సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలకుపైగా గడువున్నా.. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తుగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా, ఒకేసారి అభ్యర్థులను వెల్లడించడంలో కేసీఆర్ ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ఓవైపు హర్షం కనిపిస్తుండగా.. ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం బలహీనతేనని మరోవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్పులు చేయడానికి అవకాశమున్నా మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి అవకాశం ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
దళితబంధులో 30శాతం ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరికీ టికెట్ కేటాయించడం ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. గెలుపు గుర్రాలు కాని వారికి కూడా ఒత్తిళ్లు, లాబీయింగ్‌కు తలొగ్గి టికెట్లు కేటాయించి కేసీఆర్ బలహీనత చాటుకున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
సామాజిక సమతుల్యతపై..
బీఆర్‌ఎస్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యతను పాటించలేదని, మహిళలకు కనీసం పది సీట్లయినా కేటాయించకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 54శాతానికిపైగా ఉన్న బలహీనవర్గాలకు కేవలం 20శాతం సీట్లు కేటాయించడం సరికాదని ఆయా సామాజిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సమయంలో 15శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఏకంగా 50శాతానికిపైగా సీట్లను కేటాయించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. గతంలో బీసీలకు కేటాయించిన హుజూరాబాద్, కామారెడ్డి స్థానాలను సైతం ఈసారి అగ్రవర్ణాలకు కేటాయించడమేంటని మండిపడుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న బీసీ కులాల్లో కేవలం ఆరు కులాలకే ప్రాతినిధ్యం దక్కడం, ఇందులోనూ మున్నూరు కాపు మినహా మిగతా కులాలకు నామమాత్రంగానే టికెట్లు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీలను కేవలం రిజర్వుడు స్థానాలకే పరిమితం చేశారని విమర్శలు వస్తున్నాయి. ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినట్టు కనిపిస్తున్నా.. బోధన్ మినహా మిగతా రెండు స్థానాలను పార్టీకి ఏమాత్రం పట్టులేని హైదరాబాద్ పాతబస్తీలో కేటాయించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక టికెట్ తిరస్కరణకు గురైన వారిలో ఎస్టీలే ఎక్కువగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి.
మహిళలకు కేటాయింపులు ఇంతేనా?
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీఆర్‌ఎస్.. ప్రస్తుత జాబితాలో నాలుగు శాతమే సీట్లు కేటాయించిందని రాజకీయవర్గాలు, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. 115 మంది జాబితాలో ఏడుగురే మహిళలకు చోటు కల్పించడం ఏ విధమైన పురోగతి అని మండిపడుతున్నాయి. చట్టసభల్లో 33శాతం సీట్లు కేటాయించాలంటూ బీఆర్‌ఎస్ ఢిల్లీలో ధర్నా, నిరసనలు నిర్వహించిందని గుర్తు చేస్తున్నాయి.
అసంతృప్తిలో ‘బహుళ’నాయకత్వం!
రాష్ట్ర ఏర్పాటు తర్వాత విపక్షాలకు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత 20 మందికిపైగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ గూటికి చేరుకోగా.. 2018 ఎన్నికల తర్వాత ఇలా 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. ఉద్యమ సమయంలో మొదలుకుని ఇప్పటిదాకా.. వివిధ పారీ్టల నుంచి వచ్చిన చేరిన నేతలతో 40కి పైగా నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య మొదలైంది.
చాలా మంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించి వచ్చినవారు ఉన్నారు. కానీ 2018లో, ఇప్పుడు కూడా దాదాపుగా సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడం.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో నిరాశను మిగిలి్చంది. 40కిపైగా స్థానాల్లో టికెట్లు ఆశించిన నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాల పేరిట తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక 30మందికిపైగా నేతలు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినా బీఆర్‌ఎస్ పెద్దలు స్పందించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు.
సర్వేల ఆధారంగానే టికెట్లేవి?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్ చెప్పినా.. పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి.. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నట్టు ప్రకటించారు.
పలుమార్లు పార్టీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక నేతలు, కేడర్‌ను కలుపుకొనిపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల బంధుప్రీతి, అవినీతి, సొంత పార్టీ కేడర్‌పైనే వేధింపులు, పోలీసు కేసులు వంటి ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఇలాంటిది సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడమంటే.. సర్వేలు, పనితీరును పక్కనపెట్టేసినట్టేనా అని బీఆర్‌ఎస్‌లోని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment