Assembly tickets
-
పేరుకే రిజర్వుడు నియోజకర్గం.. పెత్తనమంతా వారిదే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే.. కలిసికట్టుగా పనిచేసుకుంటాం.. జనసేనకు ఇస్తే మేం సహకరిస్తామని టీడీపీ ఇన్చార్జి.. అలాగే టీడీపీకి ఇస్తే సహకరిస్తామని జనసేన నేతలు స్థానికంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీల ముఖ్యులకు చెప్పారు. కట్ చేస్తే.. పోలవరం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. మొదటి రెండు మూడు రోజులు వ్యవహారమంతా బాగానే ఉంది. ఆ తరువాత నుంచి అసలు గొడవకు తెర లేచింది. జనసేన అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలంటూ ఆ పార్టీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి మరీ ఘెరావ్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. పొత్తులు.. కత్తులు పోలవరంలో పొత్తు పార్టీల్లోని నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ధృతరాష్ట్ర కౌగిలిలో గడిపిన రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకునే స్థాయికి చేరడం వెనుక ఇద్దరు అభ్యర్థులను నడుపుతున్న రెండు సామాజిక వర్గాలే ప్రధాన కారణమనే చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పోలవరం ఇన్చార్జిగా బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జిగా చిర్రి బాలరాజు కొనసాగుతున్నారు. పేరుకే ఇది రిజర్వుడు నియోజకవర్గం. జనసేనలో పవన్‌కళ్యాణ్ సామాజికవర్గం, టీడీపీలో చంద్రబాబు సామాజికవర్గం నేతలదే ఇక్కడ ఆధిపత్యం. రెండు సామాజిక వర్గాల నేతలు ఎవరికి సూచిస్తే ఆయా పార్టీ అభ్యర్థులుగా ఇప్పటివరకు రాజకీయం నడిచింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మొడియం శ్రీనివాస్ 2019లో టికెట్ కోల్పోయారు. 2019లో బొరగం శ్రీనివాస్‌కు సీటు దక్కగా ఆయన ఓటమి పాలయ్యాడు. అయినా ఇన్చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలో బాబు సామాజికవర్గ నేతల సహకారంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో పొత్తులతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో పోలవరంలో చిచ్చు రేగింది. పొత్తులకు ముందు వరకు టీడీపీ సీటు కోసం ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లు ప్రయత్నించారు. జనసేనకే టికెట్ అని ప్రకటించడంతో ఇద్దరూ రెండు రోజుల పాటు హడావుడి చేసి సర్దుకున్నారు. నిరసనల పర్వం జనసేన టికెట్ ఖరారుకు ముందు టీడీపీ దెందులూరు ఇన్చార్జి చింతమనేని ప్రభాకర్, పోలవరం టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి చిర్రి బాలరాజులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారు. జనసేన టికెట్ తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని, ఇబ్బంది లేదని మా ట్లాడుకుని వచ్చారు. ఆ తరువాత రెండు రోజులకు జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించారు. భీమవరంలో అప్పటివరకు టీడీపీ నేతగా ఉన్న పులపర్తి రామాంజనేయులుకు జనసేన కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించిన రీతిలో అవకాశం దక్కుతుందేమోనని బొరగం ఆశ పడ్డారు. అయితే జనసేన నేతకు టికెట్ ఇవ్వడంతో బాబు సామాజికవర్గ నేతల వర్గీయులతో కలిసి బొరగం వర్గీయులు నిరసనలకు తెరతీశారు. ఆ సామాజిక వర్గ నేతల వద్దకు వెళ్లలేం ప్రతి పనికీ పవన్‌కళ్యాణ్ సామాజికవర్గ నేతల వద్దకు తాము వెళ్లలేమని, అందుకే టికెట్ మార్చి టీడీపీ అభ్యర్థికి ఇవ్వాలంటూ బొరగం వర్గీయులు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబునాయుడు క్యాంప్ వద్ద ధర్నాకు దిగి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం పోలవరంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థి మార్పు ఉంటుందని టీడీపీ బలంగా నమ్ముతుండగా, జనసేన అభ్యర్థి మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు ఎవరూ లేకుండానే పది రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్ పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నిర్వహించిన సభలకు హాజ రుకావడం మరో చర్చగా మారింది. -
సినబాబు సిలక్కొట్టుడు.. టిక్కెట్ల పేరిట డబ్బులు వసూళ్లు
టీడీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్నానని భావిస్తున్న లోకేష్ కొన్ని సందర్భాల్లో పార్టీని తానే సొంతంగా లీడ్ చేయాలని ఆశిస్తుంటారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లోనూ కొన్ని సార్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి ఎదురుతంతున్నప్పటికీ తీరు మార్చుకొని లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేస్తూ తండ్రిని ఇరకడంలో పెడుతున్నారు. జనసేనతో అధికార పంపిణీ విషయంలో అయన చేసిన కామెంట్స్ జనసైనికుల్లో అగ్రహాన్ని లేపాయి. అసలు అలాంటి ఆలోచనే లేదని, కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని తేల్చేసారు. దానికి తోడు యువగళం పాదయాత్రలో తనలో పోరాట పటిమ, పరిణితి బాగా పెరిగిందని భావిస్తున్న లోకేష్ ఇప్పటికే తండ్రిని ఓవర్ టేక్ చేసి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో చిక్కులు తెస్తున్నట్లు పెద్దలు గుర్తించారు. వాస్తవానికి ఆమధ్య పాదయాత్రలో భాగంగా లోకేష్ చాలాచోట్ల బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు నాయకులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసారు. అయితే అయన ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రకటించుకుంటూ వెళ్లడంతో చంద్రబాబు ఆగ్రహించి ఇకముందు అలా చేయొద్దని హెచ్చరించడంతో ఆ తరువాత అయన అభ్యర్థుల ప్రకటనను ఆపేసారు. కానీ తనలోని పెద్దరికపు కోరికను చంపుకోలేని లోకేష్ దాదాపు నలభై మంది వరకు ఆశావహుల దగ్గర టిక్కెట్లు ఆశచూపి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువమంది లోకేష్ కు దాదాపు ఐదేసి కోట్లవరకు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారికి టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మరేంది. గుంటూరు జిల్లాలో ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని దగ్గర దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని తెలిసింది. ఐతే ఇప్పుడు అయన టిక్కెట్ వెనుకబడినట్లు చెబుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినావాళ్ళకు ప్రజాదరణ లేదని సర్వేల్లో తేలిందని, అందుకే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసారని అంటున్నారు. అనంతపురంలో ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా ఇలాగే కొంత డబ్బు తీసుకుని లోకేష్ హామీ ఇచ్చినా అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ సర్వే చేస్తున్నారు. అందులోకానీ సదరు నాయకుడికి మంచి మార్కులు రాకపోతే టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారట. విశాఖ నుంచి కూడా ఇలాగే కొందరికి హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో తెలియడం లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని లోకేష్ నచ్చజెబుతున్నట్లు అంటున్నారు. కానీ ఆ మాటలు నమ్మేలా లేవని, అనవసరంగా డబ్బులిచ్చి ఇరుక్కున్నామని వారు వాపోతున్నారు. మొత్తానికి చినబాబు లోకేష్ జోక్యం పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
ఎమ్మెల్యే సీటుకు రూ. 50 కోట్లు ఖర్చు పెట్టాలని కండీషన్
-
అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. గ్రేటర్ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. మాకూ ఓ భవన్ కట్టివ్వాలి... గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అఫ్ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖరారుకు ముందే తకరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ టికెట్లు ఎవరెవరికి ఇచ్చేదీ ఇంకా ఖరారుకాక ముందే అసమ్మతి సెగ మొదలైంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో జరుగుతున్న చర్చలు, ఖరారయ్యాయని భావిస్తున్న స్థానాల గురించిన సమాచారం బయటికి వస్తుండటంతో అసంతృప్తులు గళం విప్పుతున్నారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ.. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన నాయకుడు కొత్త మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆశావహుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మాల, మాదిగ, లంబాడీ, ఆదివాసీ, పార్టీ అనుబంధ సంఘాలు, ఇతర కేటగిరీల పేరుతో ఇప్పటికే టికెట్ల కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. టికెట్ల ప్రకటన తర్వాత పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీకి బీసీ నేతలు ఈసారి బీసీలకు టికెట్ల కేటాయింపు కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు రాజేసేలా కనిపిస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున 34 స్థానాలు బీసీలకు ఇస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మాట ఇచ్చింది. ఈ మేరకు తమకు కనీసం 34 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని.. వాటిని 40 వరకు పెంచాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ వేదికగా పలుమార్లు సమావేశం కావడంతోపాటు ఇప్పుడు హస్తిన బాట పట్టారు. బీసీ నేతలు బుధవారమే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవాల్సి ఉన్నా.. ఆయన బెంగళూరులో ఉండటంతో వీలుకాలేదు. అందుబాటులో ఉన్న అధిష్టానం నేతలను కలుస్తున్న బీసీ నేతలు.. గురువారం ఖర్గేను, వీలుంటే రాహుల్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే టీపీసీసీ నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అన్న దానిపై బీసీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వేలలో మంచి ఫలితాలు రావడం లేదన్న సాకు చూపి తమకు ఇవ్వాల్సిన టికెట్లను అగ్రవర్ణాలకు కేటాయించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. అందుకే తొలి జాబితాలో బీసీ నేతల పేర్లు రాకుండా చేసి, వారిని టికెట్ ఒత్తిడిలో ఉంచి మిగతా వారి కోసం మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నమని పేర్కొంటున్నారు. ఈసారి టికెట్ల కేటాయింపులో తేడా వస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే టికెట్లు ఆశిస్తున్న బీసీల్లో ఎక్కువ శాతం అగ్రవర్ణ నాయకులతోనే పోటీ పడుతుండటంతో.. తమను కాదని ఓసీ నేతలకు టికెట్లు ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మాకు మరో మూడు సీట్లివ్వండి ఎస్టీ నేతలు కూడా తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలను కోరుతున్నారు. 40–50 స్థానాల్లో ప్రభావితం చేయగల తమ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన 12 అసెంబ్లీ సీట్లకుతోడు కనీసం మరో 3 జనరల్ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా లంబాడా, కోయ (ఆదివాసీ) సామాజిక వర్గాలకు ఏయే సీట్లు ఇవ్వాలనే విభజన కూడా చేస్తున్నారు. దేవరకొండ, వైరా, ఖానాపూర్, బోథ్, మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు స్థానాలు లంబాడాలకు ఇవ్వాలని.. ఆసిఫాబాద్‌లో ఆదివాసీలకు, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక కోయ వర్గానికి ఇవ్వాలని కోరుతున్నారు. అంతేగాకుండా తెలంగాణలో 31 లక్షలకు పైగా ఎస్టీ జనాభా ఉందని.. జనాభా ప్రాతిపదికన మరో మూడు జనరల్ స్థానాల్లో కూడా ఎస్టీలకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం తాము కూడా బీసీ నేతల తరహాలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. బుజ్జగింపులు షురూ అసమ్మతి కుంపట్లపై ఓ అంచనాకు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేను రంగంలోకి దింపింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభమవడానికి ముందే తన పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత ముమ్మరం చేశారు. గాందీభవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా మంతనాలు జరుపుతున్నారు. నేతలతో మాట్లాడుతూ.. పార్టీపై నమ్మకం ఉంచాలని, టికెట్ వచ్చినా, రాకపోయినా సహకరించాలని కోరుతున్నారు. మొత్తమ్మీద టికెట్ల ప్రకటన ఘట్టం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు అటు ఉత్కంఠతోనూ, ఇటు ఆందోళనతోనూ ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కోచోట పది మంది.. కాంగ్రెస్ టికెట్ల కోసం పదిమందికిపైగా దరఖాస్తు చేసుకున్న స్థానాలు 50కి పైగా ఉన్నాయి. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు గట్టిగానే యత్నిస్తున్నారు. వివిధ సమీకరణాల్లో లాబీయింగ్ చేసుకుంటూ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా మిగతా నేతలు రోడ్డెక్కే అవకాశాలున్నాయి. ముఖ్య నాయకులపై ఉన్న అసంతృప్తిని కక్కేసి ఇతర పార్టీలోకి వెళ్లిపోవాలని కొందరు, పార్టీలోనే ఉండి తమకు అన్యాయం చేసిన నేతలను బహిరంగంగా విమర్శించాలని మరికొందరున్నట్టు సమాచారం. టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించిన మహేశ్వరం నేత కొత్త మనోహర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో.. అధికారికంగా టికెట్లు ప్రకటించాక ఎన్ని చోట్ల అసమ్మతి రగులుతుంది? దాన్ని చల్లార్చే యత్నాలు ఏమేరకు గట్టెక్కుతాయి? టికెట్లు రాక రోడ్డెక్కేనేతలపై ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. -
బీజేపీకి 6,003 దరఖాస్తులు.. కిషన్‌రెడ్డి, బండి సహా ముఖ్య నేతలు దూరం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ టికెట్ల కోసం బీజేపీ ఆశావహుల నుంచి మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. ఇందుకు చివరి రోజైన ఆదివారం నాడే ఏకంగా 2,780 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. కాగా ఈ నెల 4 నుంచి శనివారం వరకు 3,223 దరఖాస్తులు అందడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 6,003కు చేరుకుంది. అయితే రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యనేతలు జి.కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్. డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఆయా నియోజకవర్గాల్లో పట్టు ఉన్న పలువురు నాయకులు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. కాగా పార్టీలో, రాజకీయంగా అత్యంత సీనియర్లుగా ఉంటూ, ఆయా స్థానాల్లో తిరుగులేని నాయకులుగా ఉన్న తమను కూడా అందరిలాగే పోటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంపై కొందరు ముఖ్యనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కేంద్ర కేబినెట్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్టేనని, అందువల్ల తాను ఎంపీగానే పోటీ చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పార్టీ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది. తాను ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నానని, పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తానని ధర్మపురి అర్వింద్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా చెబుతున్నారు. 25–30 మందితో తొలి జాబితా ఇప్పటికే రెడీ? ఇటీవల జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ భేటీలో 25–30 నియోజకవర్గాలకు ముఖ్య నేతల పేర్లతో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు రాష్ట్ర పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసే ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. అందువల్లే కీలక నేతలు దరఖాస్తు చేసుకోలేదని, మిగిలిన 90 వరకు అసెంబ్లీ స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికకు వడబోత చేపట్టాల్సి ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర పార్టీలలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా బలమైన నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశమున్నందున కొన్ని స్థానాలు రిజర్వ్‌లో పెట్టాల్సి ఉంటుందని కూడా అంటున్నారు. బండారు దత్తాత్రేయ కుమార్తె దరఖాస్తు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముషీరాబాద్ నుంచి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శేరిలింగంపల్లికి మాజీ ఎమ్మెల్యే కుమారుడు రవికుమార్‌యాదవ్, ఎల్బీనగర్ సీటుకు డా. జి.మనోహర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ కోసం డా.ఎస్.మల్లారెడ్డి, కొత్తగూడెం స్థానానికి కేవీ రంగాకిరణ్ దరఖాస్తు చేసుకున్నారు. సినీనటి జీవితా రాజశేఖర్ 5 సీట్లకు (జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, సనత్‌నగర్, శేరిలింగంపల్లి) దరఖాస్తు చేసినట్లు తెలిసింది. హుజూరాబాద్ నుంచి పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, గజ్వేల్ నుంచి ఈటల సతీమణి జమున తమ ప్రతినిధుల ద్వారా దరఖాస్తులు పంపించినట్లు చెబుతున్నారు. -
ఆత్మ విశ్వాసమా.. బలహీనతా?.. ఒకేసారి 115 మందితో బీఆర్ఎస్ జాబితాపై చర్చ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలకుపైగా గడువున్నా.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తుగా ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా, ఒకేసారి అభ్యర్థులను వెల్లడించడంలో కేసీఆర్ ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ఓవైపు హర్షం కనిపిస్తుండగా.. ప్రజల్లో వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం బలహీనతేనని మరోవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్పులు చేయడానికి అవకాశమున్నా మెజారిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి అవకాశం ఇవ్వడంపై పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. దళితబంధులో 30శాతం ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో.. ఇప్పుడు అందరికీ టికెట్ కేటాయించడం ఏమిటనే సందేహాలు వస్తున్నాయి. గెలుపు గుర్రాలు కాని వారికి కూడా ఒత్తిళ్లు, లాబీయింగ్‌కు తలొగ్గి టికెట్లు కేటాయించి కేసీఆర్ బలహీనత చాటుకున్నారనే విమర్శలూ వస్తున్నాయి. సామాజిక సమతుల్యతపై.. బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమతుల్యతను పాటించలేదని, మహిళలకు కనీసం పది సీట్లయినా కేటాయించకపోవడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 54శాతానికిపైగా ఉన్న బలహీనవర్గాలకు కేవలం 20శాతం సీట్లు కేటాయించడం సరికాదని ఆయా సామాజిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో 15శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఏకంగా 50శాతానికిపైగా సీట్లను కేటాయించడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. గతంలో బీసీలకు కేటాయించిన హుజూరాబాద్, కామారెడ్డి స్థానాలను సైతం ఈసారి అగ్రవర్ణాలకు కేటాయించడమేంటని మండిపడుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న బీసీ కులాల్లో కేవలం ఆరు కులాలకే ప్రాతినిధ్యం దక్కడం, ఇందులోనూ మున్నూరు కాపు మినహా మిగతా కులాలకు నామమాత్రంగానే టికెట్లు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలను కేవలం రిజర్వుడు స్థానాలకే పరిమితం చేశారని విమర్శలు వస్తున్నాయి. ముస్లింలకు మూడు సీట్లు ఇచ్చినట్టు కనిపిస్తున్నా.. బోధన్ మినహా మిగతా రెండు స్థానాలను పార్టీకి ఏమాత్రం పట్టులేని హైదరాబాద్ పాతబస్తీలో కేటాయించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక టికెట్ తిరస్కరణకు గురైన వారిలో ఎస్టీలే ఎక్కువగా ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి. మహిళలకు కేటాయింపులు ఇంతేనా? మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. ప్రస్తుత జాబితాలో నాలుగు శాతమే సీట్లు కేటాయించిందని రాజకీయవర్గాలు, మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. 115 మంది జాబితాలో ఏడుగురే మహిళలకు చోటు కల్పించడం ఏ విధమైన పురోగతి అని మండిపడుతున్నాయి. చట్టసభల్లో 33శాతం సీట్లు కేటాయించాలంటూ బీఆర్ఎస్ ఢిల్లీలో ధర్నా, నిరసనలు నిర్వహించిందని గుర్తు చేస్తున్నాయి. అసంతృప్తిలో ‘బహుళ’నాయకత్వం! రాష్ట్ర ఏర్పాటు తర్వాత విపక్షాలకు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. 2014 ఎన్నికల తర్వాత 20 మందికిపైగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకోగా.. 2018 ఎన్నికల తర్వాత ఇలా 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. ఉద్యమ సమయంలో మొదలుకుని ఇప్పటిదాకా.. వివిధ పారీ్టల నుంచి వచ్చిన చేరిన నేతలతో 40కి పైగా నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వ సమస్య మొదలైంది. చాలా మంది ఎమ్మెల్యే టికెట్లు ఆశించి వచ్చినవారు ఉన్నారు. కానీ 2018లో, ఇప్పుడు కూడా దాదాపుగా సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడం.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేతల్లో నిరాశను మిగిలి్చంది. 40కిపైగా స్థానాల్లో టికెట్లు ఆశించిన నేతలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రయోజనాల పేరిట తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక 30మందికిపైగా నేతలు తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరినా బీఆర్ఎస్ పెద్దలు స్పందించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. సర్వేల ఆధారంగానే టికెట్లేవి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకు ప్రాధాన్యతనిస్తామని కేసీఆర్ చెప్పినా.. పనితీరు, సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పలుమార్లు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి నుంచే ఎన్నికల సన్నద్ధతను ప్రారంభించి.. నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నట్టు ప్రకటించారు. పలుమార్లు పార్టీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలక నేతలు, కేడర్‌ను కలుపుకొనిపోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్యేల బంధుప్రీతి, అవినీతి, సొంత పార్టీ కేడర్‌పైనే వేధింపులు, పోలీసు కేసులు వంటి ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఇలాంటిది సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇవ్వడమంటే.. సర్వేలు, పనితీరును పక్కనపెట్టేసినట్టేనా అని బీఆర్ఎస్లోని ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. -
కాంగ్రెస్ :అసెంబ్లీ టికెట్ కోసం 38లక్షలు వసూలు
వరంగల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ ముఖ్యనేత డబ్బు తీసుకున్నాడని మహిళా నేత ఒకరు ఆరోపించారు. ఈ విషయమై బుధవారం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ స్థానానికి టికెట్ ఇప్పిస్తానని సదరు నాయకుడు తన వద్ద రూ.38 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అసెంబ్లీ టికెట్ చేజారగా, జెడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో కూడా ఎన్నికల ఖర్చు కోసం ఎన్నిసార్లు అడిగినా డబ్బు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు రూ.26లక్షలు ఇచ్చినా, మిగిలిన డబ్బు కోసం ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయని తెలిపారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయగా, వారం రోజుల్లో న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. -
అధికారం అందరిదీ...
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీద బడుగు బలహీన వర్గాల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని బ్యాక్ బోన్ క్లాస్ అని కొత్త అర్థాన్నిచ్చిన వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టే దిశగా అడుగులు వేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సీట్ల కేటాయింపులో బీద, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 అసెంబ్లీ సీట్లలో 41 సీట్లు బీసీలకు కట్టబెట్టి తాను వారి పక్షపాతినని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీ, మహిళలకు సముచిత స్థానం కల్పించారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మూడు సీట్లను బీసీలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం, రేపల్లె నుంచి మత్స్యకార సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, చిలకలూరిపేట నుంచి రజక సామాజికవర్గానికి చెందిన విడదల రజని బరిలో నిలుస్తున్నారు. మహిళలకు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో సముచిత స్థానం ఇచ్చింది. మహిళలకు మూడు సీట్లు కేటాయించగా, ఆ మూడు ఎస్సీ, బీసీ మహిళలకు ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లోనూ ముగ్గురు మహిళలకు సిట్లు ఇచ్చింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వైఎస్ జగన్‌కు ఉన్న గౌరవానికి నిదర్శనమని మహిళా సంఘాల నాయకులు అంటున్నారు. ఒక్క సీటూ కేటాయించని టీడీపీ.. ‘ఆడది ఇంట్లో ఉండాలి.. కారు షెడ్లో ఉండాలి’.. అంటూ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్, ‘కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా’ అంటూ సీఎం చంద్రబాబు మహిళను కించపరుస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుత అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల కేటాయింపులో కూడా టీడీపీ మహిళలపై వివక్ష చూపింది. జిల్లాలో ఇటీవల 14 సీట్లు కేటాయించిన సీఎం ఒక్క సీటు కూడా మహిళలకు ఇవ్వలేదు. గత ఎన్నికల్లో సైతం వారికి మొండిచేయి చూపారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. బీసీ సీటును లాక్కున్న లోకేష్.. ‘మాదీ బీసీల పార్టీ’అంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సీట్ల కేటాయింపులో బీసీల తీరని ద్రోహం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకూ 14 సీట్లు కేటాయించగా ఒక్క సీటు మాత్రమే చంద్రబాబు బీసీకి కేటాయించారు. మంగళగిరి నియోజకవర్గంలో గత ఏడాది బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఈ సారి ఆ సీటును చంద్రబాబు తన తనయుడు లోకేశ్‌కు కేటాయించి ద్రోహం చేయడంతో బీసీలు మండిపడుతున్నారు. మమ్మల్ని గుర్తించిన నేత జగన్ బీసీ కులాల్లో అట్టడుగు స్థానంలో ఉన్న వడ్డెర సామాజికవర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. మా సామాజికవర్గానికి చెందిన చంద్రగిరి ఏసురత్నానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించి రాజకీయ గుర్తింపునిచ్చారు. వడ్డెర మహిళను గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా ఎంపిక చేశారు. – వేముల శివ, వడ్డెర సంక్షేమసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళలంటే అంత అలుసా.. మహిళలంటే టీడీపీ ప్రభుత్వానికి అంత అలుసా. ఒక్క సీటూ కేటాయించలేదు. వివక్ష చూపుతూ మాది సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎలా ప్రచారం చేసుకుంటారు. బీసీలు, మహిళలలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి, పార్టీ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. టీడీపీకి బుద్ధి చెబుతాం. – బత్తుల మృదుల, మహిళ, బ్రాహ్మణపల్లి -
సమరానికి సై అంటున్న వైసీపీ..
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే గెలుపు గుర్రాలను వైఎస్సార్ సీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియర్లకు పెద్ద పీట వేస్తూనే.. కొత్త వారికి అవకాశం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ సమ న్యాయాన్ని పాటించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా సమన్వయకర్తలకే సీటు ఇవ్వడంతో అసమ్మతికి ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు.. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో సమరాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి విడుదల చేశారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ప్రకటించడంపై కార్యకర్తలు, నాయకుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. సిట్టింగ్‌లు, సీనియర్లకు ప్రాధాన్యం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు లభించాయి. గుడివాడ నుంచి కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), నూజివీడు నుంచి మేకాప్రతాప్ అప్పారావు, తిరువూరు నుంచి కె.రక్షణనిధి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ మంత్రి పార్థసారథి పెనమలూరు, మాజీ ప్రభుత్వ విప్‌లు సామినేని ఉదయభాను, పేర్ని శ్రీ వెంకటేశ్వరరావు(నాని)లు జగ్గయ్యపేట, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి ఎన్నికలో గోదాలో దిగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి, వెలంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జోగిరమేష్ పెడన నుంచి పోటీ చేస్తున్నారు. కొత్త ముఖాలు.. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి నలుగురు అభ్యర్థులు కొత్తగా రంగంలోకి దిగారు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావ్, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, పామర్రు నుంచి కైలే అనిల్‌కుమార్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బొప్పన భవకుమార్‌లు ఎన్నికల సమరంలో తమ సత్తా చూపేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. అలాగే గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారికి ఈసారి సీట్లు లభించాయి. నందిగామ నుంచి మొండితోక జగన్మోహనరావు, మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్‌లు మరోసారి పోటీ చేస్తున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాధాన్యాన్ని కల్పించింది. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు నాలుగేసీ సీట్లు కేటాయించగా, యాదవ వర్గానికి చెందిన పార్థసారథి, గౌడ వర్గానికి చెందిన జోగి రమేష్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణువర్థన్, వెలమవర్గానికి చెందిన మేకాప్రతాప్ అప్పారావు, వైశ్య వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌లకు సీట్లు కేటాయించి సమన్యాయం చేసిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతా అనుకున్నట్లే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీట్లు కేటాయించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి పార్టీ పదవులు లభిస్తాయనడానికి ఈ సీట్లు కేటాయింపే ఉదాహరణ అని పలువురు నాయకులు చర్చించుకోవడం కనిపించింది. నియోజకవర్గ సమన్వయకర్తలుగా బాధ్యతలు మోస్తున్న వారికందరికీ సీట్లు కేటాయించడంతో అసమ్మతికి అవకాశం లేకుండా పోయింది. విద్యావంతులు.. యువకులు పార్టీలో యువకులకు అనుభవం ఉన్నవారికి, చదువుకున్న వారికి ప్రాధాన్యత లభించింది. మొండితోక జగన్మోహనరావు వైద్యుడిగా నియోజకవర్గంలో అందనికి సుపరిచితుడే. ఇంజినీరింగ్ పూర్తిచేసిన పార్థసారథి ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఎంసీఏ చదివి విదేశీ ఉద్యోగావకాశాలను వదులుకుని ప్రజాసేవకు వచ్చిన కైలే అనిల్‌కుమార్, అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడినప్పటికీ సొంత గడ్డపై ప్రేమతో గన్నవరం వచ్చిన యార్లగడ్డ వెంకట్రావ్‌లను పార్టీ సముచితంగా గౌరవించి సీట్లు కేటాయించింది. సీనియర్లకు అందలం.. ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేయనుండగా.. మూడోసారి గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకాప్రతాప్ అప్పారావు ఐదోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు నూజీవీడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభానులు నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. -
టీడీపీలో వీడని సస్పెన్స్
సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు సీట్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ నాలుగు కూడా సిట్టింగ్‌లనే ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఉంగుటూరులో ఆదివారం తెలు గుదేశం పార్టీ ఎన్నికల సభ నిర్వహిస్తోంది. అయితే ఏర్పాట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే దగ్గరుండి చేస్తున్నారు. అర్ధరాత్రికి అయినా తన పేరు ఖరారు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ఉదయం ప్రకటించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయ నుంచి ఈ జాబితాను విడుదల చేస్తారు. శనివారమే జాబితా ఇవ్వాల్సి ఉన్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో జాబితా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎంపీఅభ్యర్థులను కూడా ఆదివారం ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో దాదాపుగా అందరు సిట్టింగ్‌లను ప్రకటించినా ఒక్క చింతలపూడిలో మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. పీతల సుజాతకు సీటు రాకుండా ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగా లాబీయింగ్ చేశారు. కేవలం కమ్మ సామాజికవర్గం పెత్తనాన్ని ఎదిరించినందుకే పీతల సుజాతకు సీటు లేకుండా చేశారని దళిత వర్గాలు మండిపడుతున్నాయి. ఆమెకు సీటు ఇవ్వకుండా అవమానించడంపై ఆమె సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చివరి వరకూ వేచి ఉండి ఎక్కడా సుజాతకు స్థానం కల్పించకపోతే పార్టీ నుంచి బయటకు రావాలని దళిత నేతలు భావిస్తున్నారు. నిడదవోలులో అన్నదమ్ములు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండని చంద్రబాబునాయుడు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకపోతే మూడో వ్యక్తికి సీటు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం. సొంత అన్న కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వ్యతిరేకిస్తుం డడంతో నిడదవోలులో రచ్చ కొనసాగుతోంది. నరసాపురంలో సీటు తమకే దక్కుతుందని కొత్తపల్లి సుబ్బారాయుడి వర్గం ధీమాగా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడి వర్గంలో ఆందోళన నెలకొంది. అయినా సీఎం తనకే హామీ ఇచ్చారన్న ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలవరంలో కూడా మొడియం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని అభ్యర్థులపై ఐవీఆర్ఎస్ సర్వేలో వారికి సానుకూలంగా రాకపోవడంతో సిట్టింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి జవహర్ తనకు కొవ్వూరులో సీటు రాకుండా అడ్డంపడ్డ నేతలపై విరుచుకుపడ్డారు. వారు ఎంత కుటిల రాజకీయాలు చేసినా తనకు సీటు రాకుండా అడ్డుకోలేకపోయారని, తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబునాయుడు తిరువూరు సీటు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాకపోవడంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతోంది. ఇంకో వైపు జనసేనలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే యర్రా నవీన్ బయటకు వెళ్లిపోగా తాజాగా ఏలూరులో జనసేన నేత సాగర్‌బాబు కూడా పార్టీని వీడి బయటకు వచ్చారు. జనసేన సిద్ధాంతాలకు భిన్నంగా నాలుగుపార్టీలు మారిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
టీడీపీలో సీటు.. మస్తు హీటు
సాక్షి , ఏలూరు : జిల్లాలో 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మిగిలిన నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. నరసాపురంలో మాధవనాయుడు, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులును తొలుత ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు కోసం ఆ సీట్లు ఆపడం వివాదంగా మారింది. పోలవరం, నిడదవోలులో అసమ్మతి తలనొప్పిలతో నిలిపివేశారు. నరసాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ముందు ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ తనకే వస్తుందని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మంత్రాంగం ఫలించిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మాధవనాయుడు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే సీటు ఖరారు అయ్యిందన్న భావనతో ప్రచారం మొదలుపెట్టిన మాధవనాయుడికి సీటు పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్ మొదలైంది. శుక్రవారం మాధవనాయుడు కుటుంబం అంతా ప్రచారంలో పాల్గొంది. ఉంగుటూరు సీటు గన్ని వీరాంజనేయులకే ఖరారు అయ్యిందని, అయితే బాపిరాజును బుజ్జగించేందుకు, ఈ సీటు ఇస్తారన్న ఆశ కల్పించేందుకు మొదటిలిస్ట్లో ఈ పేరు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సీటు ప్రకటించకపోవడంతో గన్ని వర్గం ఆందోళన చెందుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు సీటు ఇవ్వకపోవడంపై ఆ వర్గం మండిపడుతోంది. కష్టపడి పనిచేసిన పీతల సుజాతకు అన్యాయం జరిగిందంటూ ఏలూరు క్యాంప్ ఆఫీస్‌లో సుజాత వర్గం నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీటు ఆశించి భంగపడిన సొంగ రోషన్‌కుమార్ కూడా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రమే చంద్రబాబునాయుడు వారిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి చేశారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, తొందరపడవద్దని పీతల సుజాత నచ్చచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సీటు ఖరారు అయిన భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంజిబాబు గెలిచిన తర్వాత పార్టీ సీనియర్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని, మళ్లీ ఆయనకే సీటు ఇవ్వడంతో పలువురు పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు పీతల సుజాతకు సీటు రాకపోవడం వల్ల ఆ ప్రభావం భీమవరంపై పడే అవకాశం కనపడుతోంది. పీతలది వీరవాసరం మండలం కావడం, సుజాతను ఒక సామాజికవర్గం నేతలు కుల రాజకీయాలతో ఇబ్బంది పెట్టారన్న భావనతో ఇక్కడి దళితులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు సీటు వస్తుందన్న ఆశతో బీజేపీ నుంచి జనసేనలోకి చేరిన మొడియం శ్రీనివాస్ మళ్లీ తిరుగుటపాలో బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లపాటు భారతీయ జనతాపార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్‌గా పనిచేసిన మొడియం శ్రీనివాసరావు సీటు ఇస్తామన్న హామీతో జనసేనలో చేరారు. అయితే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు పెడతారంటూ డిమాండ్లు పెట్టడంతో వెనక్కి వచ్చేశారు. ఇప్పటికే జిల్లాలో జనసేనకు యర్రా నవీన్ రాజీనామా చేయగా పలువురు నేతలు జనసేనను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. -
ఎంతకీ...కొలిక్కిరాదే!
సాక్షి, తిరుపతి : జిల్లాలో టీడీపీ టికెట్ల పంచాయితీ సాగుతూనే ఉంది. చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లి, పూతలపట్టు, నగరి, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఇంకా ఖరారు చెయ్యలేదు. చిత్తూరు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, సత్యవేడులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అక్కడ వారి పరిస్థితి బాగా లేకపోవడంతో వేరొకరిని బరిలో దింపాలనేది చంద్రబాబు ఆలోచన. సిట్టింగ్‌లు కాకుండా మరి కొందరు టికెట్ ఆశిస్తున్న వారిపై చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనూ వారికీ అనుకూలంగా లేకపోవడంతో స్థానిక నాయకులను కొందరిని అమరావతికి పిలిపించుకున్నారు. జనంలో వ్యతిరేక ఉందని సర్వేలు చెబుతున్నది వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు అభిప్రాయాలు తీసుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా రోజూ ఒక్కో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలను రకరకాల ప్రశ్నలు వేస్తూ గెలుపోటములపై అంచనా వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను పొమ్మనలేకుండా పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. శ్రీకాళహస్తి విషయంలో మాత్రం బొజ్జల కుటుంబానికే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు ఖరారు చెయ్యకపోయినా.. ఎన్నికల ప్రచారం చేసుకోమని చెప్పినట్లు తెలిసింది. మిగిలిన వారికి మరోసారి అవకాశం లేదని అమరావతిలో తిష్టవేసి ఉన్న టీడీపీ శ్రేణులు తేల్చిచెబుతున్నాయి. కొత్త వారి కోసం అన్వేషణ జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధరనెల్లూరు అసెంబ్లీ స్థానాలకు కొత్త వారి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారికి సర్వేలో అనుకూలంగా లేకపోవడంతో వేరొకరికి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. పూతలపట్టు అసెంబ్లీకి లలితకుమారి ఈసారి లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారని, మరోసారి టికెట్ ఇచ్చి సాహసం చెయ్యలేని తేల్చిచెప్పినట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. దీంతో నాలుగేళ్ల క్రితం కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సునీల పేరును పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈమె గతంలో కాంగ్రెస్‌లో ఉంటూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి సన్నిహితురాలిగా ఉన్నట్లు తెలిసింది. పూతలపట్టు నుంచి ఈమె పేరును కొందరు ప్రతిపాదించడంతో సునీలను అమరావతికి పిలిపించినట్లు తెలిసింది. ఆమె శుక్ర, శనివారాల్లో సీఎం చంద్రబాబును కలిశారు. అదేవిధంగా మదనపల్లె నుంచి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, రాందాస్చౌదరికి సర్వేలు అనుకూలంగా లేవని తేలడంతో బీసీ మహిళకు ఇవ్వాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా బోడిపాటి మమత పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. నగరి నేతలు వారం రోజులుగా అక్కడే.. నగరి విషయానికి వస్తే గాలి సోదరులు ఇద్దరు తనకు టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అశోక్‌రాజు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారం రోజులుగా అమరావతిలోనే ఉన్నా ఎవరివైపు చంద్రబాబు మొగ్గుచూపకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ముగ్గురిని కాకుండా కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తంబళ్లపల్లె విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి వేరొకరిని బరిలోకి దింపేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. గంగాధరనెల్లూరు విషయానికి వస్తే గుమ్మడి కుతూహలమ్మ కుమారుడి పేరు దాదాపు ఖరారు చేశారని చెబుతున్నా నియోజక వర్గంలో పరిస్థితి బాగోలేకపోవడంతో సందిగ్ధంలో పడినట్లు తెలిసింది. ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న వారి పరిస్థితి బాగోలేకపోవడం.. కొత్త వారు దొరక్కపోవడంతో చంద్రబాబు ఈ రోజు రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్నారని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. -
టీడీపీలో రాజుకున్న టిక్కెట్ల లొల్లి
సాక్షి, అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీలో టిక్కెట్ల రగడ ముదురుతోంది. పలుచోట్ల తెలుగు తమ్ముళ్లు బల ప్రదర్శనలకు దిగుతున్నారు. తమ అసంతృప్తిని బహిరంగం వెళ్లగక్కుతున్నారు. వర్గాలుగా విడిపోయి వీధిపోరాటాలకు దిగుతున్నారు. కొందరు నేరుగా అధినేత చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారు. తాటికొండలో టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ‘జగ్గంపేట’పై పీఠముడి టీడీపీలో జగ్గంపేట సీటు వివాదం రాజుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతూ ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులు మంగళవారం చంద్రబాబును కలిశారు. అనారోగ్యం కారణంగా ఎంపీ స్థానానికి పోటీ చేయలేనని చంద్రబాబుకు నరసింహం తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్యకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. గతంలో జగ్గంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిశానని, ఇప్పటికి తమకు అక్కడ బలమైన కేడర్ ఉందని వివరించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో తమ కేడర్ ఇబ్బంది పడినా సర్దుకుపోయామని తెలిపారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇప్పటికే జగ్గంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట అభ్యర్థి ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. కొవ్వూరు టీడీపీలో కాక పశ్చిగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీలో వర్గ విభేధాలు తారాస్దాయికి చేరుకున్నాయి. మంత్రి జవహర్‌కు టిక్కెట్ కేటాయింపుపై టీడీపీ రెండు వర్గాలగా విడిపోయింది. జవహర్‌కు టిక్కెట్ ఇస్తే పనిచేసేది లేదని కొన్ని రోజుల క్రితం అధిష్టానానికి వ్యతిరేక వర్గం తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పోటీగా జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి ఆధ్వర్యంలో జవహర్ అనుకూల వర్గం వంద కార్లలో అమరావతికి బయలుదేరింది. జవహర్కే టిక్కెట్ కేటాయించాలంటూ చంద్రబాబును కలవనుంది. వర్గపోరుతో ఇప్పటికే కొవ్వూరులో రెండు టీడీపీ కార్యాలయాలుగా కొనసాగుతోంది. వెంకటపాలెంలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ శ్రావణ్‌కుమార్‌పై చెలరేగిన అసమ్మతి గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై సొంత పార్టీలోనే అసమ్మతి చెలరేగింది. వచ్చే ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టిక్కెట్ ఇవ్వొద్దని, తమ మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే మాయనను ఓడిస్తామని స్థానిక టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వెంకటపాలెంలో మంగళవారం శ్రావణ్‌కుమార్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. (ఆయనకు టికెట్ ఇవ్వొద్దు; అమరావతిలో ఉద్రిక్తత) టీటీడీ పదవి వద్దు వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే సీటు తన కుమారుడికి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పాలకొండ రాయుడు తన కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబును కలిశారు. తన కుమారుడికి టీటీడీ పాలక మండలి సభ్యుడి పదవి వద్దని అధినేతకు చెప్పారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పాలకొండ రాయుడు టెన్షన్‌గా ఉన్నారు. -
టికెట్ల వేటలో భంగపాటు
సాక్షి, వరంగల్: అసెంబ్లీ టికెట్ల వేటలో వివిధ పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు భంగపాటుకు గురయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అధ్యక్షుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వరంగల్ పశ్చిమ టికెట్ మహాకూటమిలో భాగంగా టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించారు. దీంతో ఇదే స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేష్ నిరాశకు గురయ్యారు. సామాజిక సమీకరణాల్లో బీజేపీ టికెట్ ధర్మారావుకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కూడా టికెట్ దక్కలేదు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యే పదవే లక్ష్యంగా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు, బరువులు మోస్తున్న వీరందరూ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన వీరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరు సమాలోచనల్లో పడిపోయారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వారు సమాలోచనలు చేస్తున్నారు. పొన్నాలతో పాటు ఆయన వర్గీయులకు ‘కూటమి’ పేరుతో పీసీసీలోని ఓ వర్గం ఝలక్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. అప్పుడు దొంతి... ఇప్పుడు నాయిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి పార్టీ టికెట్ దక్కకపోవడం ఇది రెండోసారి. 2004 ఎన్నికల సందర్భంగా అప్పడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి నర్సంపేట టికెట్ దక్కలేదు. కత్తి వెంకటస్వామికి టికెట్ ఇచ్చారు. దీంతో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ ఇస్తామని పీసీసీ నేతలు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. దీంతో నాయిని అనుచరులు మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సముదాయించే ప్రయత్నం చేసినా నిరసనను విరమించలేదు. నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నిరాశలో రావు పద్మ.. తెలంగాణలో 2004లో జరిగిన మొదటి ఎన్నికల్లో రావు పద్మారెడ్డి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమె వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా అర్బన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. 2019లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఎవరు వచ్చినా పశ్చిమ అభ్యర్థిగా పద్మారెడ్డికే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఆమె అదే అశతో పార్టీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోయారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో పశిచమను మాజీ ఎమ్మెల్యే ధర్మారావుకు కేటాయించడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు గురయ్యారు. టికెట్ ఇవ్వకుంటే బరిలో ఉంటానని రావు పద్మారెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈగ మల్లేషం, గన్నోజులకు లేనట్లే.. మహాకూటమి పొత్తుల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేషం వరంగల్ తూర్పు టికెట్, రూరల్ పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసచారి పరకాల టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి పశ్చిమ టికెట్ కేటాయించడంతో జిల్లా అధ్యక్షులైన ఈగ మల్లేషం, గన్నోజు శ్రీనివాసాచారిలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. -
పొత్తులు.. కత్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన కూటమిలో కలకలం మొదలైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అధినేతలకు తలనొప్పిగా మారింది. ఎంత బుజ్జగించినా, గెలిస్తే అందలమెక్కిస్తామన్నా.. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ససేమిరా అం టున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం మొదలుపెట్టిన వీరికి ఈ సర్దుబాటు వ్యవహారం మింగుడుపడడంలేదు. ఇంతదాకా వచ్చాక త్యాగాల పేరిట మాకు టికెట్ ఇవ్వకపోవడమేమిటని రుసరుసలాడుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కూటమి మాటెలాగున్నా టికెట్ల పర్వం ముగిస్తే చాలని అధినాయకులు అనుకుంటున్నారు లీకువీరులు! అసలుకన్నా కొసరు ఎక్కువ అన్నట్టు వార్‌రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ, చిలువలు పలువలు చేసి లీకులిచ్చేవాళ్లతో తలనొప్పి తప్పట్లేదు. ఇదిగో టికెట్..అదిగో కట్ అంటూ కొత్త కొత్త కథనాలల్లి ఆశావహులనుసందిగ్ధంలో పడేస్తున్నారు. కాంగ్రెస్ తాజాగా సీట్లు ఖరారు చేసినట్లు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు పట్టుకుంది. ప్రధానంగా మన జిల్లాలో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో అత్యధికంగా ఆ పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. అయితే, కూటమి పుణ్యామా అని ఈ సారి ఆ సీట్లు దక్కవేమోనన్న బెంగ ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎల్బీనగర్ సీటుపై కన్నేసిన ఆశావహుడు సామ రంగారెడ్డి ఇటీవల అమరావతికి వెళ్లి అధినేత బాబును కలిసి విషయం వివరించడంతోపాటు కాంగ్రెస్‌తో పొత్తు సిట్టింగ్ సీట్లకే ఎసరుతెస్తోందని వివరించారు. అయినా, చంద్రబాబు తనదైన శైలిలో త్యాగం చేయకతప్పదు అన్నట్లు తెలుస్తోంది. కొండంత ఉత్సాహంతో వెళ్లిన రంగారెడ్డి నిరుత్సాహంతో వెనుదిరగక తప్పలేదు. అంతకంతకూ అసహనం పెరగడంతోపాటు కార్యకర్తల ఒత్తిడి ఎక్కువ కావడంతో నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు. గాంధీభవన్‌కు తాకిన సెగ! టీడీపీతో సయోధ్య కాంగ్రెస్‌లోనూ ముసలం పుట్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా నాలుగు సీట్లను ఆ పార్టీకి కేటాయించనున్నారనే ప్రచారం హస్తం ఆశావహులను కలవరపరుస్తోంది. మహాకూటమి పురుడు పోసుకున్న మొదటి రోజే గత ఎన్నికల్లో ఉప్పల్ అభ్యర్థిగా బరిలో దిగిన బండారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరగా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత మందిని పక్కచూపులు చూసేలా చేస్తున్నాయి. ఉప్పల్, కూకట్పల్లి స్థానాలను దాదాపుగా టీడీపీకి కేటాయించినట్లు కాంగ్రెస్ సంకేతాలిస్తోంది. ఇవిగాకుండా పరిశీలనలో శేరిలింగంపల్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం, సీమాంధ్ర ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈ సీటును ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. దీంతో ఈ స్థానం కూడా దాదాపుగా ‘దేశం’ కోటాలో చేరే అవకాశం దాదాపుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అవాక్కయిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మూడు రోజుల క్రితం గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు. ఆయన మద్దతుదారు ఒకరు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను హస్తినకు పిలిపించి మాట్లాడింది. మరోవైపు టీజేఎస్‌తో పొత్తు కూడా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. మల్కాజిగిరి స్థానాన్ని సర్దుబాటులో భాగంగా టీజేఎస్‌కు వదలాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయగా.. సీట్ల పంపిణీ అనంతరం కూటమి పక్షాల్లో కీచులాటలు మరింత రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. రాజేంద్రనగర్ సెగ్మెంట్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాంగ్రెస్ తరఫున ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి కాకుండా.. పొత్తులో టీడీపీ కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి సంపూర్ణ సహకారం అందడం కష్టంగానే కనిపిస్తోంది. -
తుది అంకం
తొలిజాబితాలో వీరికి.. శనివారం విడుదల చేసే తొలి జాబితాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, రేవంత్‌రెడ్డి (కొడంగల్), తాజా మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి (పరిగి), వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి (ఎల్బీనగర్), ప్రతాపరెడ్డి (షాద్‌నగర్), కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్) పేర్లు ఉండే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, బహుళ పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, మేడ్చల్, చేవెళ్ల నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కాగా, టీడీపీ అడుగుతున్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్ సహా టీజేఎస్ ప్రతిపాదిస్తున్న మల్కాజిగిరిని పక్కనపెట్టినట్లు సమాచారం. వికారాబాద్ సెగ్మెంట్ విషయంలో సోనియా నేతృత్వంలోని సీఈసీ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగినట్లు తెలిసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కూర్పు తుది అంకానికి చేరింది. ఈ నెల పదో తేదీన తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించిన ఆ పార్టీ.. పోటీ తీవ్రంగా నెలకొన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా జాబితా వడపోతపై కసరత్తు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. గెలుపుగుర్రాల ఎంపికలో సామాజిక సమీకరణలు, సమర్థతను పరిగణనలోకి తీసుకుంటోంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లోని ఆశావహులను ఢిల్లీకి పిలిపించి బుజ్జగింపులు చేస్తోంది. కాగా, ఒకరే ఆశిస్తున్న నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో మహేశ్వరం, కల్వకుర్తి, కొడంగల్, పరిగి, ఎల్బీనగర్, షాద్‌నగర్ స్థానాలున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల జాబితా వెల్లడిలో జరుగుతున్న జాప్యంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. బుజ్జగింపులతో దారికి.. ఇద్దరు, ముగ్గురు పొటీపడుతున్న నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరగకుండా ఏఐసీసీ జాగ్రత్తపడింది. ఇలా పోటీ తీవ్రంగా ఉన్న సెగ్మెంట్ల ఆశావహులతో సంప్రదింపులు జరిపింది. ప్రత్యర్థుల బలాబలాలు, సామాజికవర్గాల సమతుల్యతల కారణంగా టికెట్ దక్కకపోయినా.. కలిసికట్టుగా పనిచేయాలని మార్గనిర్దేశం చేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్/ఎమ్మెల్సీ తదితర పదవులతో సముచిత గౌరవం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. అసమ్మతి చల్లారినట్లేనని భావించిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన స్క్రీనింగ్ కమిటీ.. ఇంకా వివాదాస్పదంగా ఉన్నట్లు గుర్తించిన వాటిని మాత్రం పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఇబ్రహీంపట్నం, తాండూరు, మేడ్చల్, రాజేంద్రనగర్, వికారాబాద్ నియోజకవర్గాల నేతలతో హైకమాండ్ మాట్లాడింది. కొన్ని స్థానాల నుంచి ఒకరికే ఆహ్వానం పలకడం.. మరికొన్ని చోట్ల ఇద్దరిని పిలిపించి మాట్లాడడంతో టికెట్ ఎవరికిస్తున్నారో.. ఎవరిని బుజ్జగిస్తున్నారో ఆర్థం కావడం లేదు. సబిత డుమ్మా.. చంద్రశేఖర్ హాజరు అభ్యర్థుల ఖరారులో ప్రతిష్టంభన తొలగించేందుకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, చంద్రశేఖర్‌ను హస్తినకు రావాలని స్క్రీనింగ్ కమిటీ వర్తమానం పంపింది. ఈ మేరకు చంద్రశేఖర్ కమిటీ ఎదుట హాజరై వికారాబాద్ స్థానంపై తన వాదన వినిపించారు. ఈ స్థానాన్ని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ కూడా ఆశిస్తుండగా.. చేవెళ్ల సీటును స్క్రీనింగ్ కమిటీ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, సబిత మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మహేశ్వరంతోపాటు తన కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ సీటును ఆశిస్తున్నారు. అయితే, కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన ఉన్నందున ఈ అంశంపై ఆమెతో మాట్లాడాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నం టికెట్ రేసులో ఉన్న మల్రెడ్డి బ్రదర్స్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డితో కూడా స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా.. సమన్వయంతో పనిచేయాలని, టికెట్ దక్కనివారికి భవిష్యత్తులో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే, మేడ్చల్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ గూటికి చేరిన తోటకూర జంగయ్యయాదవ్తో ఒకేసారి మాట్లాడి.. దిశానిర్దేశం చేసింది. రాజేంద్రనగర్‌పై కన్నేసిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌తో కూడా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చర్చించారు. తాండూరు సీటుకు పోటీపడుతున్న పైలెట్ రోహిత్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలకు హితోపదేశం చేసిన కమిటీ.. ఎవరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించింది. -
టికెట్ ఎవరికి ఇద్దాం..
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వికారాబాద్ టికెట్ అంశం తేలుద్దామనే ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఎట్టకేలకు కసరత్తును ముమ్మరం చేసింది. మంత్రి కేటీఆర్.. జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కొండల్‌రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలవారీగా పార్టీ నేతలతో అభిప్రాయ సేకరణ జరిపారు. దీపావళినాడు నగరంలోని ప్రగతి భవన్‌కు ముఖ్య నేతలను పిలిపించి కేటీఆర్ మాట్లాడారు. టికెట్‌ను ఎవరికి ఇద్దాం.. ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి. మీరే చెప్పండి.. గెలిపిం చాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ ఆయన నేతలతో అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు అనారోగ్య కారణాలతో టికెట్‌ను ఇవ్వలేకపోతున్నామని, బదులుగా ఎవరైతే బాగుంటుందో తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ అసెంబ్లీ నుంచి బరిలో దిగే అభ్యర్థి తప్పకుండా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారు. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలోని వికారాబాద్, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట్ మండలాలకు చెందిన గులాబీ ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రగతిభవన్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 15 మందికి పైగా నేతలు టికెట్ ఆశిస్తుండగా ఇందులో ఎవరైతే బాగుంటుంది.. విజయం సాధించగలరని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు, స్థానిక వైద్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్, చిన్నపిల్లల వైడ్య నిపుణుడు టి.ఆనంద్, ఉద్యమకారులు రామేశ్వర్, వడ్ల నందు, భూమనోళ్ల కృష్ణయ్య తదితరుల పేర్లను ఆయా మండలాలకు చెందిన నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందనే అంశపైనా కేటీఆర్ వాకబు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్ మెతుకు ఆనంద్ భార్యకు టికెట్ కేటాయించే విషయాన్ని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రకటించిన మూడు స్థానాలను కూడా టీఆర్ఎస్ పురుషులకు కేటాయించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో కనీసం ఒక్క సీటునైనా మహిళకు ఇస్తే ప్రజల్లోకి మంచి సంకేతం వెళ్తుందనే విషయాన్ని కూడా పార్టీ సీరియస్‌గానే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ ఏ. చంద్రశేఖర్ పేరును కూడా కొందరు నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు అభిగ్నవర్గాల సమాచారం. అయితే, విద్యావంతుడు, న్యాయవాది పత్తి ప్రవీణ్‌కుమార్ తదితరులు సైతం వికారాబాద్ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆశావహులు టికెట్ దక్కిం చుకునేందుకు తమకు తోచిన మార్గం లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల అభిప్రాయాలను ఓపికగా విన్న కేటీఆర్.. టికెట్ ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని, టికెట్ రానివారు అసంతృప్తి చెందవద్దని ఆయన హితబోధ చేసినట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లో వికారాబాద్ టికెట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన సమావేశం చివరలో వెల్లడించినట్లు పార్టీ నేత ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. టికెట్ ఎవరిని వరిస్తుందే వేచి చూడాల్సిందే. -
గజిబిజి.. గందరగోళం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సీట్ల పంపకాలు.. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ సాచివేత ధోరణి మిత్రపక్షాలను డోలాయమానంలో పడేస్తోంది. నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్నా సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో టీడీపీ, టీజేఎస్ పార్టీల్లో సస్పెన్స్ నెలకొంది. సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతునప్పటికీ, ఏయే స్థానాలు కేటాయించారనేది తేలకపోవడంతో మహాకూటమిలో గందరగోళం నెలకొంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలను గురువారం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించినా.. ఇందులో మన జిల్లాలో ఆ పార్టీలకు ఇచ్చే సీట్లు ఏవీ అనేది ప్రకటించలేదు. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన నెలకొంది. దీనికితోడు భాగస్వామ్య పక్షాలకే కేటాయించేస్థానాలపైనా ఉత్కంఠ కొనసాగిస్తోంది. దీంతో మొత్తంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. రోజుకో మాట.. గురువారం లోపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మొదట ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా మరో రెండు రోజుల గడువు తీసుకుంది. శనివారం నాడు తొలి జాబితాను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆ పార్టీ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేపింది. ఇదిలావుండగా, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాతోపాటు మహాకూటమి అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారనే ప్రచారంతో ఎవరెవరికి ఏ సీటు కేటాయిస్తారో తేలిపోతుందని అంతా భావించారు. కానీ, అభ్యర్థుల వడపోతలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యం మిత్రపక్షాలను కలవరపరుస్తోంది. దీనికితోడు పొత్తులపై జరుగుతున్న రోజుకో ప్రచారం.. ఎవరి సీటుకు ఎసరు తెస్తుందోననే ఆందోళన కలుగుతోంది. టీడీపీకి ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ఇవ్వనున్నట్లు ఇరుపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిపై అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప స్పష్టత రాదు. అయితే, ఆ లోపు ఈ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరగడమేగాకుండా సీటు దక్కకపోతే అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు. ఒకవేళ వీటిని టీడీపీకి కేటాయించాలని భావిస్తే ముందుగానే ఆశావహులను బుజ్జగించడం ద్వారా నష్టనివారణ చర్యలకు దిగే ఆస్కారముంది. కానీ, ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారు క్రతువు మొదలు పెట్టకపోవడం.. మిత్రపక్షాలకిచ్చే సీట్లను ప్రకటించకపోవడంతో గందరగోళం తలెత్తింది. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ స్థానంపై కూడా అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే కుటుంబానికి ఒక టికెట్టు అంక్ష ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి ప్రతిబంధకంగా మారగా.. తాజాగా టీడీపీ జాబితాలో ఈ స్థానం కూడా ఉందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. -
కమలంలో టికెట్ల కల్లోలం
-
నిజామాబాద్ అర్బన్ బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి
-
బీజేపీలో చెలరేగిన అసమ్మతి
హైదరాబాద్: బీజేపీలో ఎప్పుడూ లేని కొత్తగా అసమ్మతి చెలరేగింది. రెండో విడతలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ కొందరు నాయకులు అదిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగపల్లి టిక్కెట్ ఆశించిన డాక్టర్ నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తమకు టిక్కెట్ దక్కక పోవడంతో నిరసనకు దిగారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాళ్ల వర్గీయులైతే ఏకంగా కార్యాలయం బిల్డింగ్ పైకెక్కి దూకుతామని హెచ్చరించారు. శేరిలింగం పల్లి బీజేపీ అభ్యర్థిగా యోగానంద్ పేరు అదిష్టానం ఖరారు చేయడంతో, టిక్కెట్లను అమ్ముకున్నారంటూ నరేష్ వర్గీయులులు నినాదాలు చేశారు. శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ దిష్టిబొమ్మను నరేష్ వర్గీయులు దగ్ధం చేశారు. మరో వైపు నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంతో ధన్పాల్ సూర్యనారయణ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఏకంగా బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని ధన్పాల్వర్గం చెబుతోంది. బీజేపీ రెండో జాబితాలో మొత్తం 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో ఏడుగురు రెడ్లకు, ముగ్గురు వెలమలకు, ఒక వైశ్య, ఆరుగురు బీసీలకు, 5 ఎస్టీ, 3 ఎస్సీ, 2 మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించారు. బీజేపీ మొదటి విడతలో 38, రెండో విడతలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా..మిగతా 53 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది. -
105..ఇదే ఫైనల్
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల వ్యూహంలో తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతోంది. అసెంబ్లీ రద్దు రోజునే 90 శాతం సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్... ఆ జాబితాలో మార్పులు ఉండవని స్పష్టం చేస్తోంది. ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా గెలుపు కోసం అవసరమైన ప్రచార సామగ్రిని సైతం అభ్యర్థులకు పంపించింది. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేలోపే నియోజకవర్గాల్లో ఒక దశ ప్రచారం పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం నియోజకవర్గాలవారీగా అవసరమైన ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసి అభ్యర్థులకు తెలియజేస్తోంది. అభ్యర్థుల ప్రచార సరళిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ నివేదికలను తెప్పించుకొని అవసరమైన సూచనలు చేస్తున్నారు. అభ్యర్థులతోనూ స్వయంగా ఫోన్లలో మాట్లాడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఏ అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉందో చెబుతూ అందుకు అనుగుణంగా ప్రచార సరళి ఉండాలని సూచిస్తున్నారు. ప్రచార సామగ్రి పంపిణీ పూర్తి కావడం, నియోజకవర్గాలవారీగా ప్రచార సరళిపై సమీక్షల నేపథ్యంలో అభ్యర్థుల మార్పు ఉండబోదని స్పష్టమవుతోంది. మరోవైపు అసమ్మతి, అసంతృప్త నేతలను దారికి తెచ్చే విషయంలోనూ ముందుగానే సర్దుబాటు చేస్తోంది. ముందస్తు ప్రకటనతో... గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కాక ముందే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో అప్పటి పరిస్థితులను బట్టి అభ్యర్థుల్లో మార్పు ఉంటుందని పలువురు ఆశావహులు భావించారు. చివరి నిమిషంలో అవకాశం వస్తుందనే ఉద్దేశంతో సొంతంగా ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. మరికొందరు ప్రస్తుత అభ్యర్థులను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ముందస్తు ఎన్నికల కోసం అసెంబ్లీని రద్దు చేస్తూ ఈ నెల 6న మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోవడం, అమోదం పొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. రాజకీయ వర్గాలు, టీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు ఒకేసారి 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్లోని 90 మంది తాజా మాజీ ఎమ్మెల్యేల్లో 83 మందికి టికెట్ కేటాయించారు. నల్లాల ఓదెలు (చెన్నూరు), బాబూమోహన్ (అంథోల్)లకు అభ్యర్థిత్వాలను నిరాకరించారు. కొండా సురేఖ (వరంగల్ తూర్పు), ఎం. సుధీర్‌రెడ్డి(మేడ్చల్), సి. కనకారెడ్డి (మల్కాజ్గిరి), బొడిగె శోభ (చొప్పదండి), బి. సంజీవరావు (వికారాబాద్) టికెట్లను పెండింగ్‌లో పెట్టారు. అయితే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారనే చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాల్లో గతంలో టికెట్ హామీ పొందిన వారికి అవకాశం ఇవ్వలేదని, ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మార్పులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తులు కార్యక్రమాలు మొదలుపెట్టారు. అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లో నిత్యం ఇవే జరుగుతున్నాయి. భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘన్పూర్, జనగామ, మహబూబాబాద్, వేములవాడ, రామగుండం, మంచిర్యాల, నల్లగొండ, మునుగోడు, ఆలేరు, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, మక్తల్, పటాన్చెరు, నారాయణఖేడ్, వైరా, సత్తుపల్లి, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఉప్పల్ నియోజకవర్గాల టికెట్లు తమకే ఇవ్వాలని కొందరు, ఆయా చోట్ల అభ్యర్థులను మార్చాలని మరికొందరు ప్రతిరోజూ నిరసనలు చేపడుతున్నారు. ఇన్నాళ్లూ అయోమయంలో ఉన్న పార్టీ శ్రేణులు సైతం అభ్యర్థల ప్రచారంపర్వంలో పాల్గొంటున్నారు. అసమ్మతి నేతలు మాత్రం ఆఖరి నిమిషం వరకు అవకాశాల కోసం వేచి చూస్తూ సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు వ్యూహం... 2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బంగారు తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ నినాదంతో రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, సీపీఐలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు... ఇలా అన్ని స్థాయిల్లోని వారు టీఆర్ఎస్లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలోపేతమైంది. అయితే క్షేత్రస్థాయిలో గ్రూపులకు అస్కారం ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉండే సహాజ వ్యతిరేకతతో తమకు అవకాశాలు వస్తాయని చాలా మంది భావించారు. సీఎం కేసీఆర్ గతంలో చెప్పిన ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మినహా అందరికీ అవకాశం ఇచ్చారు. అవకాశం దక్కని వారూ ఎక్కువగానే ఉండటంతో అసమ్మతి, అసంతృప్తి పెరిగాయి. ఆశావహులు ఎక్కువగా ఉండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని, గెలుపు అవకాశాలు ఉన్నందునే పార్టీ టికెట్ కోసం పోటీ పెరిగిందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపే అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతులు, అసంతృప్తులను లేకుండా చేయాలని నిర్ణయించింది. టీఆర్ఎస్ కీలక నేత కె. తారక రామారావు ఈ బాధ్యతలను చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి, అసంతృప్తి నేతలతో చర్చలు జరిపే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలవారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, టికెట్లు ఆశించిన భంగపడిన వారిని, ద్వితీయ శ్రేణి నేతలను హైదరాబాద్ పిలిచి మాట్లాడుతున్నారు. గతంలో టికెట్ హామీతో పార్టీలో చేరిన వారికి అభ్యర్థుల మార్పు ఉండబోదని, భవిష్యత్తులో ఎమ్మెల్సీ వంటి ఇతర కీలక పదవులు ఇస్తామని చెబుతున్నారు. నియోజవర్గాలవారీగా అసంతృప్తితో ఉన్న ద్వితీయశ్రేణి నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల మార్పు ఉండబోదని, అందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని స్పష్టం చేçస్తున్నారు. అభ్యర్థుల ప్రచార సరళిని అడిగి తెలుసుకుంటున్నారు. మార్పులు ఉండబోవనే స్పష్టత రావడంతో పలువురు అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచార ప్రక్రియను పెంచారు. నియోజకవార్గాలవ్యాప్తంగా ప్రచార ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల వారీగా నేతలతో భేటీలు జరుపుతున్నారు. జలగంకు సీఎం కేసీఆర్ ఫోన్ కొత్తగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుకు సీఎం కేసీఆర్ శనివారం ఫోన్ చేశారు. ఎన్నికల ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఎలా ఉందని అడిగారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య పరిస్థితులను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. -
కాంగ్రెస్ సీనియర్లకు ‘వయసు’ గుబులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ‘వయసు’ గుబులు పట్టుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదని, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని ఇటీవల జరిగిన ప్లీనరీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంతో తమకు సీట్లు వస్తాయా రావా అనే సందేహం వారిని వేధిస్తోంది. రాహుల్ చెప్పినట్టు చేస్తే రాష్ట్రం నుంచి ఐదారుగురు ముఖ్య నేతల టికెట్లు గల్లంతయ్యే అవకాశముందన్న చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల టికెట్లు సైతం గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సీనియర్ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. వీరందరి వయసు 70 కన్నా ఎక్కువ ఉండటంతో ఈసారి వీరికి టికెట్లు రావన్న చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. లోలోన గుబులుగానే ఉన్నా తమకు టికెట్ కచ్చితంగా వస్తుందని వారు పేర్కొంటున్నా రు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆశతో ఉన్న జానారెడ్డి.. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ తెచ్చుకుంటానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఈసారి తన గెలుపు కచ్చితమన్న అంచనాతో ఉన్నారు. గీతారెడ్డి తన కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా.. ఈసారికి తానే పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక జైపాల్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని మాజీ మంత్రి డీకే అరుణ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటం సీనియర్లకు తలనొప్పిగా మారింది. జైపాల్‌కు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన మాత్రం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మర్రిÔ¶ శశిధర్‌రెడ్డి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌గా క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టికెట్‌పై ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని కొందరు యువనేతలు ప్రచారం చేస్తున్నట్టు వీరి ఆశలు నిరాశలవుతాయా? లేదా రాహుల్ ప్రత్యేక నిర్ణయం తీసుకుని వీరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే! వారసులొస్తారా? వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేసే అవకాశం లేదని పార్టీ కచ్చితంగా నిర్ణయిస్తే ఆయా నేతల వారసులకు లైన్‌క్లియర్ అవుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో జైపాల్‌రెడ్డికి రాజకీయంగా వారసులు లేకపోయినా జానా కుమారుడు రఘువీర్‌రెడ్డి, పొన్నాల కోడలు వైశాలి, శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి లాంటి యువ నాయకత్వం ఈసారి బరిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాహల్ మదిలో ఏముంది? వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ సీనియర్ల హవానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద వయసున్న నేతలే అటు పార్టీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కనిపిస్తుంటారు. అయితే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం మొదలు పార్టీలో సీనియర్లు, జూనియర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆయన తనదైన ఆలోచనతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ‘‘20–40 ఏళ్ల వయసున్న వారిని వర్కింగ్ యూత్‌గా, 40–60 వరకు సీనియర్ యూత్‌గా, 60–70 సలహా సంఘంగా, 70 కన్నా ఎక్కువ వయసున్న వారిని పూర్తిగా పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 60–70 ఏళ్ల వయసున్న వారికి టికెట్లు ఇచ్చే విషయంలో కొంత రిజర్వ్డ్గానే ఉండాలని ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ప్లీనరీలో ప్రకటించారు’’ అని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ సీనియర్ నేతలకు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన నాయకులకు టికెట్లు ఇవ్వబోమని పార్టీలో ఎక్కడా చెప్పలేదంటూనే.. ఈసారి యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ చెప్పినట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. -
సీఎం రమేష్‌పై తెలుగుతమ్ముళ్ల ఫైర్
సాక్షి ప్రతినిధి,కడప: రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్నాయుడుపై తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయత, కష్టపడ్డనేతలకు గుర్తింపు ఇవ్వకుండా డబ్బే అర్హతగా పార్టీ టికెట్లు కేటాయిస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మర్యాద, గౌరవాన్ని నిలిపిన ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ నిరాకరణపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. సీఎం రమేష్ పోట్లదుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చేరువయ్యారు. కాలక్రమేణ ఆయన కోటరీలో ఒక్కరిగా చేరిపోయారు. వైఎస్సార్ జిల్లాలో గ్రామస్థాయికి పరిమితమైన సీఎం రమేష్ ఒక్కమారుగా టీడీపీలో ప్రముఖవ్యక్తిగా మారారు. ఈపరిణామాన్ని ఇతర జిల్లా వాసు లు జీర్ణించుకున్నా, వైఎస్సార్ జిల్లా వాసులకు అంతగా రుచించడం లేదు. ఫ్యాక్షన్‌కు ఎదురొడ్డి కుటుంబాలను త్యాగం చేసుకుని, ఆస్తులను కర్పూరంలా కరిగించుకుని పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పయనిస్తున్న నాయకులకంటే పైరవీకారులకే విలువ ఉండటంపై పలువురు తీవ్రం గా తప్పుబడుతున్నారు. ఆ కోవలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ రెండాకులు ఎక్కుగానే ఉన్నారని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నా రు. సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసిన కారణంగా జిల్లాలో నలుగురు టీడీపీ టికెట్లు కోల్పోయిన ట్లు ఆపార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైరవీకారులకే ప్రాధ్యాన్యత ఇస్తుండటంపై పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి చెక్..... పార్టీలు ఏవైనా ఒకప్పుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడిచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రూపు, కందుల ఓబులరెడ్డి గ్రూపులు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవి. 2004 ఎన్నికల వరకూ అదే ప్రామాణికంగా నేతలు వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపికయ్యాక పార్టీలు, గ్రూపులు కనుమరుగయ్యాయి. పాతతరం గ్రూపులు, వర్గాలు అభివృద్ధి, సంక్షేమం ముందు బలాదూర్ అయ్యాయి. ఈపరిస్థితుల్లో జిల్లా వాసి సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఆయన నేతృత్వంలో పార్టీ వ్యవహారాలు అధికమయ్యాయి. మూడు దశాబ్ధాలుగా వర్గ రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కొంత అంటీముట్టనట్లు వ్యవహరించారు. సీఎం రమే ష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే తాము వెళ్లా లా.. ఆయన మాకు జాతీయనేతనా.. అంటూ పలు సందర్భాలలో వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. అలాంటి భావనతోనే ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ మంత్రి బ్రహ్మయ్య, కందుల రాజమోహన్రెడ్డిలాంటి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకున్న సీఎం రమేష్ ఒకరి తర్వాత మరొకరికి చెక్ పెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు వద్ద మెప్పుకోసం పార్టీ నేతలపై వ్యతిరేకత, డ బ్బు కారణాలుగా చూపుతూ టీడీపీకి దూరం చేస్తూ వస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విధంగానే మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుకు టికెట్ రానీయకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి దక్కేలా చేశారని ఆపార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. కందుల రాజమోహన్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కడప పార్లమెంటుకు నాన్‌లోకల్ అయినా శ్రీనివాసులరెడ్డికి దక్కేలా చేశారని, మాజీ మంత్రి బ్రహ్మయ్యను కాదని డబ్బున్న మేడా మల్లికార్జునరెడ్డిని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏకైక ఎమ్మెల్యే లింగారెడ్డికి సైతం డబ్బే కారణంగా చూపెట్టి టికెట్ రానీయకుండా చేసి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించేలా వ్యవహరించారు. లింగారెడ్డికి తీవ్ర పరాభవం.... రెండున్నర దశాబ్ధాలుగా ప్రజాజీవితంలో ఉంటూ పోరాటం చేసిన లింగారెడ్డి 2009లో టీడీపీ టికెట్ ద్వారా తనజీవితాశయమైన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ ప్రత్యర్థి వరదరాజులరెడ్డిని 16వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. లింగారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారపార్టీ ముసుగులో వరదరాజులరెడ్డి అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చారు. నెలరోజుల క్రితం వరదరాజులరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు దశాబ్ధాలుగా పార్టీనే ప్రాణప్రదంగా భావించిన లింగారెడ్డిని తప్పించి వరదకు అండగా నిలిచారు. ఈవైనాన్ని లింగారెడ్డి అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. శుక్రవారం తెలుగుదేశపార్టీ జెండాలు, బ్యానర్లకు నిప్పుపెట్టారు. అధినేత చంద్రబాబు, సీఎం రమేష్‌పై శాపనార్థాలు పెట్టారు. గ్రామ స్థాయి నేత రమేష్‌కు రాజ్యసభ కేటాయించడంలో, వరదరాజులరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వెనుక డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని వాపోతున్నారు.