సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పక్కాగా గెలుస్తామనుకున్న నాయకులకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నాయకులు కనివిని ఎరుగని రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటగా పేరు గాంచిన నల్లగొండలో విచిత్ర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీనియర్ నాయకులు జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతిరెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కోమటి రెడ్డి సోదరుల్లో వెంకట్ రెడ్డి ఓటమి పాలవ్వగా.. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం విజయం సాధించారు. మల్లు బ్రదర్స్, పట్నం బ్రదర్స్‌ల పరిస్థితి కూడా ఇలానే ఉంది.
కోమటిరెడ్డి బ్రదర్స్...
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వెంకట్ రెడ్డి తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మ్రాతం విజయం సాధించారు. మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపాల్ రెడ్డి.. తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద విజయం సాధించారు.
పట్నం బ్రదర్స్...
ఎన్నికల ప్రారంభం నుంచే కోడంగల్ నియోజక వర్గం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ కూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర రెడ్డి మధ్య హోరాహోరి పోరు నడిచింది. చివరకూ రేవంత్ రెడ్డిపై.. పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. కానీ నరేందర్ రెడ్డి అన్న పట్నం మహేందర్ రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. కేసీఆర్ మంత్రి వర్గంలో రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పట్నం మహేందర్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు గెలుపొందిన మహేందర్ రెడ్డి ఇసారి ఓటమి పాలయ్యారు. కూటమి అభ్యర్థి పంజుగుల పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు విజేతగా నిలిచారు.
మల్లు బ్రదర్స్...
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఉమ్మడి ఏపీలో డిప్యూడీ స్పీకర్‌గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి మూడోసారి విజయం సాధించారు. తన సమీప టీఆర్‌ఎస్ ప్రత్యర్థి లింగాల కమల రాజ్ మీద విజయం సాధించారు. అయితే మల్లు అన్న రవి మ్రాతం ఓడిపోయారు. జడ్చర్ల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు రవి తన సమీప టీఆర్‌ఎస్ ప్రత్యర్థి మంత్రి లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment