పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రతిని చూపిస్తున్న బాధితురాలు పద్మప్రియ
ఏలూరు (సెంట్రల్): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఓ మహిళ కన్నీటిపర్యంతమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరుడినంటూ టీడీపీ నాయకుడు ఒకరు రెండు సంవత్సరాలుగా మా ఇంట్లో అద్దెకు ఉంటూ మమ్మల్నే బెదిరిస్తున్నాడని బాధితురాలు మల్లాది పద్మప్రియ వాపోయింది. ఇంటిని ఖాళీ చేయకుండా, ఇంటి యజమానులమైన మమ్మల్నే ఇంట్లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాము విశాఖపట్నంలో నివాసం ఉంటున్నామని, ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని ఆగ్రహారంలో డోర్ నెంబర్ 4–13–17లో తమకు ఇల్లు ఉందని వివరించింది.
తన భర్త రామచంద్రమూర్తి అమరావతిలో సమాచార శాఖ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ఏలూరులో ఉన్న ఇంటిలో నివాసం ఉంటూ ప్రతి రోజు అమరావతికి వెళ్లి వస్తుంటారన్నారు. ఇంటి కింద భాగం ఖాళీగా ఉండడంతో 2017 మే నెలలో ఏలూరుకు చెందిన టీడీపీ నాయకుడు మర్గాని చంద్రకిరణ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలసి ఉండేందుకు ఇల్లు అద్దెకు తీసుకున్నాడని తెలిపింది. ఇంటి అద్దె చెల్లించకుండా ప్రశ్నించిన తమను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. చంద్రకిరణ్ బెదిరింపులకు భయపడి తన భర్త అమరావతిలోనే ఉంటున్నారని పద్మప్రియ తెలిపారు. ఈ విషయంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లిన పట్టించుకోలేదని, పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment