సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన టీడీపీ నాయకులు ఓటర్లకు తాయిలాలు వేసేందుకు సిద్ధమయ్యారు. ‘రానున్న ఎన్నికల్లో ఓడిపోతే కోల్పోయేది అధికారమే కాదు.. ఏకంగా పార్టీయే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఏం చేస్తారో తెలీదు..ఎంతకైనా తెగించండి..డబ్బు వెదజల్లండి..మద్యం ఏరులై పారించండి..ప్రతి ఒక్కర్ని మేనేజ్ చేయండి..ఎలాగైనా గెలుపు కావాలి’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హితబోధ చేయడంతో జిల్లాలోని ఆ పార్టీ అభ్యర్థులు కార్యాచరణలోకి దిగారు.
పోలింగ్‌కు మూడు రోజుల ముందు నుంచే జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. చంద్రబాబు నాయుడికి తొత్తులుగా వ్యవహరించే కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా బెంగళూరు నుంచి హవాలా రూపంలో ఒక్కో నియోజకవర్గానికి రూ.7 కోట్లు చొప్పున నగదు రావడంతో.. ఆ నగదును ఓటర్లకు పంపిణీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తవారైతే ఎవరూ గుర్తుపట్టర న్న ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన వారితో నగదు పంపిణీ చేయిస్తున్నట్లు తెలిసింది.
కొంత మంది కార్పొరేట్ కంపెనీ అధిపతులు జిల్లాకు చేరుకుని ఎవరికీ అనుమానం రాని రీతిలో ఓటుకు నోటు అంటూ వెలకడుతూ ఆ మేరకు పంపీణి చేస్తున్నారు. ఇప్పటి కే పుట్టపర్తి, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పల్లెరఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌లు మహిళా సంఘాలను ప్రలోభపెట్టడానికి వారితో సమవేశమై ఓటుకు రూ.1000 అందజేసినట్లు తెలిసింది. ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉద్యోగస్తులను ప్రలోభ పెట్టడానికి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డి నానా పాట్లు పడ్డారు. నియోజకవర్గాల వ్యాప్తంగా ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపీణీ చేసినట్లు తెలిసింది. టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్న డబ్బులో సగానికి పైగా దొంగనోట్లు ఇస్తున్నట్లు ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు.
ముఖ్యంగా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ఓ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి దొంగనోట్ల ముద్రణ, పంపిణీ విషయంలో సిద్ధహస్తుడు. ఆయన ద్వారానే దాదాపు రూ.30 కోట్ల వరకు జిల్లాకు దొంగనోట్లు దిగుమతి చేసుకుని.. అసలు నోట్లతో కలిపి పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా సోమవారం జిల్లాకు పవన్‌కళ్యాణ్ వస్తున్నట్లు తెలుసుకున్న టీడీపీ నాయకులు..పవన్ సభను సక్సెస్ చేయడానికి ఒకొక్కరికి రూ.500 నగదు పంపిణీ చేసి జనాన్ని రప్పించినట్లు తెలిసింది. అందులో కూడా దొంగనోట్లు కలసి ఉన్నట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని పలు హోటళ్లు, దుకాణాల వారికి పలు దొంగ నోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులకు చెబి తే లేనిపోని చిక్కులెందుకని భావించి మిన్నకుండిపోయినట్లు సమాచారం. ఎవరైనా రూ.500 నోటు ఇవ్వగానే ఐదారుసార్లు కిందకూ మీదకూ పరికించి చూసి తీసుకుంటున్నామని ఓ వ్యాపారి చెప్పారు.
‘పచ్చ’నోట్ల పందేరం
Published Tue, May 6 2014 1:51 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement