నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ | Today is a Rahul Show | Sakshi
Sakshi News home page

నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ

Published Thu, May 14 2015 12:56 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ - Sakshi

నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ

నర్సాపూర్ చౌరస్తాలో కార్యక్రమం
కాళ్లకల్ వద్ద జిల్లాలో ప్రవేశం
ఏర్పాట్లను పరిశీలించిన సునీత, గీతారెడ్డి

 
తూప్రాన్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి.  మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో రాహుల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గీతారెడ్డి బుధవారం పరిశీలించారు.

రాహుల్ గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు తూప్రాన్ వస్తారన్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద స్టేజి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయనకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలతో పాటు రైతులు జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు.

 పర్యటన ఇలా..
► రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గం మీదుగా రంగారెడ్డి జిల్లా బోయిన్‌పల్లి, మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కాళ్లకల్‌లో ప్రవేశిస్తారు.
► అక్కడ నుంచి ర్యాలీగా తూప్రాన్ చేరుకుంటారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.
► అనంతరం రోడ్డు మార్గంలో చేగుంట మీదుగా రామాయంపేట బైపాస్ మార్గంలో కామారెడ్డి చేరుకుంటారు.
► మెదక్ జిల్లాలో మొత్తంగా కాళ్లకల్ నుంచి రామాయంపేట వరకు 50 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటన సాగనుంది.

భారీ ఏర్పాట్లు.. బందోబస్తు
 జిల్లాలో దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగే రాహుల్ పర్యటనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో గురువారం రాహుల్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.

బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు, 14 మంది ఎస్‌ఐలు, వంద మంది పోలీసులు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.

 రైతుల వెంటే కాంగ్రెస్
 తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో లేకున్నా రైతుల వెంట ఉంటుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement