హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. నల్గొండలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ ప్రయాణాలు, విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ రద్దీతో పాటు తదితర కారణాలతో పండుగ తర్వాత మహాధర్నా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy) నేతృత్వంలో మహాధర్నా నిర్వహించాలని తొలుత భావించారు. అయితే ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ ముందుకు జరుపుతూ వస్తోంది. తాజాగా ఆయన విచారణ ముగిసిన సంగతీ తెలిసిందే.
రైతు భరోసా(Rythu Bharosa) కుదింపుపై రైతుల ఆగ్రహాన్ని ప్రజలను చూపించాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ ఈ కార‍్యక్రమం నిర్వహించాలనుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించింది. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్న డిమాండ్‌తో నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఈ మహాధర్నా నిర్వహించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment