తమ్ముళ్లకూ వెన్నుపోటా? | don't believe chandra babu naidu | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకూ వెన్నుపోటా?

Published Sun, Apr 20 2014 2:17 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

తమ్ముళ్లకూ వెన్నుపోటా? - Sakshi

తమ్ముళ్లకూ వెన్నుపోటా?

  •      బాబు వైఖరిపై మండిపడుతున్న పార్టీ నేతలు
  •      డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆగ్రహం
  •      పార్టీని నమ్ముకున్న వారిని కాదని
  •      వేరే వారికి టికెట్లివ్వడంపై మండిపాటు
  •      సీమాంధ్రలో భగ్గమన్న నిరసనలు..
  •      అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

  • సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో ఎన్నికల చిచ్చు రగిలింది. సీమాంధ్రలో నామినేషన్ల చివరి రోజున పార్టీలో అసమ్మతి భగ్గుమంది.నమ్ముకున్న వారిని పార్టీ నట్టేట ముంచిందని, చంద్రబాబు ద్రోహానికి పాల్పడ్డారంటూ అనేక చోట్ల నేతలు తిరుగుబాట్లు ప్రకటించారు. తమ్ముళ్లకూ వెన్నుపోట్లు పొడిచారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో చంద్రబాబు బసచేసిన హోటల్ వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు అమ్ముకున్నారంటూ నేతలు ఆగ్రహోదగ్రులయ్యారు.
     
    చంద్రబాబు చుట్టూ చేరిన కోటరీ నేతలు కార్పొరేట్లకు టికెట్లను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డికి అన్యాయం జరిగిందంటూ ఆయన భార్య విజయవాడలో కన్నీటిపర్యంతమయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి టికెట్టు ఆశించి భంగపడ్డ పోతినేని శ్రీనివాసరావు పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవిని గదిలో నిర్బంధించారు. పలు జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలును కార్యకర్తలు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
     
    ఎన్నికల ప్రచారానికి వచ్చి, విజయవాడలో బస చేసిన పార్టీ అధినేత చంద్రబాబుకు శనివారం నిరసనల సెగ తగిలింది. ఆయన బస చేసిన స్టార్ హోటల్ నిరసనలతో హోరెత్తింది. త మ నేతలకు అన్యాయం జరిగిందంటూ పలువురు నాయకుల అనుచరులు ఆందోళనలకు దిగారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగారెడ్డి అనుచరులు చంద్రబాబు బస చేసిన హోటల్‌లో ముందు ధర్నా చేయటంతో పాటు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రొద్దుటూరు టికెట్టును లింగారెడ్డికి ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వరదరాజులురెడ్డికి రూ.25 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.
     
    పార్టీ ఉపాధ్యక్షుడు సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదరాజులురెడ్డిని ఓడిస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో చంద్రబాబు లింగారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పిలిపించుకుని రెండు నిమిషాలు మాట్లాడి పంపించారు. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో లింగారెడ్డి అనుచరులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

    ఈ వ్యవహారమంతటినీ చూసిన లింగారెడ్డి సతీమణి లక్ష్మీప్రసన్న తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ తనను కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారో అర్థం కాలేదన్నారు.కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని గద్దె రామ్మోహన్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎంవీఆర్ చౌదరి వర్గీయులు కూడా ఇదే హోటల్ వద్ద ఆందోళనకు దిగారు.
     
    విశాఖ, తూర్పు గోదావరిలో స్థానికేతర చిచ్చు
    తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో స్థానిక, స్థానికేతర చిచ్చు రగిలింది. పెద్దాపురం సీటును స్థానికేతరుడైన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించడంతో స్థానిక నేత గోలి రామారావు అనుచరులు భగ్గుమన్నారు. నామినేషన్ వేయడానికి వచ్చిన రాజప్ప కారును అడ్డుకుని, అద్దాలు పగులగొట్టారు. పార్టీ జెండాలు తగలబెట్టి, ‘రాజప్ప గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు.. పిఠాపురం సీటు ఆశించిన స్థానిక టీడీపీ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు కాకుండా పోతుల విశ్వానికి కేటాయించడంపై ఆగ్రహించిన కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న విశ్వాన్ని చిత్రాడ, పాదగయ క్షేత్రం వద్ద అడ్డుకోబోయారు.
     
    వారిని పోలీసులు చెదరగొట్టారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య విశ్వం నామినేషన్ వేశారు. వర్మ కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో స్థానికేతరుడైన పంచకర్ల రమేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. గంటాను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ నిరసన వ్యక్తంచేశారు. పోలీసు బందోబస్తు మధ్య గంటా అక్కడ నుంచి వెళ్లారు. పంచకర్ల స్థానికేతరులను వెంట పెట్టుకుని వచ్చి నామినేషన్ దాఖలుచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సీటును మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు రామాంజనేయులుకు ఇవ్వటాన్ని నిరసిస్తూ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మెంటే పార్ధసారథి అనుచరులు నిరసన తెలిపారు.
     
    మంగళగిరిలో ముష్టియుద్ధం
    గుంటూరు జిల్లా మంగళగిరిలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. మంగళగిరి టికెట్‌ను గంజి చిరంజీవికి ఇవ్వడంతో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, ఆయన  వర్గీయులు భగ్గుమన్నారు. వారు చిరంజీవిని కొద్దిసేపు గదిలో బంధించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని చిరంజీవిని విడిపించి తమ వాహనంలో తీసుకెళ్లి నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా ఇద్దరి అనుచరులు పరస్పరం దాడులు చేసుకోవటంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు తూర్పు, గుంటూరు లోక్‌సభ, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, సింహాద్రియాదవ్‌లు వారి సామాజికవర్గానికి జరిగిన ఆన్యాయానికి ప్రతీకారంగా సత్తా చాటుతామని హెచ్చరించారు.
     
    ‘నా టికెట్ దొంగిలించారు’
    విజయనగరం జిల్లా  కురుపాం టికెట్టు కోల్పోయిన నిమ్మక జయరాజ్ ‘‘నేను టీడీపీ బాధితుడిని’’ అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకుని నిరసన తెలిపారు. కురుపాం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి ఉన్న పచ్చ రంగు స్థానంలో తెల్ల రంగు వేయించారు. టీడీపీలో దొంగలు పడ్డారని, తన టిక్కెట్‌ను వారే దొంగిలించారని జయరాజ్ అన్నారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. శత్రుచర్ల, థాట్రాజ్ డబ్బులు చెల్లించి టికెట్లు కొనుక్కున్నారని ఆరోపించారు. ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement