భాగ్యనగరంలో భారీవర్షం
హైదరాబాద్: భారీ వర్షంతో భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. బుధవారం ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం మొదలైంది. పొద్దున్నే వర్షం రావడంతో పాఠశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. రహదారులపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మందగొడిగా సాగుతోంది. ఈసీఎల్, ఉప్పల్, ఎల్ బీ నగర్, కోటి, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది.
మేఘాలు దట్టంగా అలముకోవడంతో రాత్రిని తలపిస్తోంది. నగరమంతా చీకటి వాతావరణం కమ్ముకుంది. దీంతో వీధి దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా వెలుగు రాలేదు. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో వర్షం మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
అటు రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు కాలనీలు నీట ముగిగాయి. పరిగి, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్ లో రహదార్లు జలమయం అయ్యాయి.