అవగాహన పత్రాన్ని ఆవిష్కరిస్తున్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ అంశంపై రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో పలు తీర్మానాలు చేస్తూ అవగాహనకు వచ్చాయి. సదస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్‌పర్సన్లు అవగాహన పత్రంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయం చేయగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. మానవ అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా ఈ ఆరు రాష్ట్రాలు కలిసి పనిచేయనుండగా... యూఎస్ కాన్సులేట్ కూడా తన వంతు సహకారం అందించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్‌పర్సన్లు ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయగా... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నాయి.
మూడో అతిపెద్ద నేరమిది: సునీతా లక్ష్మారెడ్డి
సమాజంలో మాదకద్రవ్యాల సరఫరా, ఆయుధాల రవాణా తర్వాత ఈ జాబితాలో చేరిన మూడో అతిపెద్ద నేరం మానవ అక్రమ రవాణాయేనని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100, మహిళా హెల్ప్‌లైన్ 181, మహిళా కమిషన్ వాట్సాప్ నంబర్ 9490555533, 1098 చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సునీత కోరారు. కార్యక్రమంలో ఏపీ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment