పడగవిప్పిన ‘పచ్చ’నోట్లు
సాక్షి, ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుకు పదవి పిచ్చి పట్టుకుంది. డబ్బులు వెదజల్లైనా సరే గద్దెనెక్కేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాల పర్వానికి అప్పుడే శ్రీకారం చుట్టారు. కేవలం ప్రలోభాలతోనే ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించాలని వారు భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు, కుల, కార్మిక సంఘాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఆటోలు, లారీలు సైతం కొనిచ్చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారు.
మాజీ మంత్రి, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ను, ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీని అంటిపెట్టుకుని ఉండి చివరి నిమిషంలో పదవి కోసం టీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఆచంటలో డబ్బు కట్టలు కట్టలుగా ఖర్చు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెండు చేతులా సంపాదించిన సొమ్మును ఓటర్లకు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లకు పట్టీలు పంపిణీ చేశారు. చర్చిల్లో సంఘ సభ్యులకు రూ.1000 ఇస్తున్నట్టు సమాచారం. భీమవరంలో కుల సంఘాలతో సమావేశాలు పెట్టి అక్కడి టీడీపీ అభ్యర్థి హామీలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ విధంగానూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఆయన జనానికి ఏ హామీలు ఇచ్చినా నమ్మరని తెలిసి ప్రచారంలో ఏమీ మాట్లాడటం లేదు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఏలూరులో డ్వాక్రా మహిళలకు రూ.300 నుంచి రూ.500 వరకు టీడీపీ పంచిపెట్టింది. పోలవరం నియోజకర్గంలో యువతను ప్రలోభపెట్టేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ వంటి క్రీడాసామాగ్రిని పంపిణీకి సిద్ధం చేస్తున్నారు.
పలు చోట్ల గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలంటూ ముందే సొమ్ములు ముట్టజెబుతున్నారు. నిడదవోలులో టీడీపీ అభ్యర్థి హామీలు కోటలు దాటుతున్నాయి. డ్రైవర్లకు ఆటోలు, లారీలు కొనిచ్చేస్తామంటూ అక్కడి అభ్యర్థి హామీలు కుమ్మరిస్తున్నారు. ఉద్యోగులకు రూ.1000, ఆటో డ్రైవర్లకు రూ.500, అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.2000, ఆర్‌ఎంపీలకు రూ.2000 చొప్పున అప్పుడే పంచిపెట్టేశారు. తణుకులో రూ.500 నుంచి రూ.1000 వరకు పంచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా కుల సంఘాలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. ఉండిలో కుల, కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లిగూడెంలో బూత్ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఓటర్లకు మందు, విందు, చింతలపూడిలో సంఘాలకు కమ్యూనిటీ భవనాలు, చర్చి భవనాలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇలా టీడీపీ యథేచ్ఛగా ప్రలోభాలకు పాల్పడుతోంది.