సాక్షి , ఏలూరు : జిల్లాలో 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మిగిలిన నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్రమైన టెన్షన్ నెలకొంది. నరసాపురంలో మాధవనాయుడు, ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులును తొలుత ఖరారు చేశారు. అయితే చివరి నిమిషంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, జెడ్పీ చైర్మన్ బాపిరాజు కోసం ఆ సీట్లు ఆపడం వివాదంగా మారింది. పోలవరం, నిడదవోలులో అసమ్మతి తలనొప్పిలతో నిలిపివేశారు.
నరసాపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పేరు ముందు ఖరారు చేశారు. అయితే ఆ తర్వాత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టిక్కెట్ తనకే వస్తుందని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తపల్లి మంత్రాంగం ఫలించిందన్న వాదన వినిపిస్తోంది. దీంతో మాధవనాయుడు వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే సీటు ఖరారు అయ్యిందన్న భావనతో ప్రచారం మొదలుపెట్టిన మాధవనాయుడికి సీటు పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్ మొదలైంది.
శుక్రవారం మాధవనాయుడు కుటుంబం అంతా ప్రచారంలో పాల్గొంది. ఉంగుటూరు సీటు గన్ని వీరాంజనేయులకే ఖరారు అయ్యిందని, అయితే బాపిరాజును బుజ్జగించేందుకు, ఈ సీటు ఇస్తారన్న ఆశ కల్పించేందుకు మొదటిలిస్ట్‌లో ఈ పేరు ఇవ్వలేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే గన్ని వీరాంజనేయులు నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సీటు ప్రకటించకపోవడంతో గన్ని వర్గం ఆందోళన చెందుతోంది.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి
మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాతకు సీటు ఇవ్వకపోవడంపై ఆ వర్గం మండిపడుతోంది. కష్టపడి పనిచేసిన పీతల సుజాతకు అన్యాయం జరిగిందంటూ ఏలూరు క్యాంప్ ఆఫీస్‌లో సుజాత వర్గం నాయకులు, కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీటు ఆశించి భంగపడిన సొంగ రోషన్‌కుమార్ కూడా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రమే చంద్రబాబునాయుడు వారిని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుజాతపై ఒత్తిడి చేశారు.
దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, తొందరపడవద్దని పీతల సుజాత నచ్చచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే సీటు ఖరారు అయిన భీమవరంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంజిబాబు గెలిచిన తర్వాత పార్టీ సీనియర్లను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయని, మళ్లీ ఆయనకే సీటు ఇవ్వడంతో పలువురు పార్టీని వీడేందుకు సన్నద్ధం అవుతున్నారు.
మరోవైపు పీతల సుజాతకు సీటు రాకపోవడం వల్ల ఆ ప్రభావం భీమవరంపై పడే అవకాశం కనపడుతోంది. పీతలది వీరవాసరం మండలం కావడం, సుజాతను ఒక సామాజికవర్గం నేతలు కుల రాజకీయాలతో ఇబ్బంది పెట్టారన్న భావనతో ఇక్కడి దళితులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు సీటు వస్తుందన్న ఆశతో బీజేపీ నుంచి జనసేనలోకి చేరిన మొడియం శ్రీనివాస్ మళ్లీ తిరుగుటపాలో బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
నాలుగేళ్లపాటు భారతీయ జనతాపార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్‌గా పనిచేసిన మొడియం శ్రీనివాసరావు సీటు ఇస్తామన్న హామీతో జనసేనలో చేరారు. అయితే అక్కడ డబ్బులు ఎంత ఖర్చు పెడతారంటూ డిమాండ్లు పెట్టడంతో వెనక్కి వచ్చేశారు. ఇప్పటికే జిల్లాలో జనసేనకు యర్రా నవీన్ రాజీనామా చేయగా పలువురు నేతలు జనసేనను వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment