
హైదరాబాద్: బీజేపీలో ఎప్పుడూ లేని కొత్తగా అసమ్మతి చెలరేగింది. రెండో విడతలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ కొందరు నాయకులు అదిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శేరిలింగపల్లి టిక్కెట్ ఆశించిన డాక్టర్ నరేష్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తమకు టిక్కెట్ దక్కక పోవడంతో నిరసనకు దిగారు. బీజేపీ కార్యాలయం వద్ద ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వాళ్ల వర్గీయులైతే ఏకంగా కార్యాలయం బిల్డింగ్ పైకెక్కి దూకుతామని హెచ్చరించారు. శేరిలింగం పల్లి బీజేపీ అభ్యర్థిగా యోగానంద్ పేరు అదిష్టానం ఖరారు చేయడంతో, టిక్కెట్లను అమ్ముకున్నారంటూ నరేష్ వర్గీయులులు నినాదాలు చేశారు. శేరిలింగంపల్లి అభ్యర్థి యోగానంద్ దిష్టిబొమ్మను నరేష్ వర్గీయులు దగ్ధం చేశారు.
మరో వైపు నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు కేటాయించడంతో ధన్‌పాల్ సూర్యనారయణ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఏకంగా బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని ధన్‌పాల్‌వర్గం చెబుతోంది. బీజేపీ రెండో జాబితాలో మొత్తం 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో ఏడుగురు రెడ్లకు, ముగ్గురు వెలమలకు, ఒక వైశ్య, ఆరుగురు బీసీలకు, 5 ఎస్టీ, 3 ఎస్సీ, 2 మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించారు. బీజేపీ మొదటి విడతలో 38, రెండో విడతలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేయగా..మిగతా 53 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment