vikararabad
-
కమలం పార్టీలో లుకలుకలు.. బహిరంగంగానే విమర్శలు
బీజేపీ కేడర్‌లో జోష్ తగ్గింది.. జిల్లా నేతల తీరుపై పలువురు నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా విమర్శలు చేయడం శ్రేణుల మధ్య విభేదాలను ఎత్తిచూపుతోంది. పార్టీ కార్యక్రమాలకు నేతలంతా పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం కమలం పార్టీలో లుకలుకలను బహిర్గతం చేస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీకి నష్టం తప్పదు. ఇప్పటికైనా జిల్లా బాధ్యులు స్పందించి అందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెర లేసింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పార్టీ నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా సదానందరెడ్డి జిల్లా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ కేడర్‌పై పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వికారాబాద్, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఇదిలా ఉండగా తాజాగా పరిగిలో సైతం విభేదాలు బయటపడ్డాయి. పలువురు నాయకులు ఏకంగా విలేకరుల సమావేశంలోనే జిల్లా అధ్యక్షుడి తీరును ప్రశ్నించారు. పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా సీల్డ్ కవర్ ద్వారా పదవులు కట్టబెట్టడం ఏమిటని నిలదీశారు. ఇది బీజేపీ సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గనాపూర్ వెంకటయ్య పార్టీ బాధ్యులను నియమించాల్సి ఉండగా.. ఈ స్థానంలో తాండూరుకు చెందిన రమేశ్‌కు బాధ్య తలు అప్పగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొహం చాటేస్తున్న నేతలు... ఇటీవల జరిగిన పలు పార్టీ సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం విమర్శలకు తావిస్తోంది. బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనకు జిల్లాకు చెందిన మరో ముఖ్య నేతతో పొసగకపోవడమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి సైతం పరిగిలో జరిగిన కార్యకర్తల సమావేశాలు, పార్టీ పదవులకు నేతల ఎంపిక కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదానందరెడ్డి కేడర్ విషయంలో వివక్ష చూపుతున్నారని, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం. కనిపించని ఏసీఆర్ మార్క్.. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకి పైగా కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ మంచి ఊపు మీద కనిపించింది. ఈ సమయంలోనే మాజీ మంత్రి, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ.చంద్రశేఖర్ ఆ పార్టీలో చేరడంతో శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. జిల్లాలో ఏసీఆర్ పార్టీకి పెద్దదిక్కుగా మారతారని అందరూ ఊహించారు. ఈ క్రమంలోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరుతారని భావించారు. కానీ ఆయన పార్టీలో చేరింది మొదలు జిల్లా కమలం గూటిలో ఎలాంటి ఊపు కనిపించడంలేదు. కనీసం ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమానికి, పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవటం విమర్శలకు తావిస్తోంది. -
రెండు ఇళ్లు ఉన్నా.. బాత్రూంలోనే ఐసోలేషన్
సాక్షి, వికారాబాద్: తన ద్వారా భార్యాపిల్లలకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఓ కోవిడ్ రోగి బాత్రూంలో తలదాచుకున్నాడు. అతడి సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు అతడిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మైలారంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్ (30)కు ఐదు రోజులక్రితం కరోనా సోకింది. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన అతడు వైరస్ తన కుటుంబ సభ్యులకు కూడా సోకుతుందేమోనని భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఇంటికి కొంత దూరంలో ఉన్న బాత్రూంలో ఉంటున్నాడు. గురువారం ఉదయం అతడు సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. వీడియో వైరల్ కావడంతో జిల్లా వైద్యాధికారులు గమనించి స్థానిక డాక్టర్, ఎంపీడీఓ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం బాధితుడిని అనంతగిరిగుట్టలోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అశోక్‌కు రెండు ఇళ్లు ఉన్నాయని, ఓ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే చికిత్స అందేలా చూస్తామని చెప్పినా వినలేదని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ( చదవండి: అనగనగా సొసైటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాని వైనం ) -
కరోనా: గ్రేటర్లో మరో 17 పాజిటివ్ కేసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తుండగా.. రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా.. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 18 కేసులు నమోదవగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల 858కి చేరగా.. 186 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 651 గా ఉంది. మరో కానిస్టేబుల్‌కు కరోనా.. నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిక్కడపల్లి పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు కోవిడ్ బాధితులుగా మారారు. -
అక్రమంగా ఆక్రమణ..
సాక్షి, తాండూరు: తాండూరులో అక్రమార్కులు రెచ్చి పోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను ఆక్రమించడంతో పాటు ఎవరి పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో బీసీలు, వీరశైవుల కోసం ప్రభుత్వం శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించింది. ఇందిరాచౌక్ సమీపాన హైదరాబాద్ మార్గంలో కుడి వైపున బీసీలకు, ఎడమ వైపున వీరశైవులకు అధికారులు స్థలం అందించారు. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శ్మశానవాటికలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ భవన సముదాయాలకు ఎలాంటి అనుమతులు లేవు. కొంత మంది స్థానిక నాయకులు ఇందులో భాగస్వాములుగా మారి ఈ వ్యవహారాన్ని సాగించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు పట్టణంలోని విజయ విద్యాలయ స్కూల్ పక్కనే ఉన్న ముస్లిం మైనార్టీల శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. సర్వేనంబర్ 111లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. భవనాలు కట్టారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో తాండూరు మొదటిది. 19.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న పట్టణంలో 13,500 నివాస గృహాలున్నాయి. ఏటా రూ.3 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్ ఉంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్ పరిధిలో ఇళ్లు, దుకాణ సముదాయాలు నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల నిర్మాణాలను సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా చేపట్టడం గమనార్హం. అనుమతి పొందకుండానే.. వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్న రియల్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. హద్దురాళ్లు పాతి స్వేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పర్మిషన్ లేని లేఔట్లు 30 వరకు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్రెడ్డిపల్లి మార్గంలో సర్వే నంబర్ 128లో మున్సిపల్ అనుమతులు లేకుండానే వెంచర్ చేశారు. శివారు ప్రాంతాల్లో.. ఇటీవల తాండూరు మున్సిపాలిటీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వందల సంఖ్యలో భారీ భవంతులు వెలుస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బొందలపై రాబందులు... తాండూరులో భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న బొందల (శ్మశానాలు)పై రియల్ రాబందుల వాలాయి. బొందలను ధ్వంసం చేసి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఓ సంఘం ఇందులో ఏకంగా 40నుంచి 50 దుకాణాలు నిర్మించింది. వీటి వెనకభాగంలో మెకానిక్ షెడ్లు నిర్మించేందుకు మరికొంత మంది సిద్ధమవుతున్నారు. మరో సామాజికవర్గానికి చెందిన దుకాణ సముదాయాలు సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండానే వెలిశాయి. తాండూరు పట్టణంలో నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కొత్త చట్టం అమలుతో కూల్చివేతలే.. రెండు రోజుల క్రితమే కొత్త మున్సిపల్ చట్టానికి రూపకల్పన చేశారు. దీనిపై అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా పడింది. ఇందులో పేర్కొన్న ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారాలను మున్సిపాలిటీలకు కట్టబెట్టారు. ఈ విధానం పకడ్బందీగా అమలైతే తాండూరు మున్సిపాలిటీలో వేల సంఖ్యలో అక్రమ భవనాలు, పదుల సంఖ్యలో షాపింగ్ కాంప్లెక్స్‌లు కూల్చివేసే అవకాశముంది. -
అధినేతల అడుగులు
సాక్షి, వికారాబాద్: చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. పూడూరు మండలం మిర్జాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండాను రెపరెపలాడించాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపుకోసం ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించారు. తాజాగా గులాబీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 8వ తేదీన వికారాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. రెండుపార్టీల అధినేతలు జిల్లాకు రానుండటంతో ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనియా, కేసీఆర్ రాకతో రాజకీయం మరింత వేడెక్కనుంది. మిర్జాపూర్‌లో ఏర్పాట్లు ఈనెల 7న పూడూరు మండలంలోని మిర్జాపూర్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత బట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రంలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే సభావేదిక వద్ద పనులు పూర్తయ్యాయి. చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలకు రూ.72 వేలు, సంక్షేమ పథకాలపై ఆమె ప్రసంగించనున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్, కేసీఆర్‌పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు లేకపోలేదు. 2 లక్షల మందితో సీఎం సభ సీఎం కేసీఆర్ సభ జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 8న కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాట్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ దళపతి గట్టి పట్టుదలతో ఉన్నారు. అదేవిధంగా వికారాబాద్, పరిగి, తాండూరుతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో తన ప్రసంగంతో కేసీఆర్ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈనేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపై కేసీఆర్ ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీల ప్రధాన ఎజెండా చేవెళ్ల పార్లమెంట్ పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. రెండు ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి రానుందని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మిషన్ భగీరథ తదితర పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయనే భరోసాలో టీఆర్ఎస్ ఉంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. సాగు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలతోపాటు అభివృద్ధి విషయమై హామీలు ఇవ్వనున్నారు. జోన్ అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అధినేతల ప్రసంగంలో ప్రధానంగా ఉండబోతుంది. ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఓట్లను దండిగా రాబట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు. -
గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం
సాక్షి, తాండూరు : చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్ గ్రామంలో మంగళవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఎత్తిపోతల పథకం కింద కృష్ణ జలాల నీళ్లు తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు. వికారాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతానని హామీ ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా బలహీనపడ్డాయని చెప్పారు. ఈ తరుణంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారని స్పష్టంచేశారు. కేసీఆర్ హయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించి అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి తాండూరులో కాలుష్య నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు. మూడు లక్షల మోజార్టీ ఇస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మూడు లక్షల మోజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డితో కలిసి కరన్‌కోట్‌లో రోడ్‌షో నిర్వహించారు. రంజిత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఆయనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంపై టీఆర్ఎస్ జెండా ఎగురస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గట్టు రాంచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను, వైస్ ఎంపీపీ శేఖర్, కరన్‌కోట్ సర్పంచ్ వీణ, నాయకులు శంకుతల, రాంలింగారెడ్డి, హేమంత్ తదితరులు ఉన్నారు. -
వికారాబాద్ అభ్యర్థిగా మెతుకు ఆనంద్
ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. టీఆర్ఎస్ అధిష్టానం వికారాబాద్ టీఆర్ఎస్ టికెట్‌ను డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది. ఈమేరకు బుధవారం ప్రకటించింది. జిల్లాలోని మరో మూడు టికెట్లను కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ నిరాకరించింది. టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం భారీ కసరత్తు చేసింది. పలుమార్లు మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఇతర నేతలతో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఎట్టకేలకు టికెట్ ప్రకటించడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అనంతగిరి: టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. ఈమేరకు వికారాబాద్ నియోజకవర్గం స్థానాన్ని డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటయించింది. రెండు నెలలుగా ఈ టికెట్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మొదటి జాబితాలో వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు పేరు లేకపోవడంతో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు, పలువురు డాక్టర్లు యత్నించారు. ఎట్టకేలకు అధిష్టా నం డాక్టర్ మెతుకు ఆనంద్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ బరిలో దిగారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెతుకు ఆనంద్‌కు టికెట్ రావడంతో ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో కీలక భూమిక డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేశారు. 2013–14లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2014లో ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. మెతుకు ఆనంద్ వికారాబాద్‌లో సబితాఆనంద్ పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
టికెట్ ఎవరికి ఇద్దాం..
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వికారాబాద్ టికెట్ అంశం తేలుద్దామనే ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఎట్టకేలకు కసరత్తును ముమ్మరం చేసింది. మంత్రి కేటీఆర్.. జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కొండల్‌రెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలవారీగా పార్టీ నేతలతో అభిప్రాయ సేకరణ జరిపారు. దీపావళినాడు నగరంలోని ప్రగతి భవన్‌కు ముఖ్య నేతలను పిలిపించి కేటీఆర్ మాట్లాడారు. టికెట్‌ను ఎవరికి ఇద్దాం.. ఎవరైతే గెలిచే అవకాశాలున్నాయి. మీరే చెప్పండి.. గెలిపిం చాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ ఆయన నేతలతో అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావుకు అనారోగ్య కారణాలతో టికెట్‌ను ఇవ్వలేకపోతున్నామని, బదులుగా ఎవరైతే బాగుంటుందో తెలియజేయాలని అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ అసెంబ్లీ నుంచి బరిలో దిగే అభ్యర్థి తప్పకుండా విజయం సాధించాలనే పట్టుదలతో టీఆర్ఎస్ అగ్రనేతలు ఉన్నారు. గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలోని వికారాబాద్, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, మోమిన్‌పేట్ మండలాలకు చెందిన గులాబీ ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ సమావేశమై వారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రగతిభవన్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి సుమారు 15 మందికి పైగా నేతలు టికెట్ ఆశిస్తుండగా ఇందులో ఎవరైతే బాగుంటుంది.. విజయం సాధించగలరని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు, స్థానిక వైద్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్, చిన్నపిల్లల వైడ్య నిపుణుడు టి.ఆనంద్, ఉద్యమకారులు రామేశ్వర్, వడ్ల నందు, భూమనోళ్ల కృష్ణయ్య తదితరుల పేర్లను ఆయా మండలాలకు చెందిన నాయకులు సూచించినట్లు తెలుస్తోంది. వీరు కాకుండా మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందనే అంశపైనా కేటీఆర్ వాకబు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్ మెతుకు ఆనంద్ భార్యకు టికెట్ కేటాయించే విషయాన్ని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ప్రకటించిన మూడు స్థానాలను కూడా టీఆర్ఎస్ పురుషులకు కేటాయించిన సంగతి విదితమే. ఈనేపథ్యంలో కనీసం ఒక్క సీటునైనా మహిళకు ఇస్తే ప్రజల్లోకి మంచి సంకేతం వెళ్తుందనే విషయాన్ని కూడా పార్టీ సీరియస్‌గానే యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న డాక్టర్ ఏ. చంద్రశేఖర్ పేరును కూడా కొందరు నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు అభిగ్నవర్గాల సమాచారం. అయితే, విద్యావంతుడు, న్యాయవాది పత్తి ప్రవీణ్‌కుమార్ తదితరులు సైతం వికారాబాద్ టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆశావహులు టికెట్ దక్కిం చుకునేందుకు తమకు తోచిన మార్గం లో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల అభిప్రాయాలను ఓపికగా విన్న కేటీఆర్.. టికెట్ ఎవరికి కేటాయించినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రానున్న నేపథ్యంలో ప్రతిఒక్కరికీ మంచి అవకాశాలు కల్పిస్తామని, టికెట్ రానివారు అసంతృప్తి చెందవద్దని ఆయన హితబోధ చేసినట్లు తెలిసింది. ఒకటిరెండు రోజుల్లో వికారాబాద్ టికెట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఆయన సమావేశం చివరలో వెల్లడించినట్లు పార్టీ నేత ఒకరు ‘సాక్షి’కి తెలియజేశారు. టికెట్ ఎవరిని వరిస్తుందే వేచి చూడాల్సిందే. -
టికెట్ కేటాయింపులో తొలగని ఉత్కంఠ !
సాక్షి, వికారాబాద్: నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇద్దరు మాజీ మంత్రులు టికెట్ కోసం పోటీ పడుతుండటం నియోజకవర్గ ప్రజలనే కాకుండా, జిల్లా ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్ తప్పకుండా టికెట్ తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. ఢిల్లీ స్థాయి నాయకులు టికెట్‌పై హామీ ఇవ్వడంతో వారంరోజుల క్రితం వికారాబాద్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి బలనిరూపణ చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రశేఖర్వర్గం నాయకులు ఇదే చెబుతున్నారు. ఏదిఏమైనా వికారాబాద్ టికెట్ ఏసీఆర్‌కు వస్తుందని బరిలోనిలవడం ఖాయమంటున్నారు. పదిహేను రోజులుగా డిల్లీలోనే మకాం వేసిన ఏసీఆర్ కాంగ్రెస్ పెద్దలను కలిసి టికెట్ కోరుతున్నారు. చంద్రశేఖర్ టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో ప్రసాద్ కుమార్ కూడా రంగంలోకి దిగారు. ఇన్నాళ్లు వికారాబాద్ కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్న ఆయన చంద్రశేఖర్ బైక్ ర్యాలీ తరువాత కొంత సందిగ్ధంలో పడ్డట్లు సమాచారం. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ముందస్తుగానేప్రచారం ప్రారంభించిన ప్రసాద్ కుమార్ రెండు రోజుల క్రితం హూటాహూటీన డిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖాయం చేయడంతో ఇద్దరు మాజీ మంత్రులతో పాటు, నియోజకవర్గ కార్యకర్తలో టెన్షన్ నెలకొంది. స్క్రీనింగ్ కమిటీ తయారు చేసినజాబితాలో తమ పేరు ఉందాలేదాఅనే విషయంపై సన్నిత నాయకులతో ఆరా తీస్తున్నారు. ఏదిఏమైనా వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. మొత్తం మీద హస్తం ఎవరినివరిస్తుందోనని ఓటర్లు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఎక్కడ చూసినా అవే చర్చలు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ టికెట్‌పైనే చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరుమాజీ మంత్రులు పోటీ పడుతుండటంతోతీవ్ర చర్చకు దారితీస్తుంది. పట్టణంలోని ఓ హోటళ్లలో చూసినా, నలుగురు కూడిన చోట కాంగ్రెస్ టికెట్‌పైనే చర్చించుకుంటున్నారు.గ్రామాల్లోని రచ్చబండల వద్ద, వ్యవసాయపొలాల వద్ద కూడా టికెట్ల చర్చనే జరుగుతుంది. ఓటర్లు ఎవరికివారు అంచానాలు వేస్తూ చివరిగా టికెట్ ఎవరికి దక్కుతుందో చెప్పేసుకుంటున్నారు. టీఆర్ఎస్లోనూ అదే సీన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ టికెట్ ఆశించేవారి జాబితా చాలా ఉంది. ఇక్కడి నుంచి సుమారు పది మంది ద్వితీయ శ్రేణి నాయకులు టికెట్ కోరుతున్నారు. అసెంబ్లీ రద్దు అయిన మొదట్లో ప్రతి రోజూ అధిష్టాం వద్దకు వెళ్లి టికెట్ కేటాయించాలని వేడుకుంటున్నారు. కాని టీఆర్ఎస్ అదిష్టానం మాత్రం ఎవరికీ భరోసా ఇవ్వడంలేదు. అందుకు కారణం కాంగ్రెలో నెలకొన్న పోటీయేనని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న ఇద్దరు మాజీ మంత్రుల్లో చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కితే టీఆర్ఎస్ టికెట్ ప్రసాద్ కుమార్‌కు ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ టికెట్ ప్రసాద్ కుమార్‌కే దక్కితే ఇన్నాళ్లు పార్టీలో పనిచేసిన ఏదోఒక నాయకుడికి టికెట్ కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లుతెలిసింది. ఏది ఏమైనా అధికార, ప్రతిపక్ష పార్టీల టికెట్ కేటాయింపు ప్రజలను ఆసక్తికి గురిచేస్తున్నాయి. -
భాగ్యనగరంలో భారీవర్షం
హైదరాబాద్: భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. బుధవారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం మొదలైంది. పొద్దున్నే వర్షం రావడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగొడిగా సాగుతోంది. ఈసీఎల్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కోటి, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మేఘాలు దట్టంగా అలముకోవడంతో రాత్రిని తలపిస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. దీంతో వీధి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా వెలుగు రాలేదు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీలు నీట ముగిగాయి. పరిగి, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ లో రహదార్లు జలమయం అయ్యాయి.