పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : పెనుగొండ మండలంలో టీడీపీ పాత, కొత్త వర్గాల మధ్య పోరు రసకందాయంలో పడింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ శుక్రవారం టీడీపీలో చేరనుండడంతో గురువారం మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో పోటీపై రసవత్తర చర్చ జరిగింది. మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 18 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, పితాని అనుచరులు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున స్వతంత్రులుగా 17 స్థానాల్లో పోటీకి దిగారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున బరిలోకి దిగితే డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో పితాని టీడీపీలో చేరేందుకు ఆ పార్టీ అధిష్టానంతో ప్యాకేజీ మాట్లాడుకున్నారు. దీంతో ఎంపీటీసీ స్థానాల్లో పోటీకి నిలిచిన పితాని అనుచరులు ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ స్థానిక నేతలు కోరుతూ వచ్చారు. అయితే పితాని అనుచరులు ససేమిరా అన్నారు. బరిలో నిలిచిన పితాని అనుచరులు కొందరు ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. పితాని టీడీపీలో చేరడం ఖాయమైన తరుణంలో గురువారం కొమ్ముచిక్కాలలో నాయకులతో సమావేశం జరిగింది.
ఇందులో బరిలో నిలిచిన పితాని అనుచరులు పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నేతలు పట్టుపట్టారు. పోటీ చేసే స్థానాల్లో అవగాహన కుదుర్చుకుందామని పితాని వర్గం ప్రతిపాదించింది. తొమ్మిదేళ్లుగా పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డామని.. తీరా ఎన్నికలొచ్చేసరికి మా పార్టీలోకి వచ్చి మాకు పొగ పెడతారా అంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. అయితే తాము పోటీ నుంచి విరమించేది లేదని ప్రజాక్షేత్రంలోనే చూసుకుందామంటూ పితాని వర్గీయులు తేల్చిచెప్పి సమావేశం ముగించినట్టు తెలిసింది.
తొమ్మిదేళ్లుగా పార్టీ జెండా పట్టుకుని పితాని వర్గంలో పోరాడామని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, చివరికి వచ్చేసరికి తమ పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు నిర్ణయంతో వారితో కలిసి పనిచేయాల్సి రావడమేమిటని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఎన్నికల ముందే టీడీపీ వర్గాల్లో చీలిక రావడంతో ముందుముందు రాజకీయాలు మరింత రంజుగా మారతాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
పెనుగొండ టీడీపీలో వీడని పీఠముడి
Published Fri, Apr 4 2014 12:37 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement
Advertisement