చిలుముల మదన్‌రెడ్డి , సునీతా లక్ష్మారెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నర్సాపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టికెట్లను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ను పెండింగ్‌లో పెట్టడం ఆ నియోజకవర్గంలో ఉ త్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇప్పుడీ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మెదక్ జిల్లా పర్యటన తర్వాత..
నర్సాపూర్ టికెట్ తనకంటే తనకే ఇవ్వాలంటూ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మదన్‌రెడ్డి రెండు రోజుల కింద మంత్రి హరీశ్‌రావును కలసి తనకు టికెట్ ఖరారు చేసేలా చూడాలని కోరారు. సునీత కూడా హరీశ్‌రావుతోపాటు, ఎమ్మెల్సీ కవితను కలసి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు.
పార్టీలో సీనియర్ నాయకుడైన మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన వయోభారం, ఆయన అనుచరులపై అక్రమ దందాల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సునీతకు టికెట్ ఇస్తే బీఆర్‌ఎస్‌ను వీడుతామని మదన్‌రెడ్డి వర్గీయులు అంటున్నారు.
మరోవైపు నర్సాపూర్ టికెట్ ఇస్తామనే హామీతోనే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనుండటంతో.. త్వరలోనే నర్సాపూర్ టికెట్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఇద్దరూ కలిసే టీవీ చూస్తూ..
సోమవారం మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూర్చునే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనను టీవీలో వీక్షించడం గమనార్హం. వీరితోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరికొందరు నేతలూ అక్కడ ఉన్నారు. నర్సాపూర్ టికెట్ ఎవరికి ప్రకటిస్తారోనని ఉత్కంఠతో అంతా ఎదురుచూశారు. కానీ పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్‌లో పడ్డారు.
సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది
‘‘సీఎం కేసీఆర్ కుటుంబంతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఆయన నర్సాపూర్ టికెట్ నాకే కేటాయిస్తారు. కేసీఆర్‌పై పూర్తి భరోసా ఉంది. ఈ స్థానాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో తెలియదు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా..’’ – చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా..
‘‘నాకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను కలసి విజ్ఞప్తి చేశాను. నర్సాపూర్ టికెట్ ఎందుకు ప్రకటించలేదో మాకు తెలియదు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’’ – సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్
Comments
Please login to add a commentAdd a comment