సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థుల మలి జాబితా ప్రకటన ఏమోగానీ.. పూటకో ప్రచారంతో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం ఉదయం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో గంటన్నరపాటు సాగిన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో 45 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ.. ఈ సాయంత్రమే అన్ని స్థానాలకు ప్రకటన ఉంటుందని స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్. ఈ తరుణంలో మరో ప్రచారం వినవస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు రెండేసి స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందట. కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, గజ్వేల్.. హరీష్‌రావు సిద్దిపేట.. కేటీఆర్ సిరిసిల్లలోనే ఈ పోటీ ఉండనుందని తెలుస్తోంది. బరిలోకి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు సీఎల్పీ భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు 45 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ సీఈసీ.. అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో 14 స్థానాల్ని మాత్రం పెండింగ్‌లో ఉంచింది. పెండింగ్ జాబితాలో ఖమ్మంలో ఇల్లందు.. పాలేరు, నల్లగొండ జిల్లాలో దేవరకొండ.. తుంగతుర్తి.. సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్.. జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం.
మలివిడత జాబితా ఎప్పుడనేదానిపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పష్టత ఇచ్చారు. ‘‘ఈరోజు సాయంత్రం 45 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తాం. మిగతా స్థానాలపై నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులకు వదిలేశాం. కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరుగుతున్నాయి. చెరో రెండు సీట్లు ఇచ్చే విషయంలో అంగీకారం కుదిరింది. ఏ స్థానాలు ఇవ్వాలి అనేదానిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల వ్యవహారం కొలిక్కి వస్తుంది’’ అని తెలిపారాయన.
Comments
Please login to add a commentAdd a comment