సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీ పెండింగ్‌లో పెట్టిన నాలుగు సీట్లపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ నాలుగు కూడా సిట్టింగ్‌లనే ఖరారు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు అసలు అభ్యర్థిని ప్రకటించకుండానే ఉంగుటూరులో ఆదివారం తెలు గుదేశం పార్టీ ఎన్నికల సభ నిర్వహిస్తోంది. అయితే ఏర్పాట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే దగ్గరుండి చేస్తున్నారు. అర్ధరాత్రికి అయినా తన పేరు ఖరారు చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ఆదివారం ఉదయం ప్రకటించనుంది.
ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయ నుంచి ఈ జాబితాను విడుదల చేస్తారు. శనివారమే జాబితా ఇవ్వాల్సి ఉన్నా వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో జాబితా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎంపీఅభ్యర్థులను కూడా ఆదివారం ప్రకటించనున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో దాదాపుగా అందరు సిట్టింగ్‌లను ప్రకటించినా ఒక్క చింతలపూడిలో మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. పీతల సుజాతకు సీటు రాకుండా ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాగా లాబీయింగ్ చేశారు. కేవలం కమ్మ సామాజికవర్గం పెత్తనాన్ని ఎదిరించినందుకే పీతల సుజాతకు సీటు లేకుండా చేశారని దళిత వర్గాలు మండిపడుతున్నాయి.
ఆమెకు సీటు ఇవ్వకుండా అవమానించడంపై ఆమె సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో చివరి వరకూ వేచి ఉండి ఎక్కడా సుజాతకు స్థానం కల్పించకపోతే పార్టీ నుంచి బయటకు రావాలని దళిత నేతలు భావిస్తున్నారు. నిడదవోలులో అన్నదమ్ములు పోటీ పడుతుండటంతో ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోండని చంద్రబాబునాయుడు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకపోతే మూడో వ్యక్తికి సీటు ఇస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.
సొంత అన్న కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును వ్యతిరేకిస్తుం డడంతో నిడదవోలులో రచ్చ కొనసాగుతోంది. నరసాపురంలో సీటు తమకే దక్కుతుందని కొత్తపల్లి సుబ్బారాయుడి వర్గం ధీమాగా ఉంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవనాయుడి వర్గంలో ఆందోళన నెలకొంది. అయినా సీఎం తనకే హామీ ఇచ్చారన్న ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పోలవరంలో కూడా మొడియం శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గంలోని అభ్యర్థులపై ఐవీఆర్‌ఎస్ సర్వేలో వారికి సానుకూలంగా రాకపోవడంతో సిట్టింగ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
మరోవైపు మంత్రి జవహర్ తనకు కొవ్వూరులో సీటు రాకుండా అడ్డంపడ్డ నేతలపై విరుచుకుపడ్డారు. వారు ఎంత కుటిల రాజకీయాలు చేసినా తనకు సీటు రాకుండా అడ్డుకోలేకపోయారని, తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబునాయుడు తిరువూరు సీటు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాకపోవడంతో మంత్రి వర్గం ఆందోళన చెందుతోంది. ఇంకో వైపు జనసేనలో కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే యర్రా నవీన్ బయటకు వెళ్లిపోగా తాజాగా ఏలూరులో జనసేన నేత సాగర్‌బాబు కూడా పార్టీని వీడి బయటకు వచ్చారు. జనసేన సిద్ధాంతాలకు భిన్నంగా నాలుగుపార్టీలు మారిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment