సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్‌ఎస్ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్‌ఎస్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు.
తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి.
కార్యాచరణపై సమావేశాలు
బీఆర్‌ఎస్ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టార్గెట్ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్‌ఎస్‌తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు.
బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment