
త్వరలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి
‘జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్’లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. ఆదివారం మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ‘జైబాపు.. జైభీమ్..జై సంవిధాన్ అభియాన్’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో త్వరలో మరో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు.
కొత్తగా ఏర్పాటు కాబోయే ఆయా నియోజకవర్గాల్లో ఆశావహులందరికీ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించే వారు ఇప్పటి నుంచే సీరియస్‌గా పార్టీ కోసం పనిచేయాలని, నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలుపించుకోవాలన్నారు.
మతవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్‌పేరుతో గ్రామాల్లో పర్యటించి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కార్యకర్తలకు సూచించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునరి్వభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.
జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
ఉమ్మడి రంగారెడ్డి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం కల్పించకపోవడంతో జిల్లా ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై జిల్లా ముఖ్య నేతలంతా ఓ తీర్మానం చేసి, పార్టీ అధిష్టానానికి పంపారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలెయాదయ్య, అరికెపూడి గాంధీ ఈ సమావేశానికి హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment