sunita lakshma reddy
-
సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్ టికెట్
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై సుమారు మూడు నెలలుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ప్రగతిభవన్‌లో నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చేతుల మీదుగా కేసీఆర్ సమక్షంలోనే బుధవారం సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ బీ ఫాం అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీ ఎన్నికల కోర్ కమిటీ సభ్యులు, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు సమక్షంలో ప్రగతిభవన్‌లో మదన్‌రెడ్డి, సునీత రెడ్డి మధ్య టికెట్ వివాదానికి తెరదించారు. సీఎం సమక్షంలో హామీ ఇవ్వడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినా నర్సాపూర్‌ను పెండింగ్ జాబితాలో పెట్టా రు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి సుమారు నెల రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ లభించినా అధికారికంగా ఆమె పేరును ప్రకటించలేదు. మదన్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు మంత్రి హరీశ్‌రావు నివాసం ఎదుట ఆందోళన కూడా చేశారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు తరచూ వెళ్తూ తనకు టికెట్ ఇవ్వా లని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పలుమార్లు మదన్‌రెడ్డితో భేటీ అయి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో మదన్‌రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆయన సునీతా లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మదన్‌రెడ్డి సీనియారిటీని గుర్తిస్తాం: కేసీఆర్ ‘మదన్ రెడ్డి నాతో పారీ్టలో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజస్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్తుతం మెదక్ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆయన స్థానంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డికి వివాద రహితుడిగా పేర్కొంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్‌రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినందుకు ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చదవండి: కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి -
నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నర్సాపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టికెట్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ను పెండింగ్‌లో పెట్టడం ఆ నియోజకవర్గంలో ఉ త్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇప్పుడీ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా పర్యటన తర్వాత.. నర్సాపూర్ టికెట్ తనకంటే తనకే ఇవ్వాలంటూ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మదన్‌రెడ్డి రెండు రోజుల కింద మంత్రి హరీశ్‌రావును కలసి తనకు టికెట్ ఖరారు చేసేలా చూడాలని కోరారు. సునీత కూడా హరీశ్‌రావుతోపాటు, ఎమ్మెల్సీ కవితను కలసి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడైన మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన వయోభారం, ఆయన అనుచరులపై అక్రమ దందాల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సునీతకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ను వీడుతామని మదన్‌రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు నర్సాపూర్ టికెట్ ఇస్తామనే హామీతోనే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరారని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనుండటంతో.. త్వరలోనే నర్సాపూర్ టికెట్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరూ కలిసే టీవీ చూస్తూ.. సోమవారం మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూర్చునే.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనను టీవీలో వీక్షించడం గమనార్హం. వీరితోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరికొందరు నేతలూ అక్కడ ఉన్నారు. నర్సాపూర్ టికెట్ ఎవరికి ప్రకటిస్తారోనని ఉత్కంఠతో అంతా ఎదురుచూశారు. కానీ పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్లో పడ్డారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది ‘‘సీఎం కేసీఆర్ కుటుంబంతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఆయన నర్సాపూర్ టికెట్ నాకే కేటాయిస్తారు. కేసీఆర్‌పై పూర్తి భరోసా ఉంది. ఈ స్థానాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో తెలియదు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా..’’ – చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. ‘‘నాకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను కలసి విజ్ఞప్తి చేశాను. నర్సాపూర్ టికెట్ ఎందుకు ప్రకటించలేదో మాకు తెలియదు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’’ – సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ -
మానవ అక్రమ రవాణాపై ఉమ్మడి పోరు
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ అంశంపై రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో పలు తీర్మానాలు చేస్తూ అవగాహనకు వచ్చాయి. సదస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్పర్సన్లు అవగాహన పత్రంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయం చేయగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ఈ ఆరు రాష్ట్రాలు కలిసి పనిచేయనుండగా... యూఎస్ కాన్సులేట్ కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్పర్సన్లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయగా... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నాయి. మూడో అతిపెద్ద నేరమిది: సునీతా లక్ష్మారెడ్డి సమాజంలో మాదకద్రవ్యాల సరఫరా, ఆయుధాల రవాణా తర్వాత ఈ జాబితాలో చేరిన మూడో అతిపెద్ద నేరం మానవ అక్రమ రవాణాయేనని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100, మహిళా హెల్ప్‌లైన్ 181, మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్ 9490555533, 1098 చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సునీత కోరారు. కార్యక్రమంలో ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రాహుల్ ‘షో’.. కాంగ్రెస్ రెడీ
నర్సాపూర్ చౌరస్తాలో కార్యక్రమం కాళ్లకల్ వద్ద జిల్లాలో ప్రవేశం ఏర్పాట్లను పరిశీలించిన సునీత, గీతారెడ్డి తూప్రాన్ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగత సన్నాహాలు చేస్తున్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తాలో రాహుల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గీతారెడ్డి బుధవారం పరిశీలించారు. రాహుల్ గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని, అక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటలకు తూప్రాన్ వస్తారన్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద స్టేజి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆయనకు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలతో పాటు రైతులు జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో కూడిన వినతిపత్రం అందజేస్తామన్నారు. పర్యటన ఇలా.. ► రాహుల్‌గాంధీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గం మీదుగా రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లి, మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కాళ్లకల్‌లో ప్రవేశిస్తారు. ► అక్కడ నుంచి ర్యాలీగా తూప్రాన్ చేరుకుంటారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు. ► అనంతరం రోడ్డు మార్గంలో చేగుంట మీదుగా రామాయంపేట బైపాస్ మార్గంలో కామారెడ్డి చేరుకుంటారు. ► మెదక్ జిల్లాలో మొత్తంగా కాళ్లకల్ నుంచి రామాయంపేట వరకు 50 కిలోమీటర్ల మేర రాహుల్ పర్యటన సాగనుంది. భారీ ఏర్పాట్లు.. బందోబస్తు జిల్లాలో దాదాపు 50 కిలోమీటర్ల మేర సాగే రాహుల్ పర్యటనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో గురువారం రాహుల్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేశారు. బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు పార్టీ జెండాలు, బ్యానర్లు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక, పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తా ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు, 14 మంది ఎస్ఐలు, వంద మంది పోలీసులు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. రైతుల వెంటే కాంగ్రెస్ తూప్రాన్‌లోని నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో లేకున్నా రైతుల వెంట ఉంటుందన్నారు. -
మెదక్ ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం: సోనియా
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కష్టపడి ఐక్యంగా పార్టీ అభ్యర్థి సునీతలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఆదేశించారు. గత రెండురోజులుగా సోనియా స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి, ఇతర ప్రధాన నాయుకులతోపాటు మెదక్ జిల్లాలోని ముఖ్య నేతలకు ఫోన్‌చేసి పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.