సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబునాయుడు, సభలో ఖాళీగా ఉన్న కుర్చీలు
సాక్షి, తాడేపల్లిగూడెం రూరల్ : తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా కంచుకోట అని, 2014 మాదిరిగా జిల్లాలోని అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీకి కట్టబెడితే ఈసారి మీకు న్యాయం చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం పెంటపాడు మండలం ప్రత్తిపాడు ఎన్‌కే గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చామని, అయితే గెలిచిన తర్వాత పైడికొండల మాణిక్యాలరావు పక్కలో బల్లెంలా మారారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రోజుకో మాట మాట్లాడి యూటర్న్ తీసుకున్నారని సీఎం చెప్పారు. ప్రతిపక్షాలు, మోడీ కలిసి ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తాను రాజీ పడలేదన్నారు.
సభ మధ్యలోనే వెనుదిరిగిన కార్యకర్తలు
సీఎం సభకు టీడీపీ నేతలు బస్సులు, ఇతర వాహనాల్లో కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు పెద్దగా జనం రాకపోవడంతో కుర్చీలు వెలవెలబోయాయి. మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిన సీఎం సాయంత్రం 5.10కి వచ్చారు. సీఎం ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే వచ్చిన వారు కూడా మధ్యలోనే వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment