
వైఎస్సార్ సీపీ వ్యతిరేక శక్తుల ఓటమి ఖాయం
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒకతీరుగా, సీమాంధ్రలో మరోతీరుగా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్నారని, సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యతిరేక శక్తుల ఓటమి ఖాయమని ఆ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్ గుప్తా పేర్కొన్నారు
సిద్దిపేటఅర్బన్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒకతీరుగా, సీమాంధ్రలో మరోతీరుగా మాట్లాడుతూ ప్రజలను వంచిస్తున్నారని, సీమాంధ్రలో జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వ్యతిరేక శక్తుల ఓటమి ఖాయమని ఆ పార్టీ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు తన హయంలో విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయాలని అడిగిన పాపానికి రైతులను గుర్రాలతో తొక్కించి, పోలీసులను ఉసిగొలిపి, తుపాకులతో కాల్చి చంపించారన్నారు.
చంద్రబాబు అవలంబించిన రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో, సీమాంధ్రలో టీడీపీ ఓటమి పాలవడం తథ్యమన్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేనను బీజేపీకి, టీడీపీకి అమ్మేశాడని వైఎస్సార్ సీపీని విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. కాంగ్రెస్ హఠాఓ, దేశ్ బచావో అంటున్న పవన్ తన సోదరుడు చిరంజీవిని ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. నేతల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు పిడిశెట్టి దుర్గాప్రసాద్, ఎండీ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.