Sensational Allegations By Congress Key Leaders Targeting Revanth Reddy - Sakshi
Sakshi News home page

రేవంత్‌ ‘హస్త’వాసి బాగోలేదు.. తెరపైకి సంచలనలతో సీనియర్లు క్యూ!

Published Sat, Aug 6 2022 1:24 AM | Last Updated on Sat, Aug 6 2022 9:02 AM

Sensational Allegations By Congress Leaders Targeting Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు రేవంత్‌ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాణం పోయినా సరే కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ రేవంత్‌ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని అసంతృప్త నేతలు చెప్తున్నారు. వీరే కాకుండా ఇంకా ఎవరెవరు తెరపైకి వస్తారోనన్న దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

తీవ్ర ఆరోపణలతో.. 
రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ పార్టీని ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మార్చారని, రేవంత్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ బాగుపడదని శ్రవణ్‌ విమర్శించారు. ఏఐసీసీ నుంచి ఓ ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా రేవంత్‌ వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి కూడా ఇంతకుముందే తీవ్ర ఆరోపణలు చేశారు. చేయకూడని పనులు చేసే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని, జైలుకు వెళ్లొచ్చినవారి నేతృత్వంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగలేనని వ్యాఖ్యానించారు. 

రేవంత్‌ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్‌ సీట్లకు పరిమితం అవుతుందని విమర్శించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్‌ తీరును తప్పుపట్టారు. తనతో సహా పాత కాంగ్రెస్‌ నాయకులను వెళ్లగొట్టేందుకు రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని, అంతా వెళ్లిపోతే టీడీపీ వాళ్లను తెచ్చుకుని టికెట్లు ఇచ్చుకోవాలనేది రేవంత్‌ ఆలోచన అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. 

టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే.. 
రేవంత్‌రెడ్డి గత ఏడాది జూలైలో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. చాలా విషయాల్లో రేవంత్‌ ఏకపక్షంగా వెళుతుండటం వల్లే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు బయటికి వస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. టీపీసీసీ కార్యవర్గంలో నియమితులైన పలువురు సీనియర్లతో రేవంత్‌రెడ్డికి పొసగడం లేదనే విమర్శలున్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నేతల మధ్య సమన్వయం కుదరక.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చాలా కాలం క్రితమే రేవంత్‌తో విభేదించారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌పై మహేశ్వర్‌రెడ్డి మాటల దాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌లోనూ రేవంత్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి తర్వాత కీలక హోదాలో ఉన్న తనను రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెడుతున్నారన్న అభిప్రాయంతో మధుయాష్కీ ఉన్నారని పేర్కొంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లా పార్టీ విషయంలో రేవంత్‌తో ఆయనకు సఖ్యత కుదరక అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. 

కీలక నేతలు కూడా దూరం దూరంగా.. 
టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న నలుగురు నేతలు కూడా రేవంత్‌ వైఖరి పట్ల మనస్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. టి.జగ్గారెడ్డి (సంగారెడ్డి), మహేశ్‌కుమార్‌గౌడ్‌ (నిజామాబాద్‌), అంజన్‌కుమార్‌ యాదవ్‌ (హైదరాబాద్‌), గీతారెడ్డి (మెదక్‌)లు పలు సందర్భాల్లో రేవంత్‌ వైఖరితో విభేదించిన ఘటనలు ఉన్నాయి. జగ్గారెడ్డి మొదటి నుంచీ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మిగతా నాయకులు గుంభనంగా ఉంటున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలోని ఏకైక ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీనియర్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కూడా రేవంత్‌ ఇప్పటికీ సఖ్యత కుదుర్చుకోలేకపోయారని.. ఉత్తమ్, భట్టి, వీహెచ్‌ లాంటి సీనియర్లను కలుపుకొని పోయే అంశాన్నీ రేవంత్‌ పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 

చేరికలు.. క్రమశిక్షణల విషయంలో.. 
కాంగ్రెస్‌లో కీలకమైన రెండు కమిటీల విషయంలో రేవంత్‌ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఒకట్రెండు చేరికల ప్రతిపాదనలు వివాదానికి కారణమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ డి.శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి సంజయ్, పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన నేత ఎర్రశేఖర్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఆయా జిల్లాల నాయకత్వాలు రేవంత్‌తో విభేదించాయి. తర్వాతా పలుచోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. 

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి ఎవరిని చేర్చుకోవాలనే అంశంలో సీనియర్లతో కమిటీ వేయాలని నిర్ణయించారు. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చేసినా.. తర్వాత రేవంత్‌ చక్రం తిప్పి జానారెడ్డి పేరు ప్రకటించేలా చేశారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరిగింది. ఆ తర్వాత జానారెడ్డికి కూడా చెప్పకుండానే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలున్నాయి. పార్టీలో ధిక్కార స్వరాలను నియంత్రించాలనే లక్ష్యంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తన జిల్లాకు చెందిన నాయకుడు చిన్నారెడ్డిని రేవంత్‌ నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్‌ శిబిరం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వస్తేనే చిన్నారెడ్డి షోకాజ్‌ నోటీసులు ఇస్తారనే విమర్శలూ ఉన్నాయి. 

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. 
అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రేవంత్‌ విషయంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటన, పార్టీ పదవులు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష నియామకాల్లో జరుగుతున్న కసరత్తు, పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకంలో తాత్సారం, పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత వంటి అంశాల్లో రేవంత్‌రెడ్డిపై చాలా మంది సీనియర్లు కినుకగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు అయినా ఇవన్నీ సర్దుకుంటాయా, మరింత ముదిరి పార్టీ పుట్టి మునుగుతుందా అంటూ గాంధీభవన్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.  

ఇది కూడా చదవండి: నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి.. నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement