 

కామారెడ్డిలో కేసీఆర్‌-రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ పోటీ చేస్తున్న రెండో నియోజకవర్గం కామారెడ్డిలోనూ పోరు రసవత్తరంగా ఉండబోతోంది. కారణం.. అక్కడ తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బరిలో నిలవడం. కేసీఆర్‌ కోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్‌ రెడ్డి టికెట్‌ త్యాగం చేయగా.. మొదటి నుంచి బీఆర్‌ఎస్‌ అధినేతపైన విరుచుకుపడున్న రేవంత్‌ పోటీకి నిల్చోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా నెగ్గి ఆపై టీడీపీలో చేరారు రేవంత్‌రెడ్డి. 2009 నుంచి 2018 దాకా కొడంగల్‌ ఎమ్మెల్యేగా నెగ్గుతూ వచ్చారు. అయితే 2018లో బీఆర్‌ఎస్‌  హవాతో ఆయన తొలిసారి ఓటమి చవిచూశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేసి 10వేల ఆధిక్యంతో గెలుపొందారాయన. ప్రస్తుతం ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి.. ఈ ఎన్నికల్లో కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచే కాకుండా.. గులాబీ బాస్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి నుంచి కూడా ప్రత్యర్థిగా బరిలో నిలిచారు. కామారెడ్డిలో బీజేపీ తరఫున వెంకట రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. 

ఖమ్మం పువ్వాడ అజయ్‌-తుమ్మల
ఖమ్మం జిల్లా కేంద్ర నియోజకవర్గంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య కీలక నేతల పోటీ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈ నియోజకవర్గం నుంచి బరిలో నిల్చున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కి ఆయన సవాల్‌ విసురుతున్నారు. ఈ ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

తుమ్మల నాగేశ్వరరావుకు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆయన  రాజకీయ ప్రస్థానం టీడీపీతో ప్రారంభమైంది.  1983 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారాయన.  ఆపై సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు.  2009లో ఖమ్మం నుంచి నెగ్గారు. 2014 విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఖమ్మంలో పోటీ చేసి.. 6 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారాయన. వెంటనే ఎమ్మెల్సీని చేసి.. మంత్రిగా బాధ్యతలు అప్పగించారు కేసీఆర్‌.  అప్పటి నుంచి పాలేరు కేంద్రంగా రాజకీయం నడిపిస్తున్నారాయన.   2016లో పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరగ్గా..  తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. అయితే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో గెలిచి.. రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని తుమ్మల భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఇవే తన చివరి ఎన్నికలు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు.  

ఇక జిల్లాలో బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగారు. మూడవసారి గెలిచి ఖమ్మం గడ్డపై హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళ్లుతున్నారు. అంతేకాదు తనకు ఇవే చివరి ఎన్నికలు కావచ్చని..ఈసారి గెలిస్తే మిగిలిపోయిన అభివృద్ది ఏమైనా ఉంటే పూర్తి చేస్తానని.. ఈ ఒక్కసారి తనను ఆశీర్వాదించాలని ఖమ్మం ప్రజలను కోరుతున్నారు. సో.. ఖమ్మం నియోజకవర్గం అటు తుమ్మలకు..ఇటు పువ్వాడకు ఈసారి  ప్రతిష్టాత్మకంగా మారింది. 


మంథనిలో మారిన సీన్‌!
మంథని నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పోటీ చేస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. అయితే పోటాపోటీ ఉంటుందని భావించిన తరుణంలో పరిణామాలు ఒక్కసారిగా మారాయి. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌కు ఒక్కసారిగా వలసలు నడిచాయి. మధుపై ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకతే అందుకు కారణమనే ప్రచారం నడిచింది.  ఆ అనూహ్య పరిణామాల నడుమ పుట్ట మధులో ఆందోళన పెరిగిపోగా.. కుల్వకుంట్ల కుటుంబం మొత్తం అక్కడ ప్రచారం చేసింది. తద్వారా తమ అభ్యర్థిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది. దీంతో ఇక్కడ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్‌ దుద్ధిళ్ల శ్రీపాదరావు మరణానంతరం ఆయన తనయుడిగా శ్రీధర్‌బాబు నాలుగు పర్యాయాలు మంథని ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు చేశారు. తొలిసారి 1999-2014 మధ్య హ్యట్రిక్‌ విజయాల తర్వాత, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్టా మధు చేతిలో ఓడారు. 2018లో తిరిగి ఎమ్మెల్యేగా నెగ్గడం ద్వారా ఉమ్మడి కరీంనగర్‌లో నెగ్గిన ఏకైక కాంగ్రెస్‌ నేతగా పేరు దక్కించుకున్నారు. వెనుకబడిన మంథనిలో ప్రత్యేక అభివృద్ధి, ప్రజల్లో మమేకమై ఉంటారనే పేరుంది. ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పుట్టా మధు..  2014 ఎన్నికల్లో అనూహ్యంగా శ్రీధర్‌ బాబుని ఓడించారు. అయితే వివాదాల్లో చిక్కుకుని ఆయన 2018 ఎన్నికల్లో ఓడారు. బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఇచ్చిన ధైర్యంతో ఈసారి మళ్లీ ఆయన దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఢీ కొట్టబోతున్నారు.  

కొరుట్లలో కొత్తగా..!
‘‘యువకుడు.. వైద్యుడు.. కోరుట్ల బిడ్డ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డా.కల్వకుంట్ల సంజయ్‌. 2009లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన నిరాహార దీక్ష సమయంలో వైద్యుడిగా నా వెంట ఉండి నా ప్రాణాలు కాపాడారు. సంజయ్‌ నా బిడ్డలాంటోడు. సంజయ్‌ తలుచుకుంటే వైద్య వృత్తిలో కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, కానీ తండ్రి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు బాటలో ప్రజాసేవ కోసం మీ ముందుకు వచ్చాడు. ఆయనను మీరంతా ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలి. మంచి చెడు ఆలోచించి ప్రజల కష్టాలు తెలిసిన సంజయ్‌కు ఓటేసి గెలిపించాలి.. సీఎం కేసీఆర్‌ స్వయంగా సంజయ్‌ గురించి ప్రచారంలో చెప్పిన మాటలివి. 

జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం 2009 నుంచి కల్వకుంట్ల కంచుకోటగా ఉండింది. అక్కడ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే 2023  ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్థానంలో తనయుడు సంజయ్‌ రావు పోటీకి నిలబడ్డాడు. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో తన తనయుడు డా.సంజయ్‌ను అభ్యర్థిగా నిలిపానని, తాను చేసిన అభివృద్ధిని కొనసాగించాలంటూ అందరూ అండగా నిలిచి తన కొడుకు సంజయ్‌ను ఆశీర్వదించి గెలిపించాలని విద్యాసాగర్‌ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో.. తన తండ్రి నియోజకవర్గానికి ఎంతో  చేశారని, ఇప్పుడు ఆ అవకాశం తనకు ఇవ్వాలి’ అని సంజయ్‌ ప్రజలను కోరుతున్నారు. 

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉంది కోరుట్ల నియోజకవర్గం. బీజేపీ తరపున ధర్మపురి అర్వింద్‌ ఇక్కడ బరిలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించడంతో పాటు.. రికార్డు స్థాయిలో అభ్యర్థుల పోటీలో నిజామాబాద్‌ ఎంపీగా నెగ్గి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు అర్వింద్‌. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా స్థానికంగా ఆయన మంచి పేరుంది. అదే సమయంలో నిజామాబాద్‌కు సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో పాటు పసుపు బోర్డు ఏర్పాటు దిశగా కేంద్రం చేసిన ప్రకటన ఆయనకు కలిసొచ్చే అంశాలు.   

చెన్నూర్‌లో పోటాపోటీనే!  
మంచిర్యాల జిల్లాలో ఉన్నప్పటికీ.. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉంది చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం. బీఆర్‌ఎస్‌ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్‌ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి వివేక్‌ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. దీంతో పోటాపోటీ ఉండొచ్చనే  ఇద్దరూ పెద్దపల్లి లోక్‌సభ ఎంపీలుగా గతంలో పని చేసిన వాళ్లే కావడం గమనార్హం. 

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నేతగా భాగమైన బాల్క సుమన్‌.. 2001లో బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారాయన. ఆపై 2018లో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు.  బాల్క సుమన్‌ అభివృద్ధి ప్రచారం ఒకవైపు.. స్థానికంగా అందుబాటులో ఉండరని, అదే సమయంలో భూకబ్జాల రాజకీయ విమర్శలు మరోవైపు ఎదుర్కొంటున్నారు.

తండ్రి గడ్డం వెంకటస్వామి పెద్దపల్లి బరి నుంచి తప్పుకోవడంతో..  2009 సార్వత్రిక ఎన్నికల్లో గడ్డం వివేక్‌ పోటీ చేసి  తొలిసారి ఎంపీగా నెగ్గారు. ఆపై బీఆర్‌ఎస్‌, బీజేపీలో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. తరచూ పార్టీలు మారుతూ జంప్‌ జిలానీగా పేరొందిన గడ్డం వివేక్‌కు చివరికి ఎన్నికల ముందర కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈసారి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. స్థానికంగా వివేక్‌ తండ్రి గడ్డం వెంకటస్వామికి ఉన్న మంచిపేరు.. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మార్క్‌ వివేక్‌కు కలిసొచ్చే అంశాలనే విశ్లేషణ నడుస్తోంది. 

కరీంనగర్‌లో రసవత్తరంగా?
ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు కరీంనగర్‌. ఈసారి ఇక్కడ ఎన్నికలు మరోసారి ఆసక్తికర చర్చకు దారి తీశాయి. మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి పోటీ చేస్తుండగా.. బీజేపీ కీలక నేత బండి సంజయ్‌ కూడా బరిలోకి దిగారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మరోసారి బండి సంజయ్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్‌ విన్నర్‌గా పేరున్న గంగులకు ఈసారి బండి నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చనే విశ్లేషణ నడుస్తోంది. స్థానికతతో పాటు బండికి పెరిగిన మాస్‌ ఫాలోయింగ్‌ ఈ దఫా ఎన్నికల్లో అడ్వాంటేజ్‌గా మారొచ్చనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. మళ్లీ గెలిచి తీరతాననే ధీమాతో గంగుల ఉన్నారు. 

గంగుల  2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కరీంనగర్‌ మున్సిపాలిటీకి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారాయన. ఆపై 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. 2013లో బీఆర్‌ఎస్‌లో చేరి.. 2014,2018 ఎన్నికల్లో విజయం సాధించారు.  కరీంనగర్‌ భీముడిగా పేరొందిన కమలాకర్‌.. మరోసారి గెలుపు సాధించాలనే ప్రయత్నంలో ఉన్నారు. గంగులకు అనుకూలంగా..  వెలమ ఓటు రాజకీయం ఇక్కడ తీవ్ర ప్రభావం చూపనుంది.

ఏబీవీపీ మూలాలున్న బండి సంజయ్‌ కుమార్‌.. 2005లో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేటర్‌గా నెగ్గారు. 2019 దాకా ఆయన కార్పొరేటర్‌ హోదాలోనే కొనసాగడం గమనార్హం. 2014,2018 ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే బంపర్‌మెజార్టీతో(89,508 ఓట్ల ఆధిక్యంతో) 2019లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో నెగ్గాక.. కార్పొరేటర్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విజయం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఆపై తెలంగాణ బీజేపీకి స్టార్‌ లీడర్‌గా ఆయన రాజకీయం నడిచింది. ఇక ఈ దఫా ఎన్నికలో గంగుల చేతిలో హ్యాట్రిక్‌ ఓటమి తప్పించుకుని ఎలాగైనా నెగ్గాలనే యోచనలో ఉన్నారాయన. కాంగ్రెస్‌ నుంచి  పురుమళ్ల శ్రీనివాస్‌ ఇక్కడ బరిలో ఉన్నారు. 

ఎలాగైనా గెలవాలనే..
మెదక్‌ జిల్లా దుబ్బాకలో ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వస్తుంటాయి. దీంతో ఈసారి అక్కడి పోటీ చర్చనీయాంశంగానే మారింది. 2020లో అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాన్మరణం దుబ్బాక ఉప ఎన్నికకు దారి తీసింది. ఈ ఎన్నికలో ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు  స్వల్ప విజయంతో అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రఘునందన్‌రావుకు పోటీగా బీఆర్‌ఎస్‌ నుంచి మెదక్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి నిలబడ్డారు. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి(మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి తనయుడు) దుబ్బాక స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

మాధవనేని రఘునందన్‌రావు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులేశారు.  బీఆర్‌ఎస్‌లో 2001లో చేరి.. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబుతో రహస్య మంతనాలు జరిపారనే అభియోగాలపై పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2014 ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడారు. అటుపై బీజేపీలో చేరి.. 2020లో దుబ్బాక బైపోల్‌లో విజయం సాధించారు. 

కొత్త ప్రభాకర్‌రెడ్డి.. 2014 మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ద్వారా రాజకీయాల్లో వినిపించిన పేరు. సీఎంగా కేసీఆర్‌ తొలిసారి ప్రమాణం చేసిన తర్వాత తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది అప్పుడు. అయితే కేసీఆర్‌ బరిలో లేడుకాబట్టి విజయం సునాయసంగా దక్కుతుందని ప్రతిపక్షాలు భావించాయి. కానీ, ఊహించని రీతిలో ఏకంగా 3,61,833 ఓట్ల మెజారిటీతో కొత్త ప్రభాకర్‌ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలోనూ ఆయన మళ్లీ ఎంపీగా నెగ్గారు. అయితే ఈసారి ఆయన్ని దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపింది అధికార బీఆర్‌ఎస్‌. అయితే ప్రచార సమయంలోనే ఆయనపై కత్తిదాడి జరగడం, కోలుకుని ఆయన నామినేషన్‌ వేయడంతో.. సానుభూతి ఫలిస్తుందా? అనే చర్చ నడుస్తోంది. 

తార్‌మార్‌ పోటీ..
నకిరేకల్‌లో ఈసారి పోటీ తార్‌మార్‌.. ఆటను తలపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం ఈసారి బరిలో ఉన్నారు. 2004 దాకా వామపక్ష పార్టీల ఆధిపత్యం కొనసాగిన నకిరేకల్‌లో 2009లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆపై 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి వేముల వీరేశం ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇక గత ఎన్నికల్లో(2018) కాంగ్రెస్‌ అభ్యర్థిగానే చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. కానీ, ఈసారి లింగయ్య-వీరేశంలు పార్టీలు మారి పోటీలో నిలవడం గమనార్హం. 

తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా లింగయ్య 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కానీ, దానిని స్పీకర్‌ ఆమోదించలేదు. తిరిగి 2011 అక్టోబర్‌లో ఆయన మళ్లీ రాజీనామా సమర్పించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర హవాతో  వేముల వీరేశం చేతిలో ఓడారు లింగయ్య. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి నెగ్గి.. ఆపై బీఆర్‌ఎస్‌ కండువా కప్పేసుకున్నారు. 


ఇక వీరేశం విషయానికొస్తే.. పేదల కష్టాలు ఎరిగిన వాడినని ప్రచారంతో 2014లో ఎమ్మెల్యేగా నెగ్గారు వేముల వీరేశం. అయితే.. అభివృద్ధి మంత్రతో 2018 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినా విజయం మాత్రం వరించలేదు. 

ఇంకా హైదరాబాద్‌ జిల్లాలోని..  ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో దానం నాగేందర్‌(బీఆర్‌ఎస్‌) vs పీజేఆర్‌ తనయ విజయారెడ్డి(కాంగ్రెస్‌), జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపినాథ్‌-అజారుద్దీన్‌(మాజీ క్రికెటర్‌), మెదక్‌ నియోజకవర్గం నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌)-మైనంపల్లి తనయుడు రోహిత్‌(కాంగ్రెస్‌), నల్గొండ మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌)-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(కాంగ్రెస్‌), నిజామాబాద్‌లో బాల్కొండ నుంచి మేనత్త అల్లుళ్లు వేముల  ప్రశాంత్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌)-మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ(బీజేపీ), రంగారెడ్డి మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి(బీఆర్‌ఎస్‌)-కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్‌), జగిత్యాల జిల్లా జగిత్యాలలో సంజయ్‌కుమార్‌(బీఆర్‌ఎస్‌)- టీ జీవన్‌రెడ్డి(కాంగ్రెస్‌), జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర సత్యనారాయణరావు.. మంచిర్యాల బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య(బీఆర్‌ఎస్‌-గడ్డం వినోద్‌), పెద్దపల్లి జిల్లా పెద్దపల్లిలో  దాసరి మనోహర్‌ రెడ్డి(బీఆర్‌ఎస్‌)- సీహెచ్‌ విజయరమణారావు(కాంగ్రెస్‌).. సూర్యాపేట జిల్లా సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌)-రాంరెడ్డి దామోదర్‌రెడ్డి(కాంగ్రెస్‌)..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బరిలో వనమా వెంకటేశ్వరరావు(బీఆర్‌ఎస్‌), కూనంనేని సాంబశివరావు(సీపీఐ), జలగం వెంకట్రావు(ఫార్వర్డ్‌ బ్లాక్‌) మధ్య.. అలాగే సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో చంటి క్రాంతి కిరణ్‌(బీఆర్‌ఎస్‌), దామోదర రాజనర్సింహ(కాంగ్రెస్‌), బాబూ మోహన్‌(బీజేపీ)  త్రిముఖ పోరు బలంగా నడవనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement