
తెలుగు కాంగ్రెస్‌కు సైకిల్ సీటు !
- టీడీపీలో సగం అసెంబ్లీ టికెట్లు వలసనేతలకే
- 14 సెగ్మెంట్లలో ఇప్పటికే 4చోట్ల అభ్యర్థిత్వాలు,మరొకటి బీజేపీకి,
- ఇంకో మూడింటిలో రెండు వలసవచ్చేవారికే ?
- జిల్లాలో పార్టీ దుర్గతిపై టీడీపీ నేతల ఆవేదన
సాక్షి, తిరుపతి: ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభయహస్తమిచ్చారు. పదేళ్లుగా అధికారం కోల్పోయి తుప్పుపట్టిన సైకిల్‌పై వారిని ఎక్కించుకుంటున్నారు. సొంత జిల్లాలో సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారు.
చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకిపట్టిన దుర్గతి ఇదీ. జిల్లాలో పూర్తిగా బలహీనపడిన టీడీపీకి వలస నేతలు లేకపోతే ఈ ఎన్నికల్లో అన్ని చోట్ల అభ్యర్థులను పెట్టుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇప్పటికి రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించగా తొలి విడత పార్టీలో సీనియర్లు, సిట్టింగ్‌లకు ప్రాధాన్యమిచ్చారు. రెండో విడత శుక్రవారం అర్ధరాత్రి ప్రకటిం చిన ఐదుగురిలో నలుగురు కాంగ్రెస్ నుంచి వలస వచ్చినవారే. వీరు చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి, చిత్తూరు నుంచి డీకే సత్యప్రభ, గంగాధరనెల్లూరు నుంచి గుమ్మడి కుతూహలమ్మ, తంబళ్లపల్లె నుంచి శంకరయాదవ్.
రెండో జాబితాలో వలస నేతలకే ప్రాధాన్యమిచ్చినట్టయ్యింది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మదనపల్లె స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించారు. మిగిలిన 13 స్థానాల్లో తొమ్మిదింటికి అభ్యర్థులను ప్రకటించగా, వారిలో నలుగురు వలస నేతలు. మరో నాలుగింటిలో సత్యవేడు, తిరుపతి సెగ్మెంట్లకు కూడా వలసనేతలే దిక్కుకానున్నారు. పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల కోసం కాగడా వేసి వెతుకుతున్నారు.
పీలేరు నుంచి ముస్లిం మైనారిటీల అభ్యర్థిని నిలిపేందుకు చంద్రబాబు మొగ్గుచూపుతున్నారు. పుంగనూరులో ఎన్ అనూషరెడ్డి పేరు పరిశీలనలో ఉంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు టికెట్లు ఇస్తున్న తీరును చూసి నిర్ఘాంతపోతున్నారు. టీడీపీ ఆవిర్భావం తరువాత ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఎన్నికల సమయంలో కొందరు అసంతృప్తులు పార్టీలు మారడం, వేరే పార్టీ నుంచి పోటీ చేయడం సర్వసాధారణమైతే, ఇంతమందికి ఒక్కసారిగా సీట్లు ఇవ్వడమనేది ఇదే మొదటిసారిగా ఆయన పేర్కొన్నారు. అధినేత సొంత జిల్లాలో పార్టీకి పట్టిన గతి ఆవేదనకు గురిచేస్తోందని ఆయన అన్నారు.
కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించక కేడర్‌లో నైరాశ్యం
కిందటి సాధారణ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో టీడీపీ విజయం సాధించింది. పరాజయం పాలైన నియోజకవర్గాల్లో సమర్థవంతమైన కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో చంద్ర బాబు పూర్తిగా విఫలమయ్యారు. జిల్లాలో మూడు ముఠాలు.. ఆరు వర్గాలుగా తయారైన పార్టీకి కాయకల్ప చికిత్స చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించినప్పటికీ... మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు పట్టించుకోలేదు. ఫలితంగా ఎన్నికల సమయంలో వలస నేతలపై ఆధారపడాల్సి వచ్చింది. చంద్రగిరి, చిత్తూరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు, తిరుపతి నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.
ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిలను నియమించడంలో చంద్రబాబు తన మార్కు జాప్యాన్ని ప్రదర్శించారు. పలమనేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందినప్పటికీ ఏడాది కిందట అక్కడ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గాల్లోనూ కేడర్‌ను ఉత్సాహపరిచే నాయకులను తయారుచేయకపోవడం ఆ పార్టీకి శాపంగా మారింది. ఇన్‌చార్జిల నియామకం పేరుతో పలు దఫాలు ఆశావహులను రాజధానికి పిలిపించుకోవడం, మళ్లీ కలుద్దామంటూ వెనక్కుపంపడం టీడీపీ నేతలకు అలవాటుగా మారింది. పీలేరు, పుంగనూరు పరిస్థితి మరీ దారుణం. చిన్నాచితకా నేతలతో పార్టీని నడిపించారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో వ్యవప్రయాసలకోర్చి పార్టీని నడిపించిన వారికి ఈ ఎన్నికల్లో మొండిచెయ్యి చూపుతున్నారు.
వలస నేతల్లోనూ కోటీశ్వరులే ఎంపికే
జంప్‌జిలానీల్లోనూ కోటీశ్వరులనే బాబు ఎంపిక చేసుకున్నారు. తాజాగా టికెట్లు ఇచ్చిన వారిలో గల్లా అరుణకుమారి, శంకరయాదవ్, డీకే సత్యప్రభ కోట్లకు పడగలెత్తినవారు. కేవలం డబ్బుతో ముడిపెట్టి వారికి టికెట్లు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశం తప్పితే పార్టీని పదికాలాల పాటు నడిపించగల సమర్థులను గుర్తించడంలో బాబు విఫలమవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.