టికెట్‌ ఎవరికి ఇద్దాం.. | TRS Plans To Announce Candidates List After Congress Decision | Sakshi
Sakshi News home page

టికెట్‌ ఎవరికి ఇద్దాం..

Published Fri, Nov 9 2018 2:09 PM | Last Updated on Fri, Nov 9 2018 4:39 PM

TRS Plans To Announce Candidates List After Congress Decision - Sakshi

సాక్షి, వికారాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వికారాబాద్‌ టికెట్‌ అంశం తేలుద్దామనే ఆలోచనలో ఉన్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎట్టకేలకు కసరత్తును ముమ్మరం చేసింది. మంత్రి కేటీఆర్‌.. జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ కొండల్‌రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలవారీగా పార్టీ నేతలతో అభిప్రాయ సేకరణ జరిపారు. దీపావళినాడు నగరంలోని ప్రగతి భవన్‌కు ముఖ్య నేతలను పిలిపించి కేటీఆర్‌ మాట్లాడారు. టికెట్‌ను ఎవరికి ఇద్దాం.. ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి. మీరే చెప్పండి.. గెలిపిం చాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ ఆయన నేతలతో అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు అనారోగ్య కారణాలతో టికెట్‌ను ఇవ్వలేకపోతున్నామని, బదులుగా ఎవరైతే బాగుంటుందో తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు. 
వికారాబాద్‌ అసెంబ్లీ నుంచి బరిలో దిగే అభ్యర్థి తప్పకుండా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఉన్నారు. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలోని వికారాబాద్, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట్‌ మండలాలకు చెందిన గులాబీ ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రగతిభవన్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  కొండల్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి సుమారు 15 మందికి పైగా నేతలు టికెట్‌ ఆశిస్తుండగా ఇందులో ఎవరైతే బాగుంటుంది.. విజయం సాధించగలరని  కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు, స్థానిక వైద్యుడు డాక్టర్‌ మెతుకు ఆనంద్, చిన్నపిల్లల వైడ్య నిపుణుడు టి.ఆనంద్, ఉద్యమకారులు రామేశ్వర్, వడ్ల నందు, భూమనోళ్ల కృష్ణయ్య తదితరుల పేర్లను ఆయా మండలాలకు చెందిన నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందనే అంశపైనా కేటీఆర్‌ వాకబు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ భార్యకు టికెట్‌ కేటాయించే విషయాన్ని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రకటించిన మూడు స్థానాలను కూడా టీఆర్‌ఎస్‌ పురుషులకు కేటాయించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో కనీసం ఒక్క సీటునైనా మహిళకు ఇస్తే ప్రజల్లోకి మంచి సంకేతం వెళ్తుందనే విషయాన్ని కూడా పార్టీ సీరియస్‌గానే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న డాక్టర్‌ ఏ. చంద్రశేఖర్‌ పేరును కూడా కొందరు నాయకులు కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు అభిగ్నవర్గాల సమాచారం. అయితే, విద్యావంతుడు, న్యాయవాది పత్తి ప్రవీణ్‌కుమార్‌ తదితరులు సైతం వికారాబాద్‌ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆశావహులు టికెట్‌ దక్కిం చుకునేందుకు తమకు తోచిన మార్గం లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 నేతల అభిప్రాయాలను ఓపికగా విన్న కేటీఆర్‌.. టికెట్‌ ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని సూచించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. తిరిగి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రానున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని, టికెట్‌ రానివారు అసంతృప్తి చెందవద్దని ఆయన హితబోధ చేసినట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లో వికారాబాద్‌ టికెట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన సమావేశం చివరలో వెల్లడించినట్లు పార్టీ నేత ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. టికెట్‌ ఎవరిని వరిస్తుందే వేచి చూడాల్సిందే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement