సాక్షి, వరంగల్: అసెంబ్లీ టికెట్ల వేటలో వివిధ పార్టీలకు చెందిన జిల్లా అధ్యక్షులు భంగపాటుకు గురయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అధ్యక్షుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. వరంగల్ పశ్చిమ టికెట్ మహాకూటమిలో భాగంగా టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించారు. దీంతో ఇదే స్థానాన్ని ఆశించిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేష్ నిరాశకు గురయ్యారు. సామాజిక సమీకరణాల్లో బీజేపీ టికెట్ ధర్మారావుకు కేటాయించారు. దీంతో ఆ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మకు కూడా టికెట్ దక్కలేదు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి ఎమ్మెల్యే పదవే లక్ష్యంగా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు, బరువులు మోస్తున్న వీరందరూ పార్టీ అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలను జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగేళ్లుగా పార్టీ అధ్యక్షులుగా కొనసాగిన వీరిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరు సమాలోచనల్లో పడిపోయారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో వారు సమాలోచనలు చేస్తున్నారు. పొన్నాలతో పాటు ఆయన వర్గీయులకు ‘కూటమి’ పేరుతో పీసీసీలోని ఓ వర్గం ఝలక్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతుంది.
అప్పుడు దొంతి... ఇప్పుడు నాయిని
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి పార్టీ టికెట్ దక్కకపోవడం ఇది రెండోసారి. 2004 ఎన్నికల సందర్భంగా అప్పడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి నర్సంపేట టికెట్ దక్కలేదు. కత్తి వెంకటస్వామికి టికెట్ ఇచ్చారు. దీంతో దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేందర్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ ఇస్తామని పీసీసీ నేతలు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరలేదు. దీంతో నాయిని అనుచరులు మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సముదాయించే ప్రయత్నం చేసినా నిరసనను విరమించలేదు. నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
నిరాశలో రావు పద్మ..
తెలంగాణలో 2004లో జరిగిన మొదటి ఎన్నికల్లో రావు పద్మారెడ్డి వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం ఆమె వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా అర్బన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. 2019లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఎవరు వచ్చినా పశ్చిమ అభ్యర్థిగా పద్మారెడ్డికే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో ఆమె అదే అశతో పార్టీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోయారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన రెండో జాబితాలో పశిచమను మాజీ ఎమ్మెల్యే ధర్మారావుకు కేటాయించడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు గురయ్యారు. టికెట్ ఇవ్వకుంటే బరిలో ఉంటానని రావు పద్మారెడ్డి బహిరంగంగా ప్రకటించడంతో పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది.
ఈగ మల్లేషం, గన్నోజులకు లేనట్లే..
మహాకూటమి పొత్తుల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేషం వరంగల్ తూర్పు టికెట్, రూరల్ పార్టీ అధ్యక్షుడు గన్నోజు శ్రీనివాసచారి పరకాల టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీకి పశ్చిమ టికెట్ కేటాయించడంతో జిల్లా అధ్యక్షులైన ఈగ మల్లేషం, గన్నోజు శ్రీనివాసాచారిలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment