సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ టీపీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
కాగా, గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘నేను పీసీసీ అధ్యక్షుడు అయినా కార్యకర్తగానే ఉంటాను. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశాను ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో-ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అందరూ కలిసి పని చేస్తున్నారు.
నాకు గాంధీ భవన్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. నేను పీసీపీ చీఫ్ అవుతానని అనుకోలేదు. నాకు ఇన్నీ రోజులు పదవి ఎందుకు రాలేదు? అని ఎప్పుడు అనుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. అందుకే నాకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు పీసీసీ పదవి వచ్చింది. నాకు భేషజాలు లేవు. గాంధీ భవన్‌లో పవర్ సెంటర్లు లేవు. ఒక్కటే పవర్ సెంటర్ రాహుల్ గాంధీ పవర్ సెంటర్. ప్రతీ రోజు గాంధీ భవన్‌లో ఆరు గంటలు ఉంటాను. ప్రతీ వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాలి. బుధవారం ఒకరు.. శుక్రవారం మరో మంత్రి అందుబాటులో ఉండాలి. నెలకు ఒకసారి సీఎం కూడా గాంధీభవన్‌కు రావాలి.
కౌశిక్ రెడ్డి వాడిన భాష వలన గాంధీ అనుచరులు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక భాష మారిపోయింది. కేసీఆర్‌కు భాషకు రేవంత్ కూడా తన భాషతోనే సమాధానం చెప్పాడు. అందుకే మనం అధికారంలోకి వచ్చాము. బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశాం. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.
రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై ఆనాడు హామీ ఇచ్చాం.. అమలు చేసి చూపించాం. రాజీనామా సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి పోయారు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాకున్నారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్‌రావుకు పంపిస్తాం. మొన్నటి గెలుపు సెమీ ఫైనల్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.
త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఆర్‌ఆర్‌ఆర్ కోసం ప్రధాని మోదీని కలిసాం. ముచ్చర్లలో ఫోర్త్ సిటీ రాబోతుంది. అక్కడ అద్భుతమైన సిటీని నిర్మించబోతున్నాం అంటూ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రతీ ఇంటికీ తీసుకెళ్లే బాధ్యత కొత్త పీసీసీపై ఉంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. పార్టీలో క్రమశిక్షణ ఉంటే కొంచం ఆలస్యమైనా పదవులు వస్తాయి. పార్టీలో చాలా మందికి ప్రభుత్వంలో అవకాశం కల్పించాం. ఇంకా మరికొందరికి కూడా అవకాశం ఇస్తాం అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment