Pitani Sathya Narayana
-
పితానీ.. ఇదేం పని!
సాక్షి, అమరావతి : ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)లో కార్మికుల కడుపు కొట్టి రూ.కోట్లు కొట్టేసిన అప్పటి నేతలు, అధికారుల అవినీతి ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. నాణ్యతను గాలికొదిలేసి, ఏజెన్సీల నుంచి వచ్చే కమీషన్ల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ప్రభుత్వంలోని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ హయాంలో జరిగిన అవినీతి తాజాగా బయటికొచ్చింది. ఒక ఏజెన్సీ కోసం ఏకంగా ఔషధ నియంత్రణ అధికారులు ఇచ్చిన నివేదికనే తొక్కిపెట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. మరోవైపు ఆయన కుమారుడు వెంకట సురేష్ స్లిప్పులు రాసిచ్చి నామినేషన్ కింద ఆర్డర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. ఔషధ నియంత్రణ శాఖ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలు ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన పారాసెటిమాల్ మాత్రలు డొల్ల అని, సరఫరా చేసిన ఏజెన్సీని రద్దుచేయండని ఔషధ నియంత్రణ శాఖ నివేదిక ఇచ్చింది. ►ఆ నివేదికను మంత్రి పితాని ఒత్తిడి మేరకు చెత్తబుట్టలో వేశారు. ఏజెన్సీపై కనీస చర్యలూ తీసుకోలేదు. ఏజెన్సీతో ఉన్న లావాదేవీలే కారణం ►2016లో తయారైన ఈ మందులు 2019 ఆగస్ట్‌తో ఎక్స్‌పెయిరీ అవుతాయన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా సరఫరా చేశారు. ►ఈ మందులను తిరుమల మెడికల్ ఏజెన్సీస్ సరఫరా చేసింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీ అధినేత కార్తీక్ జైల్లో ఉన్నారు. ►2019 ఫిబ్రవరిలో ఈఎస్ఐ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందులు నాసిరకమైనవని తిరుపతి డ్రగ్ ఇన్స్పెక్టర్ నివేదిక ఇచ్చారు. ► ఈ నివేదికను జేడీ జగదీప్ గాంధీ.. అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్‌కు పంపి చర్యలు తీసుకోమన్నారు. అప్పటి మంత్రి పితాని ఒత్తిళ్ల మేరకు డైరెక్టర్ చర్యలు తీసుకోలేదు. ►తిరుమల ఏజెన్సీస్ విజయవాడలోని భవానీపురంలో ఓ అపార్ట్మెంట్ చిరునామా ఇచ్చారు. ►పోలీసుల విచారణలో ఆ చిరునామాలో ఇలాంటి ఏజెన్సీనే లేదని తేలింది. ►మాత్రలు నాసిరకం అని తేలిన మరుసటి రోజునే ఆ చిరునామా ఇంటికి నోటీసు అతికించగా.. ఎవరూ స్పందించలేదు. ► సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడంతో మంత్రి స్వయానా ఏజెన్సీని కాపాడేందుకు యత్నించినట్టు తెలుస్తోంది. స్లిప్పులు రాసి పంపించేవారు ►మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా నొక్కేశారు. ►రేటు కాంట్రాక్టులో లేని ఏజెన్సీల నుంచి కొనుగోళ్లు చేయడమే కాదు, ఎక్కువ రేటుకు తీసుకోవాలని సిఫార్సు చేసేవారు. మంత్రి కొడుకు చేసిన ఈ వ్యవహారాలను ఈఎస్ఐ అధికారులు కొంతమంది ఏకరువు పెట్టారు. వాళ్లు ఏమంటున్నారంటే.. ►మంత్రి కొడుకు స్లిప్పులు రాసి తమకు పంపించేవారు. వాటి ఆధారంగా ఇచ్చాం. స్లిప్పు రాసిచ్చాక మళ్లీ ఫోన్లు చేసేవారు. స్లిప్పులను తర్వాత చించేసేవాళ్లం. ► మంత్రి కొడుకు సిఫార్సు చేసిన వాటిలో రేటు కాంట్రాక్టులో లేని సంస్థలే ఉన్నాయి. ► బిల్లుల చెల్లింపుల్లోనూ స్లిప్పులు రాసి పంపించేవారు. -
ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్
-
ఈఎస్ఐ స్కాం : మాజీ మంత్రి పీఎస్ అరెస్ట్
-
పడగవిప్పిన ‘పచ్చ’నోట్లు
సాక్షి, ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుకు పదవి పిచ్చి పట్టుకుంది. డబ్బులు వెదజల్లైనా సరే గద్దెనెక్కేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాల పర్వానికి అప్పుడే శ్రీకారం చుట్టారు. కేవలం ప్రలోభాలతోనే ఈ ఎన్నికల్లో ఓట్లు సాధించాలని వారు భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు, అంగన్వాడీ కార్యకర్తలకు, కుల, కార్మిక సంఘాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఆటోలు, లారీలు సైతం కొనిచ్చేస్తామంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ను, ఆ తర్వాత జై సమైక్యాంధ్ర పార్టీని అంటిపెట్టుకుని ఉండి చివరి నిమిషంలో పదవి కోసం టీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఆచంటలో డబ్బు కట్టలు కట్టలుగా ఖర్చు పెడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెండు చేతులా సంపాదించిన సొమ్మును ఓటర్లకు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు పట్టీలు పంపిణీ చేశారు. చర్చిల్లో సంఘ సభ్యులకు రూ.1000 ఇస్తున్నట్టు సమాచారం. భీమవరంలో కుల సంఘాలతో సమావేశాలు పెట్టి అక్కడి టీడీపీ అభ్యర్థి హామీలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏ విధంగానూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఆయన జనానికి ఏ హామీలు ఇచ్చినా నమ్మరని తెలిసి ప్రచారంలో ఏమీ మాట్లాడటం లేదు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారు. ఏలూరులో డ్వాక్రా మహిళలకు రూ.300 నుంచి రూ.500 వరకు టీడీపీ పంచిపెట్టింది. పోలవరం నియోజకర్గంలో యువతను ప్రలోభపెట్టేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ వంటి క్రీడాసామాగ్రిని పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. పలు చోట్ల గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలంటూ ముందే సొమ్ములు ముట్టజెబుతున్నారు. నిడదవోలులో టీడీపీ అభ్యర్థి హామీలు కోటలు దాటుతున్నాయి. డ్రైవర్లకు ఆటోలు, లారీలు కొనిచ్చేస్తామంటూ అక్కడి అభ్యర్థి హామీలు కుమ్మరిస్తున్నారు. ఉద్యోగులకు రూ.1000, ఆటో డ్రైవర్లకు రూ.500, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.2000, ఆర్ఎంపీలకు రూ.2000 చొప్పున అప్పుడే పంచిపెట్టేశారు. తణుకులో రూ.500 నుంచి రూ.1000 వరకు పంచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా కుల సంఘాలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. ఉండిలో కుల, కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమవుతున్నారు. తాడేపల్లిగూడెంలో బూత్ స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటు చేసి స్థానిక ఓటర్లకు మందు, విందు, చింతలపూడిలో సంఘాలకు కమ్యూనిటీ భవనాలు, చర్చి భవనాలు నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇలా టీడీపీ యథేచ్ఛగా ప్రలోభాలకు పాల్పడుతోంది. -
పెనుగొండ టీడీపీలో వీడని పీఠముడి
పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : పెనుగొండ మండలంలో టీడీపీ పాత, కొత్త వర్గాల మధ్య పోరు రసకందాయంలో పడింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం టీడీపీలో చేరనుండడంతో గురువారం మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో పోటీపై రసవత్తర చర్చ జరిగింది. మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 18 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, పితాని అనుచరులు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున స్వతంత్రులుగా 17 స్థానాల్లో పోటీకి దిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలోకి దిగితే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పితాని టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో ప్యాకేజీ మాట్లాడుకున్నారు. దీంతో ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి నిలిచిన పితాని అనుచరులు ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ స్థానిక నేతలు కోరుతూ వచ్చారు. అయితే పితాని అనుచరులు ససేమిరా అన్నారు. బరిలో నిలిచిన పితాని అనుచరులు కొందరు ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. పితాని టీడీపీలో చేరడం ఖాయమైన తరుణంలో గురువారం కొమ్ముచిక్కాలలో నాయకులతో సమావేశం జరిగింది. ఇందులో బరిలో నిలిచిన పితాని అనుచరులు పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నేతలు పట్టుపట్టారు. పోటీ చేసే స్థానాల్లో అవగాహన కుదుర్చుకుందామని పితాని వర్గం ప్రతిపాదించింది. తొమ్మిదేళ్లుగా పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. తీరా ఎన్నికలొచ్చేసరికి మా పార్టీలోకి వచ్చి మాకు పొగ పెడతారా అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే తాము పోటీ నుంచి విరమించేది లేదని ప్రజాక్షేత్రంలోనే చూసుకుందామంటూ పితాని వర్గీయులు తేల్చిచెప్పి సమావేశం ముగించినట్టు తెలిసింది. తొమ్మిదేళ్లుగా పార్టీ జెండా పట్టుకుని పితాని వర్గంలో పోరాడామని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, చివరికి వచ్చేసరికి తమ పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు నిర్ణయంతో వారితో కలిసి పనిచేయాల్సి రావడమేమిటని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎన్నికల ముందే టీడీపీ వర్గాల్లో చీలిక రావడంతో ముందుముందు రాజకీయాలు మరింత రంజుగా మారతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.