పేదల కన్నీళ్లు అర్థం చేసుకోవాలి.. వారి ముఖాల్లో సంతోషం కన్పించాలి | TPCC President Mahesh Kumar Goud meets AICC Telangana incharge Meenakshi Natarajan | Sakshi
Sakshi News home page

పేదల కన్నీళ్లు అర్థం చేసుకోవాలి.. వారి ముఖాల్లో సంతోషం కన్పించాలి

Published Sat, Mar 1 2025 5:33 AM | Last Updated on Sat, Mar 1 2025 5:33 AM

TPCC President Mahesh Kumar Goud meets AICC Telangana incharge Meenakshi Natarajan

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి తన బ్యాగును తానే మోసుకుంటూ బయటికి వస్తున్న మీనాక్షి నటరాజన్‌. చిత్రంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ తదితరులు

టీపీసీసీ భేటీలో రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌

పదేళ్ల పాటు పార్టీ జెండా మోసినవారి అభిప్రాయాలు వినాలి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఎదుర్కొనేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి

బ్యానర్లలో ఫొటోలు పెట్టి లబ్ధి పొందుదామంటే కుదరదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇలాంటివి ఇంకెక్కడా జరగ డం లేదని తాను భావిస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ చెప్పారు. ‘‘మనకు ఇంకా నాలుగేళ్ల సమయముంది. మన ప్రభుత్వం, సీఎం అనేక పనులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మనం ప్రభుత్వాన్ని నడపడం ద్వారా తెస్తున్న మార్పు మన అంతర్గత వ్యవహారాల్లోనూ కనిపించాలి. మనం కళ్లు మూసుకుంటే పేదల ముఖాలు కనిపించాలి.వారి కన్నీళ్లు అర్థం చేసుకోగలగాలి. వారి ముఖాల్లో సంతోషం కనిపించేలా చేయాలి. అప్పుడే మనం సవ్య దిశలో వెళ్తున్నట్టు. అలా జరగకపోతే మన పంథాను మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రజల్లో విశ్వాసం ఉండదు..’ అని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు.  

కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి: ‘చివరి బంతిలో కూర్చున్న వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో సమీక్ష చేసుకోవాలి. అలా అందకపోతే మనం ప్రభుత్వంలోకి వచ్చి ఉపయోగం లేదు. కాంగ్రెస్‌ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి. వారు ఆత్మగౌరవంతో నిలబడేలా చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన వారిపై ఉంటుంది. తెలంగాణతోపాటు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మన ప్రభుత్వమని కార్యకర్తలకు అనిపించాలి. ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి. పదేళ్లపాటు జెండా మోసిన వారి అభిప్రాయాలను విని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది..’ అని మీనాక్షి చెప్పారు. 

సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి: ‘ఓవైపు ప్రత్యర్థి పార్టీల రాజకీయ వాదాలను నియంత్రిస్తూనే, కాంగ్రెస్‌ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందువల్ల వ్యక్తి వాదం వద్దు. అందరం కలిసి సంఘటితంగా పనిచేయాలి. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీతో పోరాడే విధానం వేరుగా ఉండాలి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు పెద్ద తేడా ఏమీ లేదు. అయితే వారిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి.

దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగింది. ఇది దేశానికే రోల్‌మోడల్‌ కావాలి. సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి. ప్రభుత్వం ఎంత పనిచేసినా పార్టీపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ఉపయోగం ఉండదు. జై బాపూ, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్ర మాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలి..’ అంటూ దిశానిర్దేశం చేశారు. 

రైల్వేస్టేషన్‌కు రావొద్దు.. బ్యాగులు మోయొద్దు: ‘అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం. పార్టీ కార్యకర్తలు ఎవరు ఫోన్‌ చేసినా నేను మాట్లాడతా. నా కోసం ఎవరూ రైల్వేస్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తలను వెనుక తిప్పుకోవడం, జిందాబాద్‌లు కొట్టించుకోవడం సరికాదు. నా బ్యాగులు కూడా ఎవరూ మోయవద్దు. ఒకవేళ నాకు బలం లేకపోతే నేనే సహాయం అడుగుతా. బ్యానర్లు, హోర్డింగుల్లో ఫొటోలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు. ప్రజల్లో ఉన్నప్పుడే గెలుస్తారు. పార్టీ కార్యకర్తలు వారి పనిచేసుకుంటూ వెళ్లాలి. ఎక్కడా ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు. ఏడాది కష్టపడిన విధంగానే మరో నాలుగేళ్లు కష్టపడదాం. అందరితో కలిసి కాంగ్రెస్‌ ప్రభుత్వమంటే పేదల ప్రభుత్వమని నిరూపిద్దాం..’ అని మీనాక్షి పిలుపునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement