సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య నేతల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. టికెట్ దక్కని ఇరు పార్టీల నేతలు.. అటు ఇటు కండువాలు కప్పేసుకుంటున్నారు. అసంతృప్త నేతల్ని, అందునా సీనియర్లను కీలక నేతల రాయబారంతో తమ తమ పార్టీల్లోకి లాగేసుకుంటున్నారు. ఈ రేసులో బీజేపీ వెనుకబడిపోయింది.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన బీజేపీ తొలి జాబితా విడుదలైంది. అయితే రెండో జాబితా విడుదలైనప్పటికీ.. కేవలం ఒకే ఒక్క పేరు ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల బరిలో నిలిపేందుకు బలమైన నేతలు లేకపోవడమే బీజేపీ పరిస్థితికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ఏకాభిప్రాయం కుదరకనే జాబితా విడుదల చేయడం లేదంటూ పలువురు పార్టీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పక్క పార్టీ నేతల కోసం కాషాయ పార్టీ ఎదురుచూపులు చూస్తోంది.
ఎన్నికల్లో పార్టీని బలంగా ప్రొజెక్టు చేయడం కోసం బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించాలనుకుంటోంది కాషాయం పార్టీ. ఇప్పటికే నేతల అన్వేషణ ప్రారంభించి.. పలువురి పేర్లు పరిశీలిస్తోంది. చేరికల కమిటీతో సంబంధం లేకుండా కొందరు కీలక నేతలు రంగంలోకి దించింది. హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, మునుగోడు నుంచి చలమల కృష్ణారెడ్డి, అలాగే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డి(విష్ణుకి ఇప్పటికే బీఆర్‌ఎస్ ఆహ్వానం ఇచ్చింది కూడా).. ఇలా కొందరు నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వీళ్లంతా పార్టీలోకి వచ్చే ఛాన్స్ ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. మరికొన్ని స్థానాల్లో ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతల కోసం బీజేపీ అన్వేషణ కొనసాగిస్తోంది.
నేడు హస్తినకు బీజేపీ రాష్ట్ర నేతలు
తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న బీజేపీ.. పోటీ ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం కోసం ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇవాళ కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో జనసేన పొత్తు పంచాయితీ ఇంకా తేలలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌షాతో చర్చలు జరిపినప్పటికీ.. సీట్ల లెక్క ఇంకా తేలలేదని తెలుస్తోంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న సీట్లు ఇవ్వడానికి బీజేపీ ససేమీరా అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment