ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అద్భుతంగా పనిచేశారంటూ పార్టీ అధిష్టానం అభినందించింది. మహేష్‌కుమార్‌గౌడ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్
విద్యార్థి నేత నుంచి
బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ 1980లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) ద్వారా విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఎనిమిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎస్‌యూఐ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై యూత్‌కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, కార్య దర్శిగా, ప్రధానకార్యదర్శిగా పలు హోదాల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమ యంలో ఏపీ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2017లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుౖలెన సమయంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా టీపీసీసీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండాలని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.
విధేయతకు పెద్దపీట వేస్తూ తాజాగా అధిష్టానం ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిల తర్వాత అధ్యక్షుడు కానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పదోన్నతి కల్పించి పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పదోన్నతి కల్పించి అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.
కరాటే ‘డాన్’....
రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు ఇష్టమైన కరాటే పట్ల ఆసక్తిని మాత్రం తగ్గనివ్వలేదు. 2006లో కరాటే బ్లాక్‌బెల్ట్ 6వ డాన్ పూర్తి చేసిన ఆయన రాష్ట్రంలో కరాటే క్రీడ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.
చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీని బలోపేతం చేస్తా : మహేశ్‌కుమార్‌గౌడ్
నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధితోపాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నెరవేరుస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్లమెంట్‌లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకాలం నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.’అని ఆ ప్రకటనలో మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు.
⇒ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడి గా నియమించిన వార్త తెలియగానే గాంధీ భవన్‌లో టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం అ«ధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
⇒ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడికి ఫోన్ చేసిన రేవంత్ అభినందనలు తెలిపారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్టు వెల్లడించాయి.
మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రొఫైల్
పేరు: బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్
తండ్రి: గంగాధర్‌గౌడ్ (లేట్)
పుట్టిన తేదీ: 24–02–1966
జన్మస్థలం: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా
విద్యార్హత: బీకాం
రాజకీయ ప్రస్థానం:
నిజామాబాద్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు (1986–1990)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు (1990–98)
యూత్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శి (1998–2000)
పీసీసీ కార్యదర్శి (2000–2003), అధికార ప్రతినిధి (2012–2016)
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (2016–2021)
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2017–2024)
Comments
Please login to add a commentAdd a comment