సాక్షి, ద్వారకా తిరుమల: రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. నిరంతరాయంగా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇవన్నీ చేయకపోగా, ఏటా బ్యాంకుల ద్వారా ఎల్టీ రుణాలు పొందిన రైతులకు ఆరు శాతం రాయితీని ఎగవేశాడు. గడచిన ఐదేళ్లకాలంలో జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు రాయితీ వర్తించలేదు. అన్నదాతలను ఇంత మోసం చేసిన చంద్రబాబు, ఎన్నికలు వచ్చేసరికి సుఖీభవ పేరుతో అరకొరగా రైతుకు రూ.1,000 అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీడీపీ ప్రభుత్వం అన్నదాతలను అడుగడుగునా మోసం చేస్తూనే వచ్చింది. రుణమాఫీ పేరుతో అబద్ధపు హామీలిచ్చి గత ఎన్నికల్లో విజయాన్ని సాధించి, గద్దెనైతే ఎక్కాడు గానీ.. ఏ ఒక్క రైతుకు బాబు మేలు చేసింది లేదు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు రైతన్నలను కుదేలు చేస్తుంటే, కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రైతులు బ్యాంకుల ద్వారా ట్రాక్టరు, పశువులు, గొర్రెల కొనుగోలుకు, అలాగే బోర్లు వేసుకునేందుకు రుణాలు పొంది, ఏడాది పొడవునా బకాయిలు లేకుండా, సకాలంలో రుణాలు చెల్లించిన ప్రతి రైతుకు 6 శాతం రాయితీ ఇచ్చేవారు. అంటే రూ.లక్షకు, రూ.6 వేలు రాయితీ రైతుకు లభించేది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయని బాబు, 6 శాతం రాయితీని మాత్రం మాఫీ చేశాడు. జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపి, కోట్లాది రూపాయల రాయితీ సొమ్మును ఎగవేసింది.
అకౌంట్లకు జమచేస్తామంటూ..
గతంలో రైతులు రుణం చెల్లించే సమయంలో బ్యాంకు అధికారులు 6 శాతం రాయితీని మినహాయించి, మిగిలిన సొమ్మును జమచేసుకునేవారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు రైతులు బ్యాంకులకు వెళ్తే, పూర్తి సొమ్ము జమచేయాలని, 6 శాతం రాయితీ తరువాత మీ బ్యాంకు ఖాతాల్లో పడతాయని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క రైతుకు చిల్లిగవ్వ రాయితీ సొమ్ము అందలేదు. ఇది బయటకు కనిపించని మోసమని రైతులు అభివర్ణిస్తున్నారు. రైతులను ఇంత మోసం చేసిన బాబుకు గురువారం జరిగే ఎన్నికల పోలింగ్‌లో ఓటుతో బుద్ధి చెబుతామని అంటున్నారు.
దగాకోరు బాబు
చంద్రబాబు దగాకోరు. రైతులను నమ్మించి మోసం చేశాడు. రుణమాఫీ పేరుతో గత ఎన్నికల్లో గెలిచి, రైతుల నడ్డి విరిచాడు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎల్టీ రుణాలు పొంది, సకాలంలో తిరిగి చెల్లించిన ప్రతి రైతుకు 6 శాతం రాయితీ ఇచ్చి, ఆదుకున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. గడచిన ఐదేళ్లలో ఒక్క పైసా కూడా రైతులకు అందలేదు.
–అల్లాడ హరే రామకృష్ణ, దొరసానిపాడు, ద్వారకా తిరుమల మండలం, రైతు
సుఖీభవ ఎందుకు?
గత ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇచ్చిన హామీ ప్రకారం రుణాలను మాఫీ చేస్తే బాగుండేది. అలాకాకుండా రైతులకు ఎప్పుడు ఇచ్చే రాయితీని మాఫీ చేయడం ఏమీ బాగోలేదు. రైతే రాజంటూ, రైతులకు అండగా ఉంటామని చెప్పే చంద్రబాబు, రైతుల కోసం ఏం చేశారో తెలియడం లేదు. మరోసారి అధికారం కట్టబెడితే బాబు రైతనేవాడినే లేకుండా చేస్తాడు.
–పాకలపాటి సుబ్బారావు, దొరసానిపాడు, ద్వారకాతిరుమల మండలం, రైతు
జిల్లా రైతాంగం మోసపోయింది
గత ఎన్నికల్లో జిల్లా రైతాంగం చంద్రబాబును పూర్తిగా నమ్మింది. ఓట్లు వేసి గెలిపిస్తే ఎంతో మేలు చేస్తాడని ఆశపడ్డాం. జిల్లాలోని రైతులందరం కలసి బాబుకు పట్టం కట్టాం. అయితే గడచిన ఐదేళ్లలో బాబు రైతుల కోసం చేసిందేమీ లేదు. ఎన్నికలు దగ్గరపడగానే సరికి డ్వాక్రా మహిళలకు పసుపు, కుంకుమ పేరుతో ఎలా గేలం వేశాడో.. అదే విధంగా రైతులకు సుఖీభవ పేరుతో గేలం వేశాడు. కానీ అన్నదాతలు అంత ఆలోచన లేనివారు కాదు. బాబుకు తగిన బుద్ధి చెప్పి తీరుతాం.
అల్లాడ సత్యనారాయణ, దొరసానిపాడు, ద్వారకాతిరుమల మండలం, రైతు
Comments
Please login to add a commentAdd a comment