
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా.. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎక్కడికక్కడ స్థానికంగా ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. మరికొన్ని మండలాల్లో టీఆర్‌ఎస్ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సీట్లను సర్దుబాటు చేసుకుంది. అయితే.. జెడ్పీటీసీ స్థానాలను వదులుకోకుండా.. ఎంపీటీసీ స్థానాలను వదిలేసి, జెడ్పీటీసీ స్థానాల్లో తమకు మద్దతు పలికేలా, ఎంపీపీల ఎన్నికల్లో మద్దతు పలికేలా ఒప్పందాలు చేసుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.
ఎంపీటీసీ స్థానాల విషయంలో పట్టువిడుపులకు పోకుండా పొత్తులు పెట్టుకున్నాయి. ఇరు పార్టీల టార్గెట్ జెడ్పీ చైర్మన్ పోస్టు కావడంతో ఈ రెండు పార్టీలు కూడా అవసరమైన చోట, కలిసొచ్చిన చోట టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీజేపీ ఇలా.. ఒక్కో చోట ఒక్కో పార్టీతో కలిసి బరిలోకి దిగాయి. కాగా, ముప్‌పై ఒక్క స్థానాలు ఉన్న నల్లగొండ జెడ్పీని సొంతం చేసుకోవాలంటే.. ఏ పార్టీ అయినా పదహారు జెడ్పీటీసీ సభ్యులను గెలిపించుకోవాల్సి ఉంది.
ఎమ్మెల్యేలకు బాధ్యత..
ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీనీ కోల్పోవద్దన్న పట్టుదలతో ఉంది. దీంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యతను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకే అప్పజెప్పింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మునుగోడు, నకిరేకల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఈ స్థానం కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్ ఖాతాలోనే చేరింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఎంచుకుని పోటీకి నిలబెట్టే అవకాశం ఎమ్మెల్యేలకే అప్పజెప్పారు. ఆ మేరకు అధినాయకత్వ ఆమోద ముద్ర వేయించుకుని తమ అనుయాయులను పోటీకి పెట్టిన ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మరోవైపు కొన్ని కీలక స్థానాలు అనుకున్న చోట, టికెట్లకు అధికంగా పోటీ ఉందనుకున్న స్థానాల్లో అభ్యర్థులను అధినాయకత్వమే ఖరారు చేసి ప్రకటించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న పార్టీ సీనియర్ నేత బండా నరేందర్‌రెడ్డిని నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తున్నారని పార్టీలో సంస్థాగతంగా అందరికీ సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ జిల్లా నాయకత్వం నార్కట్‌పల్లిలో బండా గెలుపును సవాల్‌గా తీసుకుని పనిచేస్తోంది. ఇప్పటికే ఇక్కడ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నల్లగొండ ఎమ్మెల్యే తదితర.. ముఖ్య నాయకులంతా ప్రచారం చేశారు.
వ్యూహాత్మకంగా ... కాంగ్రెస్ అడుగులు
జిల్లాలో టీఆర్‌ఎస్‌కు దీటుగా.. ఆయా నియోజకవర్గాల్లో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలపై కన్నేసిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం జెడ్పీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసి ఖర్చులు పెట్టుకుని, ఓడిపోయిన వారిని పక్కన పెట్టేయకుండా అవకాశం ఉన్న ప్రతిచోటా ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం కల్పించింది. తద్వారా జెడ్పీటీసీ స్థానాల్లోని అభ్యర్థులకు గట్టి మద్దతు లభించేలా వ్యవహరించింది. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తగానే వ్యవహరించింది. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి పేరును పీసీసీ అధికారికంగా ప్రకటించింది.
మోహన్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేవలం ఒక్క నార్కట్‌పల్లిలో విజయంపై మాత్రమే కాకుండా.. జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టున్న అన్ని మండలాల్లో జెడ్పీటీసీ సభ్యులను గెలిపించుకునేందుకు ఆయా నియోజకవర్గాలు చుట్టివస్తున్నారు. నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థి మోహన్‌రెడ్డి మరో సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ప్ర చారం చేస్తున్నారు. మొత్తంగా అటు టీఆర్‌ఎ స్, ఇటు కాంగ్రెస్ అత్యధిక జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపుపై దృష్టి పెట్టి పనిచేస్తుండడంతో స్థానిక ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment