సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తుల లెక్కలు తీయాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వివరాలను సేకరించి ప్రజల ముందుంచాలని చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ టూర్‌లో భాగంగా కర్ణాటకలోని కూర్గ్‌లో ఉన్న ఆయన మంగళవారం ఈమేరకు స్పందించారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశి్నస్తున్నారని, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ నుంచి అని గుర్తుచేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సేనని, 50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పింఛన్లు ఒకటో తేదీకల్లా ఇచ్చామని, బీఆర్‌ఎస్ హయాంలో మాత్రం 15వ తేదీకి కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
విశ్వవిద్యాలయాల్లో కనీసం బాత్‌రూంలు కట్టించలేని ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని అని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన కేసీఆర్‌కు కాంగ్రెస్ గురించి ప్రశ్నించే హక్కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో 32 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment